Begin typing your search above and press return to search.

రాజకీయ గురివిందలే 'నల్ల' మూలాలు

By:  Tupaki Desk   |   18 Nov 2016 10:30 PM GMT
రాజకీయ గురివిందలే నల్ల మూలాలు
X
ప్రపంచంలోని అత్యంత అవినీతికర దేశాల్లో ఇండియా స్థానం 79.. వరల్డ్ టాప్ 100లో ఇండియన్ యూనివర్సిటీలు స్థానం సంపాదించలేకపోయినా అవినీతిలో మాత్రం మన దేశం టాప్ 100లో ఉంటోంది. ఇక దేశంలో అంతర్గతంగా వేళ్లూనుకుపోయిన అవినీతి వ్యవస్థలో ఏ రంగం స్థానం ఎంత అని లెక్కేసుకుంటే రాజకీయ అవినీతిది టాప్ ప్లేస్. భారత్ లోని మొత్తం అవినీతిలో రాజకీయ అవినీతి 85 శాతం ఉంది. అంటే.. దేశంలో అవినీతి 100 రూపాయలు అనుకుంటే అందులో 85 రూపాయలు తింటున్నది నేతలే. మిగతా 15 రూపాయలను ఉద్యోగులు - అధికారులు - కార్పొరేట్ - చోటామోటా నాయకులు తింటున్నారన్నమాట. మరి అవినీతి - నల్లధనం తోబుట్టువులే కాబట్టి ప్రధాని మోడీ నిర్మూలిస్తానంటున్న నల్లధనం కూడా నేతల వద్దే ఎక్కువగా ఉంటుంది. నేతలు - వారి చుట్టూ ఉంటే గుంట నక్కలే ఈ నల్లమూలాలున్న గురివిందలు.

దేశంలో గ్రామ గ్రామానా పెద్ద సంఖ్యలో ప్రైవేటు చిట్‌ఫండ్‌ వ్యాపారులున్నారు.. వీరంతా రాజకీయ పార్టీలతో ఉండే సంబంధాలను వినియోగించుకుని హాయిగా పైసా కూడా లెక్కలో చూపని వ్యాపారాలు చేస్తున్నారు. విచ్చలవిడిగా కరెన్సీ సర్క్యులేట్ చేస్తుంటారు. ఇంతవరకు పాతనోట్లతో వ్యాపారం చేశారు. ఇప్పుడు కొత్త కరెన్సీ నోట్లతోనే వ్యాపారాలు నిర్వహిస్తారు. వందల కోట్ల టర్నోవర్ ఉన్నా రూపాయి కూడా పన్ను కట్టరు. ఇదంతా నల్లధనమే.

అలాగే దేశంలో విద్యావ్యాపారం ఊడలేసింది. కోట్లకు కోట్లు కేపిటేషన్‌ ఫీజుగా వసూలు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని అనధికారికంగా వినియోగిస్తున్నారు.ఇదంతా నల్లధనం ఖాతాలోకే వస్తోంది. విద్యావ్యాపారాలు ఎవరి చేతుల్లో ఉన్నాయన్నది పరిశీలిస్తే నూటికి 90 మంది రాజకీయ సంబంధాలున్నవారే.

రోజువారి వ్యాపారులు లక్షలాది కోట్లు వడ్డీలకుతిప్పుతున్నారు. వీరికీ ఎక్కడా పుస్తకాల్లో ఖాతాలుండవు. ఇక రాజకీయ నాయకుల సంపాదనంతా అక్రమార్జనే చిన్నస్థాయి ప్రభుత్వోద్యోగి నుంచి ఉన్నతాధికారి వరకు పెద్దెత్తున అవినీతి సంపాదన పోగేస్తున్నారు. వీటిలో దేనికీ పన్నులు కట్టరు. దేశంలో 10శాతం మంది కూడా ఇప్పుడు ఆదాయపన్ను చెల్లించడం లేదు. కరెన్సీ రద్దు కారణంగా చిల్లర వ్యాపారులు, వలసకూలీలు ఉపాధి కరవై తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. చట్టాన్ని యదేచ్ఛగా మోసం చేస్తున్న వారి వివరాలు తెలిసి కూడా ప్రభుత్వం కుంటిసాకుల్తో సాధారణ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నల్లధనమంతా నేతల చుట్టూనే ఉన్నా దానికోసం ప్రజలను జల్లెడ పట్టడం ఎంతవరకు కరెక్టన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/