Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తిచ్చిన వాళ్ల‌పై పోలీసుల జులుం

By:  Tupaki Desk   |   21 July 2017 4:30 AM GMT
ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తిచ్చిన వాళ్ల‌పై పోలీసుల జులుం
X
ప‌చ్చ‌టి పొలాల్లో విషాన్ని చిమ్ముంతుంద‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతూ.. స్థానిక ప్ర‌జ‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న మెగా అక్వా ఫుడ్ పార్క్ ను వ్య‌తిరేకిస్తూ స్థానికులు చేస్తున్న ఆందోళ‌న‌ను అణిచివేసేందుకు ఏలూరు పోలీసులు అనుసరించిన వైఖ‌రి వివాదాస్ప‌దంగా మారింది. ఆందోళ‌న‌ల్ని అధికారంతో అణిచివేయాల‌న్న‌ట్లుగా ఏలూరు పోలీసుల వ్య‌వ‌హ‌రించిన తీరు ఏపీ ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు తెచ్చేలా చేయ‌ట‌మే కాదు.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇమేజ్‌ ను దారుణంగా దెబ్బ తీసేలా ఉంద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

మెగా అక్వాఫుడ్ పార్క్‌ను ఏర్పాటు చేయ‌టం ద్వారా.. ప‌చ్చ‌టి పొలాలు.. జ‌ల‌వ‌న‌రులు కాలుష్యంలోకి చిక్కుకుపోవ‌ట‌మే కాదు.. ప‌ర్యావ‌ర‌ణాన్ని భారీగా దెబ్బ తీస్తుంద‌న్న ఆరోప‌ణ ఎప్ప‌టి నుంచో ఉన్న‌దే. ఇప్ప‌టికే ఇదే అంశంపై కొద్ది నెల‌లుగా వ‌రుస నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు.. ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. మెగా అక్వాఫుడ్ పార్క్ ఏర్పాటును జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం వ్య‌తిరేకించ‌ట‌మే కాదు.. అవ‌స‌ర‌మైతే తాను సైతం ఉద్య‌మం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉంటే.. మెగా అక్వాఫుడ్ పార్క్ నిర్మాణానికి సంబంధించి కీల‌క‌మైన సామాగ్రిని త‌ర‌లించేందుకు వీలుగా ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. పార్క్‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న అక్క‌డి స్థానికుల్ని నిలువ‌రించేందుకు.. వారి ప్ర‌య‌త్నాలు ముందుకు వెళ్ల‌కుండా నిలువ‌రించేందుకు వీలుగా ఏలూరు పోలీసులు అనుస‌రించిన వైఖ‌రి తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తేలా ఉన్నాయి.

గురువారం తెల్ల‌వారుజామున ఐదు గంట‌ల వేళ‌లో వంద‌లాది పోలీసులు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా న‌ర్సాపురం మండ‌లం కె.బేత‌పూడి.. తుందుర్రు గ్రామాల్లోని ఇళ్ల‌ల్లోకి వెళ్లి.. మ‌హిళ‌ల‌పై దాడి చేసిన‌ట్లుగా చెబుతున్నారు. పొద్దుపొద్దున్న నిద్ర‌లో ఉన్న గ్రామ‌స్తుల ఇళ్ల త‌లుపుత‌ట్టిన పోలీసులు.. ఇళ్ల‌ల్లో నుంచి అమానుషంగా రోడ్ల మీద‌కు లాక్కొచ్చార‌ని.. అదేమిట‌ని ప్ర‌శ్నించిన వారిని బూటుకాళ్ల‌తో తంతూ వాహ‌నాల్లోకి ఈడ్చి పారేసిన‌ట్లుగా చెబుతున్నారు.

గోదావ‌రి అక్వాఫుడ్ పార్క్‌కు సంబంధించిన యంత్ర‌ప‌రిక‌రాల త‌ర‌లింపును అడ్డుకుంటార‌న్న ఉద్దేశంతోనే ఈ దారుణ చ‌ర్య‌కు పోలీసులు పాల్ప‌డి ఉంటార‌ని చెబుతున్నారు. మెగా అక్వాఫుడ్ పార్క్ వ్య‌తిరేక పోరాట క‌మిటీ నేత‌లు ఆరేటి వాసు.. ఆరేటి స‌త్య‌వ‌తి.. స‌ముద్రాల వెంక‌టేశ్వ‌ర‌రావు త‌దిత‌రులను అరెస్ట్ చేసి మొగ‌ల్తూరు పోలీస్ స్టేష‌న్‌ కు త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర ఉద్రిక్త‌త‌కు గురి చేసింది. అధికార‌బ‌లంతో ఇంత దారుణానికి పాల్ప‌డ‌తారా? అంటూ పోలీసుల తీరును అక్క‌డి వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ త‌ర‌హా విధానాల వెనుక ఎవ‌రు ఉన్నా.. చివ‌ర‌కు మూల్యం చెల్లించాల్సి వ‌చ్చేది మాత్రం తాను.. త‌న స‌ర్కారే అన్న విష‌యాన్ని సీఎం చంద్ర‌బాబు గుర్తిస్తే మంచిద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.