Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యేను ఈడ్చుకెళ్లిన పోలీసులు

By:  Tupaki Desk   |   9 Dec 2018 8:26 AM GMT
వైసీపీ ఎమ్మెల్యేను ఈడ్చుకెళ్లిన పోలీసులు
X
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట‌లో పోలీసులు శ‌నివారం అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. ప్రజ‌లు ఎన్నుకున్న ప్ర‌తినిధి అని కూడా చూడ‌కుండా వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవ‌య్య‌పై జులుం ప్ర‌ద‌ర్శించారు. ఆయ‌న్ను ఈడ్చుకెళ్లారు. పోలీసుల తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అధికార పార్టీ అడుగుల‌కు మ‌డుగులు ఒత్తుతున్నారంటూ పోలీసుల‌పై ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

అస‌లేం జ‌రిగిందంటే.. ‘హౌస్‌ ఫర్‌ ఆల్‌’ గృహాలను లబ్ధిదారులకు కేటాయించేందుకుగాను మంత్రి పి.నారాయణ శనివారం సూళ్లూరుపేట మున్సిపాల్టీ పరిధిలోని మన్నారుపోలూరుకు వచ్చారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత నాయుడుపేటకు బయలుదేరారు. అదే సమయంలో వట్రపాళెం వద్ద స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మంత్రి కాన్వాయ్‌ ను ఆపారు. మర్యాదపూర్వకంగా మంత్రికి శాలువా కప్పారు. జాతీయ రహదారికి పక్కనే ఉన్న వట్రపాళెంలో కనీస వసతులకు దూరంగా బతుకుతున్న నిరుపేదల బాధలు చూడాలని మంత్రిని సంజీవ‌య్య‌ కోరారు.

ఇక్క‌డే పోలీసులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. సంజీవ‌య్య ప‌ట్ల అనుచితంగా ప్ర‌వ‌ర్తించారు. గూడూరు డీఎస్పీ వీఎస్‌ రాంబాబు, స్థానిక పోలీస్‌ అధికారులు సంజీవ‌య్య‌ను ప‌క్క‌కు నెట్టేశారు. అక్క‌ణ్నుంచి ప‌క్క‌కు ఈడ్చుకెళ్లారు. దీంతో ఒక్క‌సారిగా ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. పోలీసుల తీరుకు నిర‌స‌న‌గా ఎమ్మెల్యే సంజీవ‌య్య‌ - వైసీపీ నేత‌లు ఆందోళ‌న‌కు దిగారు. పోలీస్‌ జులుం నశించాలి అంటూ నినాదాలు చేశారు.

అనంత‌రం మంత్రి నారాయ‌ణ స్పందిస్తూ.. త‌న‌కు వేరే షెడ్యూల్ ఉంద‌న్నారు. వ‌ట్ర‌పాళెంకు ప్ర‌స్తుతం తాను రాలేన‌ని చెప్పారు. షెడ్యూల్ ప్ర‌కారం నాయుడు పేట‌కు వెళ్లాల‌ని పేర్కొన్నారు. త‌న‌ను ఇంకెంత‌మాత్రం విసిగించొద్దంటూ కాస్త ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అనంత‌రం నాయుడుపేట‌కు వెళ్లారు. అక్క‌డ ఇళ్ల కేటాయింపు స‌భ‌లోనూ గంద‌ర‌గోళం నెల‌కొంది. దివంగ‌త ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డికి నివాళుల‌ర్పిస్తూ ప‌లువురు నినాదాలు చేశారు. వారిపై స్థానిక టీడీపీ నేత‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే సంజీవ‌య్య స‌భను బాయ్ కాట్ చేశారు.