Begin typing your search above and press return to search.

ఏపీ... ఇపుడు వలసల ప్రదేశ్...!

By:  Tupaki Desk   |   27 Aug 2018 5:20 PM GMT
ఏపీ... ఇపుడు వలసల ప్రదేశ్...!
X
ఆంధ్రప్రదేశ్‌ లో వలసల రాజకీయాలు ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ - మే నెలలలో శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ లోగా అధికార తెలుగుదేశం పక్షం నుంచి - భారతీయ జనతా పార్టీనుంచి ఈ వలసలు భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న అధికార తెలుగుదేశం పార్టీపై సగం మంది ఎమ్మెల్యేలు ఆగ్రహంగా ఉన్నారు. రాష్ట్ర ప్రజలలో ప్రత్యేక హోదా తీసుకురాలేదన్న కోపం ఉందని వారంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో తెలుగుదేశం పార్టీలో కొనసాగితే తీవ్ర నష్టం అన్న భావన తెలుగుదేశం పార్టీ నాయకులలో నెలకొంది. ఈ సారి ఎన్నికలలో ప్రజలు తమ పక్షాన ఉండరని ఆ నాయకుల భావన. దీంతో వారంతా వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ వైపు - జనసేన వైపు చూస్తున్నట్లు సమాచారం. వీరిలో ఎక్కువ మంది వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చేరుతారని అంటున్నారు. కాపు కులస్థులు మాత్రం పవన్ కళ్యాణ్ తో జతకట్టే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకుంటే రాయలసీమ జిల్లాల నుంచి చాలామంది నాయకులు తెలుగుదేశం పార్టీని వీడే అవకాశం ఉంద‌ని అంటున్నారు.. ఇప్పటికే ఉపముఖ్యమంత్రి కె.ఇ. క్రిష్ణమూర్తి - అధినాయకుడు చంద్రబాబు నాయుడుపై ప్రతిరోజూ కారాలు మిరియాలు నూరుతున్నారు. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలలో కూడా చాలా మంది తెలుగుదేశం నాయకులు చంద్రబాబుపై ఆగ్రహంగా ఉన్నారు. మంత్రి అయ్యన్న పాత్రుడైతే ప్రజలు తంతారు అని వ్యాఖ్యనించడం గమనార్హం. ఈ పరిణామాలతో రానున్న ఎన్నికలలోపు చాలామంది నాయకులు పార్టీ మారే అవకాశాలున్నాట్లు కనిపిస్తోంది.

ఇక భారతీయ జనతా పార్టీలో కూడా వలసల పర్వం కొనసాగేట్లు ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకుని రావడంలో విఫలమయ్యమనే భావన కమల నాథులలో ఉంది . ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులను ఓ అపరాధ భావం వేధిస్తోంది. రానున్న ఎన్నికలలో ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతామని వారంటున్నారు. ఈ పరిస్థితులలో పార్టీ మారడమే ఏకైక పరిష్కారమని కమలనాథుల భావన. ఈ పరిణామాలు ప్రతిపక్ష పార్టీ వైఎస్‌ ఆర్ కాంగ్రెస్‌‌‌ కు మేలు చేసివిగా ఉన్నాయి.