Begin typing your search above and press return to search.

జ‌న‌సేన స‌భ‌లో తొక్కిస‌లాట ఎందుకు జ‌రిగింది?

By:  Tupaki Desk   |   14 March 2018 12:40 PM GMT
జ‌న‌సేన స‌భ‌లో తొక్కిస‌లాట ఎందుకు జ‌రిగింది?
X
అదిరిపోయే ఏర్పాట్లు చేసిన‌ట్లుగా చెప్పి.. ప‌క్కా ప్లాన్ తో స‌భ‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లుగా మీడియాకు స‌భ‌కు సంబంధించిన బ్లూప్రింట్ సైతం అందించిన జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో తొక్కిస‌లాట చోటు చేసుకుంది. ఈ సంద‌ర్భంగా 20 మంది జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌కు గాయాలు కాగా.. కొంద‌రు పోలీసుల‌కు గాయాలు అయ్యాయి. ఇక‌.. తొక్కిస‌లాట‌ను కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయ‌టంతో ప‌వ‌న్ ప్ర‌సంగాన్ని వినాల‌ని వ‌చ్చిన వారికి దెబ్బ‌లు బోన‌స్ గా ల‌భించిన ప‌రిస్థితి.

గుంటూరు స‌మీపంలోని నాగార్జున విశ్వ‌విద్యాల‌యం ఎదురుగా జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌ను నిర్వ‌హిస్తున్నారు. భారీ ఎత్తున స‌భ‌ను నిర్వ‌హించ‌టం ద్వారా త‌మ పార్టీ బ‌లం ఏమిటో తెలియ‌జేయాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్న ప‌వ‌న్‌.. అందుకు తగ్గ‌ట్లే ప్ర‌చారాన్ని పెద్ద ఎత్తున చేప‌ట్టారు. ఒక సినిమా రిలీజ్ కు ఏ రీతిలో అయితే.. టీజ‌ర్ మొద‌లెట్టి.. పూర్తిస్థాయి ట్రైల‌ర్ రిలీజ్ చేస్తారో.. అదే రీతిలో జ‌న‌సేన ఆవిర్భావ స‌భకు సంబంధించి సోష‌ల్ మీడియాలో చేసిన హ‌డావుడి అంతాఇంతా కాదు.

అయితే.. త‌మ ప్ర‌చారానికి ఫ‌లితం ఎలా ఉంటుంద‌న్న ఉత్కంఠ‌తో ఉన్న జ‌న‌సేన నేత‌ల‌కు స‌భ‌కు పోటెత్తిన జ‌న‌సందోహం ఆనందాన్ని ఇచ్చింది. ఈ స‌భ‌ను క‌వ‌ర్ చేయ‌టానికి వివిధ మీడియా చాన‌ల్స్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్నాయి. అంతేకాదు.. ప్ర‌త్యేక చ‌ర్చ‌ను చేపట్టాయి. ఈ చ‌ర్చ‌లో పాల్గొన్న జ‌న‌సేన‌కు చెందిన నేత‌లు స‌భ‌కు దాదాపు రెండున్న‌ర ల‌క్ష‌ల మంది సాయంత్రం 5 గంట‌ల వేళ‌కు వ‌చ్చిన‌ట్లుగా చెబితే.. కొన్ని ఛాన‌ల్స్ ప్ర‌తినిధులు గ్రౌండ్ రిపోర్ట్ ల‌క్ష‌కుపైగా జ‌నం హాజ‌రైన‌ట్లు చెప్ప‌టం క‌నిపించింది.

భారీ జ‌న‌సందోహానికి త‌గ్గ‌ట్లే జ‌న‌సేన నేత‌లు బ‌హిరంగ స‌భ‌కు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయ‌టం క‌నిపించింది. మైదానంలోని స‌భా ప్రాంగ‌ణాన్ని ప‌ది బ్లాకులుగా విభ‌జించారు. 3500 ఫ్ల‌డ్ లైట్లు ఏర్పాటు చేయ‌టంతో పాటు 100X50 అడుగుల స‌భా వేదిక‌ను ఏర్పాటు చేశారు. వేదిక వెనుక భారీ ఎల్ ఈడీ తెర‌ను ఏర్పాటు చేశారు.

స‌భ‌కు వ‌చ్చే వారి కోసం 15 ల‌క్ష‌ల మంచినీళ్ల పాకెట్లు.. 5 ల‌క్ష‌ల మ‌జ్జిగ పాకెట్లు.. 500 డ్ర‌మ్ముల్లో నీటిని అందించేందుకు ఏర్పాట్లు చేశారు. 200 మంది సిబ్బంది అత్య‌వ‌స‌ర ప‌రిస్థితికి అవ‌స‌ర‌మైన వైద్య సాయం చేయ‌టానికి సిద్ధం చేయ‌టం తెలిసిందే.

మ‌రిన్ని ఏర్పాట్లు చేసిన‌ప్పుడు తొక్కిస‌లాట ఎందుకు జ‌రిగింది? లాఠీ చార్జ్ వ‌ర‌కు ఎందుకు దారి తీసిందంటే.. కార్య‌క‌ర్త‌ల అత్యుత్సాహ‌మే అన్న మాట స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. స‌భ‌కు వ‌చ్చే వారి కోసం ఏర్పాటు చేసిన బ్లాకులు నిండిపోవ‌టం.. ముందు వ‌ర‌స‌లో పెద్ద ఎత్తున ఖాళీ క‌నిపించ‌టం.. మ‌హిళ‌ల‌కుకేటాయించిన స్థ‌లం కొంత‌మేర ఖాళీగా ఉండ‌టంతో.. అక్క‌డ‌కు వెళ్లాల‌న్న అతృత ఒక‌వైపు.. ప‌వ‌న్ ను మ‌రింత ద‌గ్గ‌ర‌గా చూడాల‌న్న అభిమాన ఆవేశం క‌ల‌గ‌లిపితే తొక్కిస‌లాట‌గా చెప్పాలి.

భారీ ఎత్తున అభిమానులు త‌ర‌లిరావ‌టంతో.. ముందువైపున‌కు పంపేందుకు వీలుగా గేటు తెర‌వ‌టం తొక్కిస‌లాట‌కు కార‌ణంగా చెబుతున్నారు. ఈ ప‌రిణామాన్ని ఊహించ‌ని పోలీసులు ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేసినా.. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు వారిని ప‌ట్టించుకోకుండా వేదిక‌కు ద‌గ్గ‌ర‌గా వెళ్లేందుకు దూసుకెళ్లారు. దీంతో.. ప‌రిస్థితి అదుపు త‌ప్పింది. ఇదే 20 మందికి గాయాలు అయ్యేలా చేయ‌టంతో పాటు.. ఇరువురి ప‌రిస్థితి సీరియ‌స్ గా ఉండేలా చేసింది. ఇక‌.. చిన్న చిన్న దెబ్బ‌లు త‌గిలిన వారు వంద‌లాదిగాఉన్న‌ట్లుగా చెబుతున్నారు.