Begin typing your search above and press return to search.

హుజూరాబాద్‌లో రాజ‌కీయ మంట‌లు.. ఈట‌ల వ‌ర్సెస్ కౌశిక్ రెడ్డి

By:  Tupaki Desk   |   5 Aug 2022 9:30 AM GMT
హుజూరాబాద్‌లో రాజ‌కీయ మంట‌లు.. ఈట‌ల వ‌ర్సెస్ కౌశిక్ రెడ్డి
X
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో అధికార టీఆర్ ఎస్‌, ప్ర‌తిప‌క్షం బీజేపీ నేత‌ల మ‌ధ్య‌ సవాళ్లు - ప్రతి సవాళ్లు రాజ‌కీయ మంట‌లు రేపుతున్నాయి. దీంతో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలంటూ ఇరు పార్టీల నేతలు సవాళ్లు విసురుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 10 నెలల క్రితం జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్‌లోకి వచ్చిన కౌశిక్రెడ్డికి ఎమ్మెల్సీ పదవి రావటంతో.. ఆయన వరుసగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ఇక్కడి నుంచి గెలిచిన ఈటల రాజేందర్ బీజేపీ రాష్ట్ర స్థాయిలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే గత వారం రోజులుగా టీఆర్ ఎస్‌, బీజేపీల మధ్య అభివృద్ధి విషయమై సవాళ్లు-ప్రతి సవాళ్లు రాజుకున్నాయి.

అధికార పార్టీ చేస్తున్న అభివృద్ధే నియోజకవర్గంలో ఉందని.. ఈ విషయమై ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్‌ బహిరంగ చర్చకు రావాలని కౌశిక్రెడ్డి సవాల్‌ విసిరారు. హుజూరాబాద్‌ అభివృద్ధి అంతా తాను చేసిందేనంటూ ఈటల.. కౌశిక్‌ రెడ్డికి ప్రతి సవాల్ రువ్వారు. దీంతో ఇరు పార్టీల మధ్య రాజకీయ రగడ మొదలైంది.

ఈ క్రమంలోనే తాను చర్చకు సిద్ధమంటూ అంబేడ్కర్‌ చౌరస్తాకు రావాలంటూ కౌశిక్‌రెడ్డి భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే టీఆర్ ఎస్‌ శ్రేణులతో కలిసి అంబేడ్కర్‌ చౌరస్తాకు శుక్ర‌వారం కౌశిక్‌రెడ్డి చేరుకోవటంతో.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అప్పటికే భారీగా పోలీసులు మోహరించి.. అడుగడుగునా బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌశిక్‌రెడ్డి చౌరస్తాలో మాట్లాడుతున్న సమయంలో మరోవైపు నుంచి తరలివచ్చిన బీజేపీ శ్రేణులు.. కౌశిక్‌రెడ్డిని అడ్డుకునేందుకు యత్నించారు.

దీంతో టీఆర్ ఎస్‌-బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. రోడ్డుపై బైఠాయించిన వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.