Begin typing your search above and press return to search.

క‌ర్ణాట‌క రాజ‌కీయంలో టాప్ 5 ఆప్డేట్స్‌

By:  Tupaki Desk   |   18 May 2018 9:28 AM GMT
క‌ర్ణాట‌క రాజ‌కీయంలో టాప్ 5 ఆప్డేట్స్‌
X
క‌ర్ణాట‌క రాజ‌కీయంలో చోటు చేసుకున్న ప‌రిణామాలు తెలిసిందే. గంట గంట‌కూ చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌తో రాజకీయం మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింది. నిన్న‌టివ‌ర‌కూ వాతావ‌ర‌ణం ఒక‌ర‌కంగా ఉంటే.. ఈ రోజు ఉద‌యం సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాల‌తో బీజేపీ గొంతులో ప‌చ్చివెల‌క్కాయ ప‌డిన ప‌రిస్థితి.

అతి పెద్ద పార్టీగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గ‌వ‌ర్న‌ర్ ఆహ్వానించ‌టం.. య‌డ్యూర‌ప్ప ముఖ్య‌మంత్రి ప‌ద‌విని చేప‌ట్ట‌టం తెలిసిందే. ప్ర‌భుత్వం త‌న బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించుకోవ‌టానికి 15 రోజుల గ‌డువు ఇవ్వటంపై సుప్రీం అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ.. రేపు (శ‌నివారం) సాయంత్రం 4 గంట‌ల‌కు బ‌ల‌ప‌రీక్ష చేప‌ట్టాల‌ని ఆదేశించింది.

ఈ నేప‌థ్యంలో క‌ర్ణాట‌క రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారిపోతున్నాయి.

1. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే య‌డ్యూర‌ప్ప వివాదాస్పద రీతిలో నిర్ణ‌యాలు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. బ‌ల‌ప‌రీక్ష పూర్తికాక ముందే నామినేటెడ్ ఎమ్మెల్యేను నియ‌మించారు. దీనిపై విప‌క్షాలు తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తాయి. ఈ త‌ర‌హాలో య‌డ్డీ స‌ర్కారు ఎలాంటి కీల‌క నిర్ణ‌యాలు తీసుకోకూడ‌దంటూ ఆదేశాలు జారీ చేసింది. తాత్కాలిక స్పీక‌ర్ ను నియ‌మించాల‌ని.. ఎలాంటి ప‌ద‌వుల్లోనూ నాయ‌కుల్ని నియ‌మించొద్ద‌ని స్ప‌ష్టం చేసింది. బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గిన త‌ర్వాత మాత్ర‌మే య‌డ్యూర‌ప్ప విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని పేర్కొంది.

2. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేప‌థ్యంలో కర్ణాట‌క గ‌వ‌ర్న‌ర్ వ‌జూభాయ్ వాలా రియాక్ట్ అయ్యారు. రాజ్ భ‌వ‌న్ లో 12 మంది న్యాయ నిపుణుల‌తో చ‌ర్చ‌లు నిర్వ‌హిస్తున్నారు. శాస‌న‌స‌భ అత్య‌వ‌స‌ర స‌మావేశానికి నోటిఫికేష‌న్ జారీ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

3. బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టానికి క‌ర్ణాట‌క గ‌వ‌ర్న‌ర్ ఆహ్వానించ‌టానికి సంబంధించి ఆస‌క్తిక‌ర అంశాలు సుప్రీంకోర్టు వాద‌న‌ల్లో బ‌య‌ట‌కువ‌చ్చాయి. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు త‌గినంత మంది ఎమ్మెల్యేల బ‌లం త‌మ‌కు ఉందంటూ బీజేపీ పేర్కొన‌టం తెలిసిందే. దీనికి సంబంధించి ఒక లేఖ‌ను గ‌వ‌ర్న‌ర్ కు ఇచ్చారు. అయితే.. ఈ లేఖ‌లో త‌మ‌కు ఎంత‌మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉంద‌న్న విష‌యాన్ని.. వారి వివ‌రాల్ని పేర్కొన‌కుండా కేవ‌లం.. త‌మ‌కు మ‌ద్ద‌తు ఉంద‌ని మాత్ర‌మే రాసి ఇచ్చిన వైనాన్ని సుప్రీం దృష్టికి వెళ్లింది. గ‌వ‌ర్న‌ర్ కు య‌డ్డీ ఇచ్చిన లేఖ‌లో ఆయ‌న సంత‌కంతో పాటు.. ఎమ్మెల్యేల మ‌ద్దుతు మాత్ర‌మే ఉంద‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

4. రెండు రోజులుగా క‌నిపించ‌కుండా పోయార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న కర్ణాట‌క కాంగ్రెస్ నేత‌లు ప‌ర‌మేశ్వ‌ర్.. డీకే శివ‌కుమార్ లు కొట్టిపారేశారు. ఎమ్మెల్యేలు అదృశ్య‌మ‌య్యారంటూ త‌మ మీద వ‌స్తున్న వార్త‌ల్ని నిజం కావ‌న్నారు. య‌డ్యూర‌ప్ప‌కు ఉన్నంత తొంద‌ర త‌మ‌కు లేద‌ని.. త‌మ‌తో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ట‌చ్ లో ఉన్న‌ట్లుగా చెప్పారు.

5. సుప్రీంకోర్టు తాజా తీర్పుపై క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప స్పందించారు. త‌మ ప్ర‌భుత్వం విశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గుతుంద‌ని చెప్పారు. బ‌ల‌ప‌రీక్ష‌కు తాము సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పారు. ప్ర‌భుత్వాన్ని బ‌ల‌ప‌రిచేందుకు త‌గిన ఎమ్మెల్యేల బ‌లం త‌మ‌కు ఉన్న‌ట్లు పేర్కొన్నారు. సుప్రీం ఆదేశాల్ని తాము పాటిస్తామ‌ని పేర్కొన్నారు. త‌మ ప్ర‌భుత్వానికి అధిక్య‌త ఉంద‌న్న విష‌యాన్ని తాము రుజువు చేసుకోనున్న‌ట్లు చెప్పారు.