Begin typing your search above and press return to search.

టీడీపీ నేత పట్టాభిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

By:  Tupaki Desk   |   21 Oct 2021 11:31 AM GMT
టీడీపీ నేత పట్టాభిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
X
ఏపీ సీఎం జగన్ ను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అరెస్ట్ చేసిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ను విజయవాడ గవర్నర్ పేట పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. గురువారం మధ్యాహ్నం విజయవాడలోని మూడో అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పట్టాభిపై పోలీసులు సెక్షన్ 153(ఏ), 505(2), 353,504 రెడ్ విత్ 120 (బి) కింద కేసులు నమోదు చేశారు. కొద్దిసేపటి క్రితమే పట్టాభికి విజయవాడలో వైద్య పరీక్షలు నిర్వహించారు.

బుధవారం రాత్రి పట్టాభిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. గురువారం పట్టాభిని పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తరలించే సమయంలో టీడీపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలోనే కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీ బందోబస్తు నడుమ పట్టాభిని పోలీసులు కోర్టుకు తరలించారు.

టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి సీఎం జగన్ ను పట్టుకోని 'ఒరేయ్.. బోసిడీకే' అంటూ నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ శ్రేణులు ఏకంగా టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లపై పడి ధ్వంసం చేశారు. ఇదిప్పుడు ఏపీ రాజకీయాలను కుదుపు కుదిపేస్తోంది. దీనిపై అధికార, విపక్షాలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఏపీలో విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఇప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీ నేతల మాటల యుద్ధం ఏపీలో యమ రంజుగా సాగుతోంది.