Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ తో జత కట్టి.. గులాబీ పార్టీకి సేవలు.. అదెలా పీకే?

By:  Tupaki Desk   |   24 April 2022 8:30 AM GMT
కాంగ్రెస్ తో జత కట్టి.. గులాబీ పార్టీకి సేవలు.. అదెలా పీకే?
X
సమకాలీన రాజకీయాల్లో సంచలనంగా మారారు పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయంలోనూ.. మోడీని ప్రధానమంత్రిని చేయటంలో ఆయన కీలక భూమిక పోషించటం తెలిసిందే. ఆ తర్వాత నుంచి సంబంధం లేని పార్టీలకు రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తూ.. వారిని విజయ తీరాలకు చేర్చటం.. అధికార పక్షంగా అవతరించేలా చేయటంలో ఆయన సక్సెస్ రేట్ మామూలుగా లేదన్నది తెలిసిందే. ఇటీవల తెలంగాణ రాష్ట్ర అధికారపక్షమైన టీఆర్ఎస్ తో ఆయన ఒప్పందం చేసుకున్నారు. వచ్చే ఎన్నికల వరకు ఆయన టీఆర్ఎస్ కు సేవలు అందించనున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా ఇప్పటికే రెండు వరుసల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సర్వే నిర్వహించిన పీకే టీం.. అందుకు సంబంధించిన రిపోర్టుల్ని సిద్ధం చేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఉప్పు.. నిప్పులా ఉండే కాంగ్రెస్ - టీఆర్ఎస్ మధ్య సమన్వయం ఎలా చేస్తారన్నది ఇప్పుడో పెద్ద ప్రశ్నగా మారింది. తెలంగాణ రాష్ట్ర సాధన నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి తెలిసినంత బాగా మరెవరికి తెలీదని చెబుతుంటారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే.. కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ను విలీనం చేస్తానని గులాబీ బాస్ కేసీఆర్ మాట ఇవ్వటం.. ఆ తర్వాతి కాలంలో తూచ్ అని ముఖం చాటేయటం తెలిసిందే. అప్పటి నుంచి కేసీఆర్ ప్రస్తావనను సోనియాగాంధీ తీవ్రంగా వ్యతిరేకిస్తారని చెబుతారు. అలాంటి కేసీఆర్ కు ఓవైపు రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ లో చేరతానని చెప్పటం ఎలా సాధ్యం? ఓవైపు సోనియాను ఒప్పించి.. మరోవైపు కేసీఆర్ చేత ఓకే అనిపించటం అంత తేలికైన విషయం కాదు. ఈ క్లిష్ట సాధ్యమైన కాంబినేషన్ ను పీకే ఎలా చేస్తున్నారన్నది ఆసక్తికరమని చెబుతారు.

ఇప్పటికే పలుమార్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయిన పీకే.. ఆయన మైండ్ సెట్ ను చదివేశారన్న వాదన వినిపిస్తూ ఉంటుంది. మర మేధావిగా ముద్రపడ్డ కేసీఆర్ సైతం.. పీకే కు ప్రభావితమయ్యారని చెబుతారు. ఈ క్రమంలోనే ఆయన మైండ్ సెట్ ను చదివే ప్రేయత్నం చేశారని.. అందులో పట్టు సాధించారన్న మాట వినిపిస్తోంది. ఏ విషయాన్ని ఎలా చెబితే కేసీఆర్ కన్వీన్స్ అవుతారన్న విషయంపై పీకేకు అనుభవం వచ్చిందని చెబుతున్నారు.

ప్రశాంత్ కిశోర్ మేజిక్ ను పూర్తిగా నమ్మే కేసీఆర్.. ఆయన వ్యూహాలతో ఈసారి ఎన్నికల్లో గట్టెక్కాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా గులాబీ పార్టీకి తాను సేవలు అందిస్తానని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. మరో కీలక అంశం ఏమంటే.. కేంద్రంలో యూపీఏ సర్కారును కొత్త కాంబినేషన్ లో అధికారంలోకి తీసుకురావాలన్న పట్టుదలతో ఉన్నట్లు చెబుతారు. ఇందులో భాగంగా అటు సోనియాకు.. ఇటు కేసీఆర్ కు ఒక రాజీ ఫార్ములాను తెర మీదకు తెచ్చినట్లుగా తెలుస్తోంది.

దీని ప్రకారం సార్వత్రిక ఎన్నికల వరకు ఎవరికి వారుగా వ్యవహరించటం.. ఆ తర్వాత వెలువడే ఫలితాల ఆధారంగా ఏమేం చేయాలన్న అంశాన్ని చర్చించుకోవాలన్న సూచనకు ఇరు వర్గాలు ఓకే చెప్పినట్లుగా సమాచారం. ఈకారణంగానే ఓవైపు కాంగ్రెస్ లో చేరుతానని చెప్పి.. మరోవైపు టీఆర్ఎస్ కు సేవలు అందించటానికి కారణమని చెబుతున్నారు.

మొత్తంగా చూసినప్పుడు ఎవరికి కొరుకుడుపడని కేసీఆర్ ను పీకే మ్యాప్ చేశారన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. దేశ రాజకీయాల్లో కీలకభూమిక పోషించాలన్న పీకే ఆశ నెరవేరటమే కాదు.. ఎవరూ ఊహించలేని కాంబినేషన్లను తెర మీదకు తీసుకురావటం పీకే ప్రత్యేకతగా చెప్పక తప్పదు.