Begin typing your search above and press return to search.

ఒక్క దెబ్బకు ‘అమరావతి’ మొత్తంగా మారిపోయింది

By:  Tupaki Desk   |   11 May 2016 8:23 AM GMT
ఒక్క దెబ్బకు ‘అమరావతి’ మొత్తంగా మారిపోయింది
X
అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాలకు ఏపీ రాజధాని పోలీసులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. శరవేగంగా సాగుతున్న ఏపీ సచివాలయ పనుల్లో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు సిమెంట్ మిక్సర్ లో పడి మరణించటం.. ఈ సందర్భంగా అక్కడి నిర్మాణ కార్మికులు ఆగ్రహంతో సృష్టించిన రచ్చతో పోలీస్ శాఖ కళ్లు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. రాజధాని స్థాయి నగరానికి తీసుకోవాల్సిన వాటిల్లో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఆదమరిచి ఉన్న పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా మొద్దునిద్ర నుంచి ఉలిక్కిపడి లేచినట్లుగా వ్యవహరిస్తోంది.

తమ తోటి కార్మికుడి మరణం.. అనంతరం సచివాలయ నిర్మాణ కంపెనీ అయిన ఎల్ అండ్ టీ అధికారులు వ్యవహరించిన వైఖరితో కార్మికులు తీవ్ర ఆగ్రహావేశాల్ని వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. మృతి చెందిన కార్మికుడ్ని మృతదేహాన్ని కూడా చూపించేందుకు నో అన్న అధికారుల తీరుతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అంబులెన్స్ ను తగలబెట్టేయటం.. పోలీసుల మీద రాళ్ల దాడికి దిగటం.. ఎల్ అండ్ టీ ఆఫీసులోకి చొరబడి అక్కడి సామాగ్రిని ధ్వంసం చేసి నానా హడావుడి సృష్టించటం తెలిసిందే.

ఇలాంటి హింసాత్మక ఘటనలు జరుగుతున్నా పోలీసులు ఏమీ చేయలేక ప్రేక్షక పాత్ర పోషించాల్సిన పరిస్థితి రావటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇవాళ భవన నిర్మాణ కార్మికుల ఆందోళన కాబట్టి సరిపోయింది. రేపొద్దున ఏ సంఘ విద్రోహశక్తులైనా ఏదైనా ఆరాచకానికి పాల్పడితే సంగతేమిటన్న సందేహానికి సమాధానం లేని పరిస్థితి. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో మేల్కొన్న పోలీసు యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన ఆంక్షల్ని విధిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు.

తాజాగా విధించిన పరిమితులతో ఇకపై తాత్కాలిక సచివాలయం చుట్టు భారీ భద్రతను ఏర్పాటు చేయటంతో పాటు.. ప్రైవేటు వ్యక్తుల రాకపోకలపై నియంత్రణను విధించారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. అంతేకాదు.. స్థానికుల్ని సైతం తాత్కాలిక సచివాలయ నిర్మాణం వద్దకు రాకపోకలపై ఆంక్షల్ని విధించారు. భవిష్యత్తులో ఎలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. మరి.. ఈ బుద్ధి ఇంతకాలం ఏమైనట్లో..?