Begin typing your search above and press return to search.

కిర్లంపూడికి ‘గుర్తింపు కార్డు’తోనే ఎంట్రీ

By:  Tupaki Desk   |   8 Feb 2016 11:37 AM IST
కిర్లంపూడికి ‘గుర్తింపు కార్డు’తోనే ఎంట్రీ
X
కాపుల్ని బీసీల్లో చేర్చాలంటూ మాజీ మంత్రి.. కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆయన సతీమణి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముద్రగడ దీక్షపై బాబు సర్కారు సరిగా స్పందించటం లేదన్న భావన కాపుల్లో నెలకొని ఉండటం.. ఆయనకు మద్దతు పలికేందుకు ముద్రగడ స్వగ్రామమైన కిర్లంపూడికి పెద్ద ఎత్తున ప్రజలు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా పోలీసులు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కిర్లంపూడి గ్రామానికి వెళుతున్న వారిని అక్కడి పోలీసులు నిలిపివేయటం.. వారి దగ్గర గుర్తింపు కార్డు (రేషన్.. ఆధార్.. డ్రైవింగ్ లైసెన్స్’ లాంటివి ఏదో ఒకటి ఉంటే తప్ప కిర్లంపూడిలోకి ఎంట్రీ లేదని చెప్పటంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల ఆంక్షలు మరీ శృతి మించుతున్నాయన్న మాట పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. దీక్ష సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుంటే.. సంఘవిద్రోహ శక్తులు ఉద్యమవేత్తలుగా మారి విధ్వంసం సృష్టిస్తే శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదని పోలీసులు చెబుతున్నారు. ఏమైనా.. కిర్లంపూడికి వెళుతుంటే.. గుర్తింపు కార్డు జేబులో ఉందో లేదో చూసుకోవటం మర్చిపోవద్దన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.