Begin typing your search above and press return to search.

ముద్ర‌గ‌డ ఇష్యూతో కిర్లంపూడిలో టెన్ష‌న్‌

By:  Tupaki Desk   |   7 Oct 2017 7:39 AM GMT
ముద్ర‌గ‌డ ఇష్యూతో కిర్లంపూడిలో టెన్ష‌న్‌
X
నొక్కి ప‌ట్ట‌టం కొంత మేర బాగానే ఉంటుంది. ఎంత నొక్కి పెడ‌తారో అంత‌గా పీడ‌నం పెరిగి.. అంత‌కంత‌కూ బ‌దులు ప‌క్కా అని చెప్ప‌క‌త‌ప్ప‌దు. ఉద్య‌మ నేత‌ల‌పై ప‌వ‌ర్ ను ప్ర‌యోగిస్తే.. ఒక స్థాయి వ‌ర‌కూ బాగానే ఉంటుంది కానీ.. మోతాదు మించితే అస‌లుకే ఎస‌రు అన్న‌ది నిజం. అయితే.. ఆ విష‌యాన్ని మ‌ర్చిపోతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీరు చూస్తుంటే.

కాపుల్ని బీసీల్లోకి చేర్చాల‌న్న డిమాండ్ తో ఉద్య‌మాన్ని చేస్తున్న కాపు నేత ముద్ర‌గ‌డ ప‌ద్మనాభాన్ని ప‌వ‌ర్ తో ఆయ‌న్ను ఇంటికే ప‌రిమితం చేయాల‌న్న‌ట్లుగా ఏపీ స‌ర్కారు చేస్తున్న ప్ర‌య‌త్నం తాజాగా ఆయ‌న స్వ‌గ్రామ‌మైన కిర్లంపూడిలో కొత్త ఉద్రిక్త‌త‌ల‌కు తెర తీసింది.

ఆదివారం నుంచి రెండు రోజుల పాటు కోన‌సీమ ప‌ర్య‌ట‌న‌కు ముద్ర‌గ‌డ సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న్ను ఇంటికే ప‌రిమితం చేయ‌టం కోసం ఏపీ పోలీసులు ఈ రోజు ఉదయం ముద్ర‌గ‌డ ఇంటికి పెద్ద ఎత్తున చేరుకున్న వైనంపై ఆయ‌న తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కిర్లంపూడిలోని ముద్ర‌గ‌డ నివాసంతో పాటు.. ఉరు మొత్తం ప్ర‌త్యేక బ‌ల‌గాల్ని మొహ‌రించ‌టంపై ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

ఉద్య‌మాన్ని శాంతియుతంగా నిర్వ‌హించాల‌ని భావిస్తున్న‌ప్పుడు.. అనుమ‌తులు ఇవ్వ‌టం ద్వారా ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వం ప‌ట్ల సానుకూల‌త వ్య‌క్త‌మ‌వుతుంది. అందుకు భిన్నంగా.. హౌస్ అరెస్ట్ చేసి ఇంటికే ప‌రిమితం చేయ‌టం ఉద్య‌మ‌కారుల్లో అసంతృప్తిని అంత‌కంత‌కూ పెంచుతుంద‌న‌టంలో సందేహం లేదు. కాపు ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ప‌లికిన పి.గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో అభిమానుల‌కు ఆత్మీయంగా ప‌లుక‌రించేందుకు రెండు రోజుల కోన‌సీమ యాత్ర‌ను ముద్ర‌గ‌డ ప్లాన్ చేసుకున్నారు.

అయితే.. అదేమీ జ‌ర‌గ‌కుండా ఉండేందుకు.. ముద్ర‌గ‌డ ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకునేందుకు పోలీసులు కిర్లంపూడిలో మొహ‌రించిన‌ట్లుగా చెబుతున్నారు. తాజా ప‌రిణామాలు ముద్ర‌గ‌డ‌ను అభిమానించే వారిని తీవ్రంగా క‌లిచివేసేలా ఉన్నాయి. ముద్ర‌గ‌డ ఏ కార్య‌క్ర‌మాన్ని త‌ల‌పెట్టినా పోలీసుల నుంచి త‌ప్ప‌నిస‌రిగా అనుమ‌తి తీసుకోవాల‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం బాగోలేదంటున్నారు. ముద్ర‌గ‌డ‌ను వ్య‌క్తిగ‌తంగా ఎక్క‌డికైనా వెళ్లాలంటే పోలీసుల అనుమ‌తి అక్క‌ర్లేద‌ని ఏపీ హోంమంత్ని నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప పేర్కొన్న‌ప్ప‌టికీ వాస్త‌వం మాత్రం వేరుగా ఉండ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. చిన్న చిన్న విష‌యాల‌కు పోలీసుల‌ను రంగ‌ప్ర‌వేశం చేయించ‌టం ద్వారా అధికార‌ప‌క్షంపై ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హం అంత‌కంత‌కూ పెరిగేలా చేసుకోవ‌టం అంత మంచిది కాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.