Begin typing your search above and press return to search.

రజనీ- కమల్ ల లడాయి తప్పదా?

By:  Tupaki Desk   |   2 Jan 2018 7:15 AM GMT
రజనీ- కమల్ ల లడాయి తప్పదా?
X
రజనీకాంత్ - కమల్ హాసన్ ఇద్దరూ తమిళనాడులో ఉన్న అగ్ర హీరోలు. ఇద్దరూ సూపర్ స్టార్ లు. ఇద్దరూ ఇంచుమించుగా ఒకేసారి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. దాదాపుగా ఒకేస్థాయికి ఎదిగారు. అయితే ఇద్దరూ రెండు పూర్తి భిన్నమైన నటనా కెరీర్ గ్రాఫ్ తో... అగ్రస్థానానికి వచ్చిన వారే. ఇద్దరూ దర్శకుడు బాలచందర్ శిష్యలుగానే ఇండస్ట్రీలోకి వచ్చిన వారే. ఇలా ఈ ఇద్దరి మధ్య చాలా సారూప్యతలే ఉన్నాయి. అలాగే ఈ ఇద్దరు సూపర్ స్టార్ ల మధ్య మంచి స్నేహం కూడా ఉంది. అయితే ఈ ఇద్దరి మధ్య రాజకీయంగా మాత్రం లడాయి తప్పకపోవచ్చుననే సంకేతాలు తమిళనాట కనిపిస్తున్నాయి.

ఈ ఇద్దరు నటులు కూడా దాదాపుగా ఒకే సీజన్ లో రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. వీరి మధ్య ఉండే స్నేహం గురించి తెలిసిన వారు.. మరో ఊహకు రావడానికి కూడా ఆస్కారం ఉంది. వేర్వేరు పార్టీలు పెట్టుకోవచ్చు గాక.. కానీ ఇద్దరూ కలిసే ఒక కూటమిగా ఎన్నికల బరిలోకి దిగితే.. ఎక్కువ ఎడ్వాంటేజీ సాధించగలరని ఎవరైనా అనుకోవచ్చు. కానీ.. వాస్తవంలోకి వెళ్లినప్పుడు అలాంటి పరిస్థితి లేదని పలువురు భావిస్తున్నారు. రజనీకాంత్ - కమల్ హాసన్ ఇద్దరూ రాజకీయ సమరాంగణంలో ఒకరితో ఒకరు తలపడక తప్పని పరిస్థితి ఉత్పన్నం అవుతుందని అంచనా వేస్తున్నారు.

రజనీ కంటె ముందే రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన కమల్ హాసన్.. తన పార్టీ విధానం ఏ విధంగా ఉండబోతున్నదో కూడా కొన్ని సంకేతాలు ఇచ్చేశారు. ప్రస్తుతం తమిళనాడులో కీలకంగా ఉన్న డీఎంకే - అన్నా డీఎంకేలతో గానీ - జాతీయ స్థాయిలో కీలక పార్టీలు భాజపా - కాంగ్రెస్ లతో గానీ.. సమాన దూరం మెయింటైన్ చేయబోతున్నట్లుగా కమల్ సంకేతాలు ఇచ్చారు. ఈ నాలుగు పార్టీల వైఖరులను కూడా ఆయన తీవ్రంగా దుమ్మెత్తి పోయడం ద్వారా తన రాజకీయ వైఖరి స్వతంత్రంగా ఉంటుందనే సంకేతాలు ఇచ్చారు. మహా అయితే వామపక్ష పార్టీలు కీలకంగా ఉండే మరో కూటమితో కమల్ జతకట్టవచ్చుననే సంకేతాలు కూడా కొన్ని వచ్చాయి.

ఇదంతా నాణేనికి ఒకవైపు కాగా - రెండో వైపున రజనీకాంత్ పార్టీ ప్రకటించిన తర్వాత.. భాజపా ఆయన దగ్గర కాబోతున్నట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. రజనీతో పొత్తు పెట్టుకుని తమిళనాట తమ ప్రాబల్యం పెంచుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్రమోడీకి రజనీతో సత్సంబంధాలే ఉన్నాయి. పైగా మోడీ కి అనుకూలంగా గతంలో రజనీ అనేక ప్రకటనలు చేశారు కూడా. మోడీ హవా - వ్యూహం సాగితే గనుక.. రజనీ కమలదళంతో పొత్తు పెట్టుకుంటారనేది ఎక్కువమంది విశ్లేషణ.

ఈ రెండు కాంబినేషన్లు కుదిరితే.. రజనీ- కమల్ తమిళనాట ముఖాముఖి తలపడే పరస్థితి వస్తుంది. ఏ సూపర్ స్టార్ సూపర్ హిట్ అవుతాడో వేచిచూడాలి. తేలడానికి చాలా సమయమే ఉంది.