Begin typing your search above and press return to search.

అధికారం పోతే ఎంతటివారికైనా అంతేనా?

By:  Tupaki Desk   |   20 Jan 2015 8:49 AM GMT
అధికారం పోతే ఎంతటివారికైనా అంతేనా?
X
చేతిలో అధికారం ఉంటే ఎంత హవా నడిపించినోళ్లు అయినా సరే.. అది కాస్తా పోయాక..వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందనటానికి తాజాగా శ్రీలంగా మాజీ అధ్యక్షుడి ఇంట్లో జరిగిన సోదాలే నిదర్శనమని చెబుతున్నారు.

మొన్నటివరకూ శ్రీలంకలో తిరుగులేని నేతగా వెలిగిపోయి.. ఆత్మవిశ్వాసంతో పెరిగిపోయి.. తనకు ఎదురులేదని తలచి.. చేతిలో ఉన్న పవర్‌ను పణంగా పెట్టి అత్యాశతో ఎన్నికలకు వెళ్లిన రాజపక్సేకు ఘోర ఓటమి ఎదురుకావటం తెలిసిందే.

దేశ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఆయన.. ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా కోర్టు ఆదేశం మేరకు ఆయనకు చెందిన ఒక విలాసవంతమైన కారు ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు జరిపిన సోదాలు రాజపక్సే అభిమానుల్ని తీవ్రంగా బాధిస్తున్నాయి. ఇక.. వారి కుటుంబ సభ్యులకు అయితే తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయట.

నిన్నమొన్నటివరకూ ఇంటి బయట ఉండే పోలీసులు.. తాజాగా ఇంట్లోకి ప్రవేశించటమే కాదు.. సోదాల పేరుతో తమను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని.. మానసికంగా హింసారని రాజపక్సే కుమారుడు వాపోతున్నారు. పవర్‌లో ఉన్నప్పుడు మాదిరి ఎల్లప్పుడూ ఉంటుందని అనుకుంటే ఎలా? పవర్‌ పోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే తెలుస్తుందేమో. పోలీసుల సోదాల ఎంతగా జరిపినా.. విలాసవంతమైన కారు ఆచూకీ మాత్రం పోలీసులకు దొరకలేదట.