Begin typing your search above and press return to search.

ఆ మ‌హిళా అధికారిపై బ‌దిలీ వేటు!

By:  Tupaki Desk   |   2 July 2017 11:06 AM GMT
ఆ మ‌హిళా అధికారిపై బ‌దిలీ వేటు!
X
నిజాయితీ గ‌ల ఓ పోలీస్ అధికారి.... అధికారంలో ఉన్న పార్టీ నేత‌ల‌తో ఢీ కొనడం.... ఆ నేత‌ల అహం దెబ్బ‌తిన‌డం....ఆ వెంట‌నే ప్ర‌భుత్వం స‌ద‌రు నిజాయితీ గ‌ల అధికారిని శంక‌ర‌గిరి మాన్యాల‌కు బ‌దిలీ చేయ‌డం... ఇటువంటి సీన్ల‌ను మ‌నం అనేక సినిమాల్లో చూశాం. సినిమాలు - నిజ జీవితం వేరు కాద‌ని ఉత్తరప్రదేశ్ మహిళా పోలీసు అధికారి శ్రేష్ట ఠాగూర్ ఘ‌ట‌న మ‌రోసారి నిరూపించింది.

అధికారంలో ఉన్న పార్టీ నేతలపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకొన్న ఆమెపై బ‌దిలీ వేటు ప‌డింది. యోగి స‌ర్కార్ ఆమెను బహ్‌ రైచ్ కు బ‌దిలీ చేసి అధికార బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించింది. యూపీలో త‌మ ప్ర‌భుత్వ‌మే అధికారంలో ఉంద‌న్న ధీమాతో నిబంధనలను ఉల్లింఘించేందుకు ప్రయత్నించిన బీజేపీ నేత ప్రమోద్ కుమార్‌కు శ్రేష్ట ఠాగూర్ ఘాటుగా స‌మాధానం చెప్పి సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. శ్రేష్ట ఠాకూర్‌ నిజాయితీపై మీడియాలో, సోష‌ల్ మీడియాలో ప్రశంసలు కూడా వెల్లువెత్తాయి

సరైన పత్రాలు లేకుండా వాహనాన్ని నడుపుతున్న ప్ర‌మోద్‌ను అడ్డుకుని జరిమానా విధించారు శ్రేష్ఠ ఠాగూర్‌. తాను బీజేపీ నేతనని ద‌బాయించ‌డంతో వారి మధ్య వాగ్వాదం జ‌రిగింది. పోలీసులకు తనిఖీలు చేసే అధికారం లేదని సీఎం చేత‌ లెటర్ రాయించుకుని వస్తే తనిఖీలు చేయ‌బోమ‌ని శ్రేష్ట ఠాకూర్ తెగేసి చెప్పారు. రాత్రింబవళ్లు కుటుంబాలను వదిలి స‌ర‌దాగా ఉద్యోగం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురిని జైలుకు కూడా పంపారు.

ఈ నిజాయితీ గ‌ల ఆఫీస‌ర్ చర్యను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న స్థానిక బీజేపీ నేతలు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. 11 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ నేరుగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకువచ్చారు. ఇంకేముంది, వారం తిరక్కుండానే శ్రేష్ట ఠాకూర్‌పై అధికారులు బదిలీ వేటు వేశారు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/