Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌పై ముప్పేటా దాడి!?

By:  Tupaki Desk   |   16 Aug 2021 11:30 AM GMT
జ‌గ‌న్‌పై ముప్పేటా దాడి!?
X
దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజశేఖ‌ర్‌రెడ్డి వార‌సుడిగా రాజ‌కీయాల్లో అడుగుపెట్టి.. 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్షానికే ప‌రిమిత‌మైన‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల్లో ఉంటూ 2019 ఎన్నిక‌ల్లో తిరుగులేని మెజార్టీతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. గ‌త ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీపై ప్ర‌జల్లో వ్య‌తిరేక‌త‌ను సొమ్ము చేసుకున్న ఆయ‌న ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. ఈ దెబ్బ‌తో మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప‌రిస్థితి ఏపీలో ద‌య‌నీయంగా మారింది. ఇప్పుడు అధికారం చేప‌ట్టిన జ‌గ‌న్ పాల‌న రెండున్న‌రేళ్ల‌కు చేరువ‌వుతోంది. అయితే ప్ర‌స్తుతం ఆ రాష్ట్ర రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. జ‌గ‌న్‌పై ముప్పేటా దాడి జ‌రుగుతున్న‌ట్లే క‌నిపిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల తేవ‌డం కోసమే ఈ ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయ‌ని దిల్లీ వ‌ర్గాల్లో ప్ర‌చారం సాగుతోంది.

ప్ర‌స్తుతం వివిధ కేసుల విష‌యంలో బెయిల్‌పై ఉన్న జ‌గ‌న్ పాల‌న కొన‌సాగిస్తున్నారు. అధికారం చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న ప్ర‌యాణం బాగానే సాగుతోంది. కానీ ఇప్పుడు జాతీయ స్థాయిలో మారుతున్న ప‌రిణామాలు జ‌గ‌న్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ముఖ్యంగా మ‌రో ఏడాదిలోనే రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చేలా చూసేందుకు వ్యూహాలు సిద్దం చేస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పుడు జోరుగా చ‌ర్చ సాగుతోంది. జ‌గ‌న్‌పై అన్నివైపుల నుంచి ఒత్తిడి తెచ్చి రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్న‌క‌లు వచ్చేలా చేయ‌డ‌మే కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ వ్యూహంగా క‌నిపిస్తోందని విశ్లేష‌కులు అంటున్నారు. అందులో భాగంగానే వైసీపీ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త పెంచే దిశ‌గా క‌స‌ర‌త్తులు చేస్తోంద‌నే అభిప్రాయాలు విన‌బ‌డుతున్నాయి.

ప్ర‌స్తుతం ఏపీ ఆర్థిక ప‌రిస్థితి రోజురోజుకూ దిగ‌జారుతోంది. అప్పులు పెరుగుతున్నాయి కానీ అందుకు త‌గిన‌ట్లుగా ఆదాయం మాత్రం స‌మ‌కూర‌డం లేద‌నేది కాద‌న‌లేని నిజం. దీంతో పాల‌న జ‌గ‌న్‌కు భారంగా మారుతోంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. మ‌రోవైపు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు, అధికార వ్య‌తిరేక మీడియా ఇలా అన్నివైపుల నుంచి జ‌గ‌న్‌ను చుట్టుముట్టారు. నిజానికి రాష్ట్రంలో జ‌గ‌న్ స‌ర్కారును కూల్చడం అంత సుల‌భం కాదు. ఆయ‌న ప్ర‌భుత్వానికి భారీ మెజార్టీ ఉంది. ఒక‌వేళ ఆ ప‌రిస్థితి వ‌చ్చి ఎన్నిక‌లు ముందుగానే వ‌చ్చినా బీజేపీకి అక్క‌డ అధికారంలోకి వ‌చ్చేంత బ‌లం లేదు. అయితే ఆ పార్టీకి అంత బ‌లం లేక‌పోయినా.. త‌మ‌తో జ‌త‌క‌ట్టే పార్టీల‌ను ఆస‌ర‌గా చేసుకుని అధికారంలో వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని.. ప్రస్తుత ఆర్థిక ప‌రిస్థితిని సాకుగా చూపి జ‌గ‌న్‌పై చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ క్ర‌మంలో ఆర్థిక ఎమ‌ర్టెన్సీ విధించే అవ‌కాశాన్నీ కొట్టిపారేయ‌లేమ‌ని రాజ‌కీయ వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు. ఒక‌వేళ అదే జ‌రిగితే.. అప్పుడు ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి ఎన్నిక‌ల‌కు వెళ్ల‌మ‌ని జ‌గ‌న్‌పై ఒత్తిడి తేవ‌డ‌మే బీజేపీ అధిష్ఠానం ప‌న్నిన వ్యూహ‌మ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఈ త‌తంగాన్ని మ‌రో ఆరు నెల‌ల్లో పూర్తి చేసే వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఇత‌ర రాష్ట్రాల ఎన్నిక‌ల‌తో పాటే ఏపీలోనూ ఎన్నిక‌లు వ‌చ్చేలా ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్నార‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ విష‌యంలోనూ బీజేపీ నేత‌లు అధిక ప్రాధాన్య‌త‌నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల ఏపీలో త‌మ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోంద‌ని వైసీపీ నేత‌లు ఆరోపించిన సంగ‌తి తెలిసిందే.