Begin typing your search above and press return to search.

డీఎస్ త‌న‌యుడి కోసం ఇన్ని రాష్ర్టాల్లో వేట‌

By:  Tupaki Desk   |   5 Aug 2018 6:38 AM GMT
డీఎస్ త‌న‌యుడి కోసం ఇన్ని రాష్ర్టాల్లో వేట‌
X
సీనియర్ నేత - రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ తనయుడు సంజయ్‌ పై లైంగిక వేధింపుల కేసు మ‌లుపులు తిరుగుతోంది. తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని 11మంది నర్సింగ్ విద్యార్థినులు గురువారం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. హోంమంత్రి సూచన మేరకు శుక్రవారం ఉదయం నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ శర్మను కలిసి విద్యార్థినులు ఫిర్యాదుచేశారు. బాధిత విద్యార్థినుల వెంట వారి తల్లిదండ్రులతో పాటు పీడీఎస్‌ యూ - పీవోడబ్ల్యూ - ఐఎఫ్‌ టీయూ - పీవైఎల్ - ఏఐకేఎంఎస్ సంఘాలకు చెందిన నాయకులు ఉన్నారు. తమకు ప్రాణభయమున్నదని - లైంగిక వేధింపులకు పాల్పడిన సంజయ్‌ ను శిక్షించాలని ఈ సందర్భంగా విద్యార్థినులు సీపీని కోరారు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు సంజయ్‌ పై నిర్భయ చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. అనంతరం పోలీసులు సంజయ్‌ను అరెస్టు చేసేందుకు వెళ్లగా అప్పటికే పరారీలో ఉన్నట్టు తెలుసుకున్నారు.

అయితే, ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఉదయం తన నివాసంలో ప్రెస్‌ మీట్ పెట్టి తనకు ఏ పాపం తెలియదని చెప్పిన సంజయ్ అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. సంజయ్ కోసం గాలింపు చేపడుతున్నామని, అతనిపై నిర్భయతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. నిర్భయ కేసు నమోదైన నేపథ్యంలో ఆయన ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. కేసులో పోలీసులకు సహకరిస్తానని చెప్పిన ఆయన పరారయ్యారు. నిజామాబాద్‌ మాజీ మేయర్‌ ధర్మపురి సంజ‌య్ కోసం పోలీసులు నాలుగు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ముందస్తుగా హైకోర్టును ఆశ్రయించి యాంటిసిపెటరీ బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. కేసును సీరియస్‌ గా తీసుకున్న నిజామాబాద్‌ సీపీ కార్తికేయ ఆదేశాల మేరకు పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ - మహారాష్ట్ర - కర్నాటక తదితర ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం. మ‌రోవైపు డీఎస్ చిన్న కుమారుడు - బీజేపీ నేత ధర్మపురి అరవింద్ ఈ విషయంతో తన కుటుంబానికి సంబంధం లేదని తెలిపారు.