Begin typing your search above and press return to search.

సీమ ఉద్యమం సరే.. విశ్వసనీయత ఉన్నదెవరికి?

By:  Tupaki Desk   |   7 Nov 2015 3:58 AM GMT
సీమ ఉద్యమం సరే.. విశ్వసనీయత  ఉన్నదెవరికి?
X
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడాన్ని రాజకీయంగా వాడుకోవడానికి కొందరు నేతలు విరివిగా ప్రయత్నిస్తుండడం ఇప్పుడు బాగా కనిపిస్తోంది. ఈ ఎంపిక రాయలసీమ నేతల్లో తీవ్రమైన అసంతృప్తిని రాజేస్తోంది. చంద్రబాబు ఏకపక్ష విధానాలతో అమరావతిని భవిష్యత్ హైదరాబాద్‌ గా మల్చడానికి తాపత్రయం పడుతున్నారంటూ ప్రత్యేక రాయలసీమ ఉద్యమం లేవనెత్తుతామని మాటలు చెబుతున్నారు. అయితే ఇలాంటి వేర్పాటు వాద ఉద్యమం మాట చెబుతున్న నాయకుల్లో అసలు విశ్వసనీయత ఉన్న దెందరికి? వీరు నికార్సుగా ఒక పనిచేస్తున్నాం అంటే గనుక.. నమ్మేస్థితిలో ఎందరున్నారు? అనేది పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది. సీమ నేతల విశ్వసనీయతను పరిశీలిస్తే సీమ ఉద్యమం నిజంగా ఉనికిలోకి వస్తుందా అనే విషయంపై పలు సందేహాలు కలుగుతున్నాయి.

ఎట్టకేలకు ప్రతిపక్ష నేతలు ఎంపీ మైసూరా రెడ్డి - డి.ఎల్ రవీంద్రారెడ్డి మాత్రమే కాదు.. టీడీపీ నేతలైన టీజీ వెంకటేష్ - బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా రాయల సీమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ప్రత్యేక రాయలసీమ ఉద్యమాన్ని ప్రారంభించడం గురించి మాట్లాడుతున్నారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి రహస్య మద్దతుతో పలువురు వైకాపా నేతలు సైతం ప్రత్యేక రాయలసీమ ఉద్యమానికి బహిరంగంగానే అనుకూల ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. అయితే స్థానిక ప్రజలు వీరికి అంతగా మద్దతు తెలపడం లేదు. సమైక్యాంధ్ర ఉద్యమంలో వారి నిర్వాకం చూసిన ప్రజలు ఇప్పుడు వీరు చేపడుతున్న ప్రత్యేక రాయలసీమ ఉద్యమం గురించి పెద్దగా ఆసక్తి చూపటం లేదు. ప్రజలు ఈ ఉద్యమాన్ని ఒక పట్టాన నమ్మకపోవడానికి వారి కారణాలు వారికి ఉన్నాయి. మైసూరారెడ్డి - డీఎల్ రవీంద్రరెడ్డి - బైరెడ్డి రాజశేఖరరెడ్డి వీరంతా కూడా తమ రాజకీయ జీవితం ఒక రకంగా చరమాంకానికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఉద్యమం పాట పాడుతున్నారు. వస్తే.. రాజకీయ లాభం.. రాకపోతే పోయేదేం లేదు అనేది వీరి ధోరణి. అందుకే వీరి ఉద్య మంపై ప్రజలకు నమ్మకం కలగడం లేదని తెలుస్తోంది.

ప్రత్యేక రాయలసీమ ఉద్యమాన్ని ఈ దశాబ్దపు జోక్‌ గా వర్ణిస్తూ తెలుగుదేశం పార్టీ తోసిపుచ్చినప్పటికీ ప్రత్యేక సీమ బీజాలు పడ్డాయంటే అది అంతటితో ఆగవని చరిత్ర చెబుతోంది. ప్రత్యేక సీమ ఉద్యమం ఈ దశాబ్ది జోకో లేక పేలనున్న విస్పోటనమో తేలడానికి మరికొంత కాలం పట్టేట్టుంది.