Begin typing your search above and press return to search.

పోలీస్ ఇంట్లో లెటర్ పెట్టి మరీ కన్నం ... !

By:  Tupaki Desk   |   7 July 2021 8:43 AM GMT
పోలీస్  ఇంట్లో లెటర్ పెట్టి మరీ కన్నం ...  !
X
ఇంట్లో ఎవరూ లేనిది చూసి డబ్బు, నగలను కొట్టేసినోళ్లను చాలామందిని ఉంటారు. విలువైన వస్త్రాలను దొంగతనం చేసినోళ్ల గురించి విని ఉంటారు. కోళ్లు, పెంపుడు శునకాలను అపహరించిన వాళ్ల కేసుల గురించి చదివి ఉంటారు. దొంగతనం చేసిన తర్వాత అక్కడి నుండి ఎవరూ చూడకముందే చిన్నగా జారుకుంటారు. కానీ, ఓ దొంగ కూడా అలానే దొంగతనం చేశాడు. కానీ, అలా చేసినందుకు క్షమాపణలు చెప్పాడు. అది కూడా ఓ పోలీసు ఇంట్లో కన్నం వేసి, భయం లేకుండా లెటర్ పెట్టి మరీ వెళ్లి పోయాడు. ఇంట్లో డబ్బు, నగలను దోచుకెళ్లడమే కాకుండా, వెళ్లే ముందు ఓ లెటర్ పెట్టి వెళ్లిపోయాడు. అలాగే, తాను కావాలని దొంగతనం చేయలేదని, పరిస్థితుల కారణంగా చేయాల్సి వచ్చిందని, క్షమించాలంటూ లో లేఖ కూడా పెట్టడం గమనార్హం.

ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే ... మధ్యప్రదేశ్ లోని బిండ్ నగరానికి చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ కమలేష్ కఠారీ ఇటీవల, తన కుటుంబంతో కలిసి ఊరు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి, ఇంటి తలుపులన్నీ తెరచి ఉన్నాయి. ఇంట్లోని వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఆ పక్కనే ఓ లేఖ కూడా ఉంది. అందులో సారీ ఫ్రెండ్ నన్ను క్షమించండి. ఇదంతా పరిస్థితుల కారణంగా చేయాల్సి వచ్చింది. నా మిత్రుడి ప్రాణాలు కాపాడుకునేందుకు నేను ఈ దొంగతనం చేశాను. మళ్లీ నాకు డబ్బులు రాగానే మీ దగ్గర దోచుకుంది తిరిగి ఇచ్చేస్తానంటూ లేఖలో రాశాడు. కాగా, కమలేష్ కి తెలిసిన వారే ఈ దొంగతనం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ ఇంట్లోనే దొంగలు పడ్డంతో డిపార్ట్ మెంట్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. క్లూస్ టీమ్ వచ్చి అన్ని రకాల ఆధారాలు సేకరించింది. వీలైనంత త్వరగా దొంగను పట్టుకుంటామంటున్నారు పోలీసులు. చెప్పడం కాదు, ఎలాగైనా పట్టుకోవాల్సిందే.