Begin typing your search above and press return to search.

ఈ ప్ర‌శ్న‌ల‌కు బ‌దులేదీ... బాబుకు ఇంటా బ‌య‌టా సెగ‌...!

By:  Tupaki Desk   |   24 Sep 2021 1:30 AM GMT
ఈ ప్ర‌శ్న‌ల‌కు బ‌దులేదీ...  బాబుకు ఇంటా బ‌య‌టా సెగ‌...!
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఇంటా బ‌య‌టా కూడా సెగ త‌గులుతోందా? ఆయ‌నను ప‌లు ప్ర‌శ్న‌లు చుట్టు ముడుతున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు ముందు చాలా మంది నాయ‌కుల‌కు.. కాన్ఫిడెన్స్ ఉండేది. మ‌నం పోటీ చేశాం.. సో.. గెలుస్తాం.. ఇబ్బంది లేదు.. అనుకున్నారు. తీ రా ఎన్నిక‌ల ఫ‌లితం వ‌చ్చిన త‌ర్వాత సుమారు 700 ఎంపీటీసీ స్థానాల‌ను టీడీపీ గెలుచుకుంది. అదేవిధంగా కొన్ని జ‌డ్పీటీసీ స్థానాల‌ను కూడా ద‌క్కించుకుంది. పూర్తి మెజారిటీ వైసీపీ సాధించినా.. అన్నో ఇన్నో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన వారు ద‌క్కించుకున్నారు.

మ‌రి ఇప్పుడు వీరు ఎవ‌రి త‌ర‌ఫున ఆయా మండ‌ల ప‌రిష‌త్‌లో మాట్లాడాలి ? అదేవిధంగా.. చంద్ర‌బాబు చెబుతున్న‌ట్టు.. మేం ఎన్నికలు బ‌హిష్క‌రించాం.. అంటే.. మ‌రి గెలిచిన‌ వీరంతా రెబ‌ల్స్ అనుకోవాలా ? పార్టీ వీరిని స‌స్పెండ్ చేస్తుందా ? అనే ప్ర‌శ్న‌లు బాబు చుట్టూ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇవ‌న్నీ ఎవ‌రో.. వైసీపీ నాయ‌కులో అడిగిన ప్ర‌శ్న‌లు కావు.. టీడీపీ ప్ర‌ధాన సోష‌ల్ వింగ్‌లోనే పోస్ట‌వుతున్న ప్ర‌శ్న‌లు. మ‌రో కీల‌క ప్ర‌శ్న ఏంటంటే.. నామినేష‌న్ల విష‌యంలో చంద్ర‌బాబు అనుస‌రించిన తీరు. బీఫారాలు ఇచ్చిన త‌ర్వాత‌.. నామినేష‌న్లు వేసిన త‌ర్వాత బ‌హిష్క‌ర‌ణ ప్ర‌క‌ట‌న చేశారు.

మ‌రి అప్పుడైనా.. ఉప‌సంహ‌రించుకోవాల‌ని పిలుపునిచ్చారా ? అనేది.. మ‌రో ప్ర‌శ్న‌. ఇవ‌న్నీ ఎందుకు వ‌స్తున్నాయంటే.. రెండు మూడు రోజుల్లో ఎంపీపీ, జ‌డ్పీ ఎన్నిక‌లు ఉన్నాయి. సో.. ఈ స‌మ‌యంలో టీడీపీ నుంచి గెలిచిన వారు ఎలా వ్య‌వ‌హ‌రించాలి? అనేది చ‌ర్చ‌గా మారింది. పార్టీ త‌ర‌ఫున ఇప్ప‌టి వ‌ర‌కు వీరిని అభినందించిన వారు లేరు. ఎంతో క‌ష్ట‌ప‌డి.. టీడీపీ అధినేత చెప్పిన‌ట్టు.. వైసీపీ దూకుడును సైతం త‌ట్టుకుని పోటీ లో నిలిచి.. సైకిల్‌ను ప‌రుగులు పెట్టించార‌నే సింప‌తీ.. ఇప్ప‌టి వ‌ర‌కు వీరిపై ఎవ‌రూ చూపించ‌క‌పోగా.. ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కూడా అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో.. టీడీపీలోనే ఉండాలా ? లేక‌.. వైసీపీలోకి జంప్ చేయాలా ? అనే ప్ర‌శ్న‌.. ప‌లువురి నుంచి వినిపిస్తోంది. ఎందుకంటే. పార్టీ నుంచి ఆద‌ర‌ణ లేన‌ప్పుడు.. త‌మ‌ను రెబ‌ల్స్‌గా చూస్తున్న‌ప్పుడు.. పార్టీ త‌ర‌ఫున వ‌చ్చే ఐదేళ్ల‌పాటు.. వైసీపీతో ఎందుకు పోరాడాల‌నేది.. కొంద‌రి భావ‌న‌గా ఉంది. దీంతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు చుట్టూ.. అనేక ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. అయితే.. ఆయ‌న వెన‌క్కి త‌గ్గలేని ప‌రిస్థితి నెల‌కొంది. త‌న పార్టీ త‌ర‌ఫున విజ‌యం సాధించిన వారిని అభినందించ‌లేని ప‌రిస్థితిని బాబు స్వ‌యంగా తెచ్చుకున్నార‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.