Begin typing your search above and press return to search.

సూది గుచ్చుడు చిన్నోడి కోసం...

By:  Tupaki Desk   |   28 Aug 2015 11:57 AM GMT
సూది గుచ్చుడు చిన్నోడి కోసం...
X
సాక్ష్యాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సీరియస్ గా తీసుకున్న విషయం... పోలీసులకు నిద్ర లేకుండా చేస్తున్న అంశం... ప్రత్యేక బృందాలు, చెక్ పోస్టులు సైతం ఏర్పాటు చేసి మరీ వెతుకుతున్న వైనం... ఇదంతా ఎవరి కోసం! ఎర్రచందనం స్మగ్లర్ కోసం కాదు, ఉగ్రవాదుల కోసం అసలే కాదు, కరుడుగట్టిన నేరస్థుడు జైలునుండి పారిపోవడం వల్ల కాదు... పశ్చిమ గోదావరి జిల్లా మహిళలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న "సూది గుచ్చుడు చిన్నోడు" గురించి. వీడిని పట్టిస్తే... ఏకంగా లక్షరూపాయలు రివార్డు కూడా ప్రకటించింది ప్రభుత్వం అంటే... పరిస్థితి అర్దం చేసుకోవచ్చు!

ఎక్కడనుండి వస్తున్నాడో తెలియదు, ఏమూలనున్నాడో తెలియదు... ఉన్నట్లుండి అందమైన పల్సర్ బైక్ పై వస్తున్నాడు, ఏమి జరుగుతుందో తెలుసుకునే లోపు సూది గుచ్చి రెయ్... మంటూ వెళ్లిపోతున్నాడు. అలా అని ఎవరిపై పడితే వారిపై ఈ దాడిచేయడు! కేవలం మహిళలు, యువతులు, విద్యార్ధినులే ఇతగాడి టార్గెట్! మెడలో ఎంత బంగారం ఉన్నా వీడికి అక్కర్లేదు. మరో కోణంలో మహిళలను చూడడు. వస్తాడు సూది గుచ్చేసి వెళ్లిపోతాడు. యావరేజ్ గా రోజుకు కనీసం నలుగురు మహిళలకు ఈ సూది దెబ్బ రుచిచూపిస్తున్నాడు. ఇంటి ముందు కళ్లాపి చల్లుకునే వారిని, ముగ్గులేసుకుంటున్నవారిని సైతం వదలడం లేదు. రావడం, పొడవడం రెయ్ మంటూ పారిపోవడం! పక్కనుండి వెళ్తున్న ప్రతీ పల్సర్ బైకుని చూసీ బయపడాల్సిన పరిస్థితి కల్పించాడు!

ప్రస్తుతం 260 ప్రత్యేక పోలీసు బృందాలు, 15 చెక్ పోస్టులు ఇతగాడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. పేరు తెలియని ఈ "సూది గుచ్చుడు చిన్నోడి" పేరున పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. దొరుకుతాడు దొరుకుతాడు... టైం వచ్చినప్పుడు తప్పకుండా దొరుకుతాడు... మరి ఈ లోగా దొరుకుతాడా... అని యమగోల సినిమాలో రావు గోపాల్ రావు డైలాగులు చెప్పుకుంటూ ఎదురుచూస్తున్నారు జనం!