Begin typing your search above and press return to search.

ఐపీఎల్ లో మ‌ళ్లీ ఫిక్సింగ్ క‌ల‌ల‌కం

By:  Tupaki Desk   |   12 May 2017 2:52 PM GMT
ఐపీఎల్ లో మ‌ళ్లీ ఫిక్సింగ్ క‌ల‌ల‌కం
X
నాలుగేళ్ల కింద‌ట ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ లో స్పాట్ ఫిక్సింగ్ ఎంత‌టి క‌ల‌కలం రేపిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఆ దెబ్బ‌కు బోర్డులో పెద్ద పెద్దోళ్ల ప‌దవులే గ‌ల్లంత‌య్యాయి. బీసీసీఐలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. నాటి ఫిక్సింగ్ కుంభ‌కోణం నుంచి ఇంకా మ‌రిచిపోక ముందే మ‌ళ్లీ ఐపీఎల్ లో ఫిక్సింగ్ క‌ల‌క‌లం మొద‌లైంది. గుజ‌రాత్ ల‌య‌న్స్ జ‌ట్టుకు ఆడుతున్న ఇద్ద‌రు ఆట‌గాళ్లు ఫిక్సింగ్ కు పాల్ప‌డ్డ‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ బుధ‌వారం ఢిల్లీ డేర్ డెవిల్స్.. గుజ‌రాత్ ల‌య‌న్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ ను ఫిక్స్ చేసేందుకు ప్ర‌య‌త్నించిన ముగ్గురు బుకీల‌ను కాన్పూర్ పోలీసులు అరెస్టు చేశారు. ర‌మేష్ న‌య‌న్ షా.. ర‌మేష్ కుమార్.. వికాస్ చౌహాన్ ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరు ఇద్ద‌రు గుజ‌రాత్ ఆట‌గాళ్ల సాయంతో మ్యాచ్ ను ఫిక్స్ చేసే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ ఆట‌గాళ్లెవ‌ర‌న్న‌ది వెల్ల‌డి కాలేదు.

పోలీసుల‌కు దొరికిన నిందితుల్లో ఒక‌రు త‌న‌కు గుజ‌రాత్ గ్రౌండ్స్ మ‌న్ తో ప‌రిచ‌యం ఉంద‌ని.. పిచ్ కు ఎక్కువ నీళ్లు ప‌ట్టించి త‌క్కువ స్కోరు న‌మోద‌య్యేలా స‌హ‌క‌రిస్తాన‌ని బెట్టింగ్ ముఠాకు హామీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఐతే ఆ మ్యాచ్ బెట్టింగ్ ముఠా అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు జ‌ర‌గ‌లేదు. మొద‌ట బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ 196 ప‌రుగులు చేయ‌గా.. దిల్లీ ఆ స్కోరును ఛేదించేసింది. ఐతే ఇద్ద‌రు గుజ‌రాత్ ఆట‌గాళ్లు ఫిక్సింగ్ కోసం స‌హ‌క‌రించేందుకు అంగీక‌రించిన‌ట్లు పోలీసులు చెబుతున్నారు. బీసీసీఐ అవినీతి నిరోధ‌క విభాగం అధికారులు.. కాన్పూర్ పోలీసులతో క‌లిసి ఈ కేసును విచారిస్తున్నారు. విచార‌ణ అనంత‌రం దీనికి సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశ‌ముంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/