Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ మ‌హా ధ‌ర్నాపై పోలీసుల అత్యుత్సాహం!

By:  Tupaki Desk   |   22 Jun 2017 8:59 AM GMT
జ‌గ‌న్ మ‌హా ధ‌ర్నాపై పోలీసుల అత్యుత్సాహం!
X
అధికారం చేతిలో ఉన్న‌ప్పుడు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. ప్ర‌భుత్వం మీద మ‌చ్చ ప‌డే అంశాలు ఏమైనా వ‌చ్చే ప్ర‌మాదం ఉన్న‌ప్పుడు అలాంటి వాటి విష‌యంలో మ‌రింత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ.. ఇలాంటివేమీ చేయ‌ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీరుతో.. ఆయ‌న పాల‌న‌పై ప‌లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఏపీలోని విశాఖ‌ప‌ట్నంలో ఇటీవ‌ల కాలంలో భారీ ఎత్తు భూక‌బ్జాలు చోటు చేసుకుంటున్న‌ట్లుగా అధికార‌ప‌క్షంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. చివ‌ర‌కు ఏపీ స‌ర్కారుకు మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్న బీజేపీ నేత‌లు సైతం.. భూక‌బ్జాల‌పై స్పందించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఏపీ అధికార‌ప‌క్ష నేత‌లు సైతం భూక‌బ్జాల‌కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పుతున్నారు.

ఇదిలా ఉంటే.. భూక‌బ్జాల మీద సిట్ దర్యాప్తు చేస్తున్న‌ట్లుగా ఏపీ ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు. అయితే.. సొంత‌పార్టీ నేత‌లు సైతం సీబీఐ ద‌ర్యాప్తు చేపట్టాల‌ని కోరుతుంటే.. బాబు మాత్రం సీఐడీ విచార‌ణ‌కు ఆదేశాలు జారీ చేయ‌టంతో పార్టీ నేత‌ల నోట నుంచి మాట రాని ప‌రిస్థితి.

క‌బ్జా ఇష్యూలో పీక‌ల్లోతు విమ‌ర్శ‌ల్లో ఇరుక్కుపోయిన ఏపీ స‌ర్కారు తీరును త‌ప్పు ప‌డుతూ ఏపీ విప‌క్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సేవ విశాఖ పేరుతో మ‌హా ధ‌ర్నా కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు విశాఖ‌కు వ‌చ్చిన జ‌గ‌న్‌ కు.. ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికేందుకు వ‌చ్చిన కార్య‌క‌ర్త‌లు.. అభిమానుల విష‌యంలో విశాఖ పోలీసులు అత్యుత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించార‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.
ర్యాలీకి అనుమ‌తి లేదంటూ ఆంక్ష‌లు విధించ‌టంతో పాటు..విశాఖ ఎయిర్ పోర్ట్‌ కు చేరుకున్న జ‌గ‌న్ పార్టీ నేత‌లు.. కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేశారు.

కార్య‌క‌ర్త‌ల వాహ‌నాలు.. నెంబ‌ర్లు.. పేర్లు.. వివ‌రాలు తీసుకున్నాక ఎయిర్ పోర్ట్‌లోకి అనుమ‌తించ‌టం ఒక‌టైతే.. జ‌గ‌న్ కు స్వాగ‌తం చెబుతూ అభిమానులు.. పార్టీ కార్య‌క‌ర్త‌లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల‌ను తొల‌గించ‌టంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. నిబంధ‌న‌లు ఎప్పుడూ ఒకేలా ఉండాల‌ని.. అధికార‌పార్టీకి ఒక‌రకంగా.. విపక్షం విష‌యంలో మ‌రోలా ఉండ‌కూడ‌ద‌ని మండిప‌డుతున్నారు. పోలీసుల తీరుపై జ‌గ‌న్ పార్టీ నేత‌లు..కార్య‌క‌ర్త‌లు తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/