Begin typing your search above and press return to search.

పవన్ సభకు బందోబస్తు ఈ రేంజ్ లో ఉంది!

By:  Tupaki Desk   |   9 Sep 2016 7:41 AM GMT
పవన్ సభకు బందోబస్తు ఈ రేంజ్ లో ఉంది!
X
పవన్ కల్యాణ్ ముందుగా ప్రకటించినట్లుగానే కాకినాడ లో జరగనున్న సీమాధ్రుల ఆత్మగౌరవ సభకు జనాలు తండోప తండాలుగా వస్తున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణానికి భారీస్థాయిలో రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా, తెలంగాణ నుంచి కూడా పవన్ అభిమానులు జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సమయంలో కాకినాడ నగరంతో పాటు సభ జరిగే కాకినాడ జేఎన్టీయూ గ్రౌండ్‌లో కూడా భారీ బందోబస్తు ఏర్పాట్లు జరిగాయి.

ఇప్పటికే ప్రత్యేక హోదా రాదని కేంద్రం ప్రకటించడం, రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించడంతో.. ఆ రెండు ప్రభుత్వాలకు ఆత్మీయుడైన పవన్ కల్యాణ్ ఈ సభలో ఏమి మాట్లాడబోతున్నారు, తర్వాత ప్రణాళికలపై ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు.. ఈ సభలో దీక్షవంటి నిర్ణయాలు తీసుకుంటే తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి.. ఈ సభకు ఎక్కువ సంఖ్యలో వస్తారని భావిస్తున్న యువత ఆవేశావేశకాలకు లోనైతే పరిస్థితి ఏమిటని భావించారో ఏమో కానీ.. భారీ స్థాయిలోనే బందోబస్తు ఏర్పాటుచేశారు!

ఈ నేపథ్యంలో సుమారు వేయి మందితో బందోబస్తును నిర్వహిస్తున్నారు పోలీసులు. కాకినాడ జేఎన్టీయూ గ్రౌండ్‌లో ఇప్పటికే అధిక సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఈ సమయంలో సభా ప్రాంగణాన్ని పరిశీలిచిన ఏలూరు రేంజ్‌ డీఐజీ, అడిషనల్‌ ఎస్పీలు సిబ్బందికి పలు సూచనలు చేశారు. శాంతి భద్రతలకు ఏమాత్రం విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సభకు బందోబస్తుగా ఉభయగోదావరి జిల్లాల నుంచే కాకుండా విశాఖ, కృష్ణా జిల్లాల నుంచి పోలీసులను రప్పించారు.

కాగా ఈ సభకు హాజరయ్యేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ హైదరాబాద్‌ నుంచి రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి విచ్చేశారు. ఈ సమయంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన జనసేన నాయకులు, కార్యకర్తలు పవన్‌ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక బందోబస్తు మధ్య రోడ్డు మార్గంలో కాకినాడకు వెళ్లారు.