Begin typing your search above and press return to search.

తెలంగాణ జిల్లాల్లో రాజ‌కీయ సంద‌డి.. ఏం జ‌రుగుతోందంటే!

By:  Tupaki Desk   |   18 Jun 2022 2:30 AM GMT
తెలంగాణ జిల్లాల్లో రాజ‌కీయ సంద‌డి.. ఏం జ‌రుగుతోందంటే!
X
తెలంగాణ‌లోని హైద‌రాబాద్ మిన‌హా 33 జిల్లాల్లోనూ రాజ‌కీయ సంద‌డి క‌నిపిస్తోంది. అధికార పార్టీ స‌హా ప్రధాన రాజకీయ పక్షాలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి బలోపేతం కావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో పేరిట ప్రజల్లోకి వెళ్లి తమ వాణిని వినిపిస్తున్నాయి.ప్ర‌ధానంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా నేరుగా ఓటరు వద్దకు వెళ్లుతున్నాయి.దీంతో జిల్లాల్లో రాజకీయ పార్టీల సందడి జోరందుకుంది. నిత్యం ఎదో ఒక పార్టీ నేత, ఏదో ఒక కార్యక్రమం పేరిట ప్రజల వద్దకు వస్తున్నారు.

రాష్ట్రంలో ముందస్తు శాసన సభ ఎన్నికలు జరగవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు తమ దూకుడును పెంచుతున్నారు. ముఖ్యంగా ఈ జోరు అధికార టీఆర్‌ఎస్ లోనే ఎక్కువగా క‌నిపిస్తోంది. ప్రభుత్వ పథకాలపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులు విస్తృత ప్ర చారం నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,పార్టీ ఇతర ప్రజాప్రతినిధులు ప్రజలతో భాగస్వామ్యమై కార్యక్ర మాలు నిర్వహిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ సర్కారు చేపట్టిన పథకాలను వివరించడం, లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి,షాధీ ముబారక్‌, సీఎం సహా య నిధి వంటి చెక్కులను గడప వద్దకు వెళ్లి అందించడం వంటి కార్యక్రమాలను చేప‌డుతున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు పల్లె ప్రగతి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. దీనికి తోడు మంత్రులు కేటీ ఆర్‌, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవి త సైతం ఇటీవల దాదాపు అన్ని జిల్లాల్లోనూ పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ కూడా గ్రామాల్లో రచ్చబండ నిర్వహిస్తూ రైతుల వద్దకు వెళ్తోంది. అదేవిధంగా మ‌రో ప్ర‌ధాన ప‌క్షం బీజేపీ.. కూడా దూకుడు పెంచింది. కేంద్ర ప్రభుత్వ పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఇంటింటి ప్రచారాన్ని కమలనాథులు తీవ్ర త‌రం చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అరాచక పాలన అందిస్తోందని విమర్శిస్తూనే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు, పథకాలు, అభివృద్ధి పనులను వివరిస్తున్నారు.

అటల్‌ పెన్షన్‌ యోజన, ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన, స్వచ్చ భారత్‌, జనని సురక్ష, బేటి బచావో, బేటి పడావో, సర్వ శిక్షా అభియాన్‌, ప్రధానీ ఫసల్‌ బీమా యోజన, ఉజ్వల యోజన తదిత ర కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముద్రించిన కరపత్రాల‌ను విస్తృతంగా పంపిణీ చేస్తున్నారు. వ్యక్తిగత సేవా కార్యక్రమాల్లో ఆశావహలు...జిల్లాల్లో ప్రధాన రాజకీయ పక్షాలకు చెందిన బాధ్యులతో పాటు ఆయా పార్టీల నుంచి టిక్కెట్లను ఆశిస్తున్న పలువురు నేతలు సైతం ప్రజల్లోకి వె ళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

అదేస‌మ‌యంలో వ్యక్తిగత ప్రాబాల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న‌వారు కూడా ఉన్నారు. దీనికితోడు ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇతర ఆశావహులు సైతం పావులు కదుపుతున్నారు. సేవా కార్యక్రమాల పేరిట ప్రజల్లోకి వెళ్తున్నా రు. వైద్య శిబిరాలను నిర్వహించడం, స్వచ్చంద సేవా సంస్థల కార్యక్రమా ల్లో భాగస్వామ్యం అవడం, విరాళాలు ఇవ్వడం, సహాయాలు చేయడం వంటి పనులను నిర్వహిస్తున్నారు. ఇలా మొత్తంగా తెలంగాణ జిల్లాల్లో రాజ‌కీయ సంద‌డి జోరందుకోవ‌డం గ‌మ‌నార్హం.