Begin typing your search above and press return to search.

తొండి వాదనలు ఇప్పుడెందుకు!?

By:  Tupaki Desk   |   27 Jun 2015 5:30 PM GMT
తొండి వాదనలు ఇప్పుడెందుకు!?
X
సీమాంధ్రకు చెందిన కొంతమంది నాయకుల వాదనలను సీమాంధ్రులే తప్పుబడుతున్నారు. ఇప్పటికీ తొండి వాదనలు చేస్తూ సీమాంధ్రులకు అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సహా కొంతమంది టీడీపీ నాయకులు వితండ వాదం చేస్తున్నారని అంటున్నారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలని, విభజన బిల్లు పాస్‌ కాలేదంటూ పనికిరాని వాదనలు చేస్తున్నారని, వాటివల్ల ఉపయోగం ఏమిటని నిలదీస్తున్నారు.

వాస్తవానికి, హైదరాబాద్‌ను యూటీ చేయడానికి బీజేపీ వ్యతిరేకం. టీఆర్‌ఎస్‌ వ్యతిరేకం. కాంగ్రెస్‌ వ్యతిరేకం. దాని గురించి ఇప్పుడు అరిచి గీ పెట్టినా పట్టించుకునేవాళ్లు లేరు. విభజన చట్ట విరుద్ధమని కాంగ్రెస్‌, బీజేపీ, టీఆర్‌ఎస్‌, టీడీపీ సహా అన్ని పార్టీలకూ తెలుసు. ఇప్పుడు దాని గురించి ఆలోచించే ఓపిక కూడా ఎవరికీ లేదు. ఈ నేపథ్యంలో తక్షణ కర్తవ్యం గురించి ఆలోచించకుండా ఈ తొండి వాదనలు ఎందుకని, ఇంకా తమను ఎంతకాలం మోసం చేస్తారని సీమాంధ్రులు ప్రశ్నిస్తున్నారు.

రెండు రాష్ట్రాల మధ్య సంస్థలు, ఉద్యోగుల విభజన ఏడాది కాలంగా పీటముడి పడిపోయింది. తమ ప్రాంతంలోని సంస్థలను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోంది. వాటికి సంబంధించిన సంస్థలను సీమాంధ్రలో ఏర్పాటు చేసుకోవాలని చెబుతోంది. కానీ, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం వాటి విభజన జరగడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన చట్టం ప్రకారం సంస్థలు, వాటి ఆస్తులు, అప్పుల విభజన జరిగేలా చేయాలని సీమాంధ్ర మేధావులు కోరతున్నారు. ఉదాహరణకు,ఎన్జీ రంగా యూనివర్సిటీని విభజించారని, ప్రస్తుతం దీని మార్కెట్‌ విలువ రూ.28 వేల కోట్లని, ఈ మొత్తం యూనివర్సిటీని తెలంగాణ తీసేసుకోవడం ద్వారా ఏపీ దాదాపు రూ.15 వేల కోట్లు నష్టపోయిందని వివరిస్తున్నారు. ఇటువంటివే వందకుపైగా సంస్థలు ఉన్నాయని, వాటి విభజన గురించి ఏపీ సర్కారు పట్టించుకోవడం లేదని, దాంతో ఇప్పటికే నష్టపోయిన ఏపీకి మరింత నష్టం జరుగుతోందని వివరిస్తున్నారు. ఇప్పుడు సంస్థలు, వాటి ఆస్తులు, అప్పుల విభజనపై దృష్టి సారించకుండా ఇంకా విభజననున పట్టుకుని వేళ్లేడడం ఏమిటని నిలదీస్తున్నారు.

సీమాంధ్రకు రావాల్సిన ఆదాయాలు, ఆప్పులను తేల్చుకోకుండా ఇంకా తమను చీకట్లోనే ఉంచి అన్ని పార్టీలూ మోసం చేస్తున్నాయని సీమాంధ్రులు మండిపడుతున్నారు. ఎన్జీ రంగా వర్సిటీ విభజన గురించి ఇప్పటి వరకు ఒక్క పార్టీ కానీ ఒక్క నాయకుడు కానీ మాట్లాడకపోవడాన్ని గుంటూరుకు చెందిన వ్యవసాయ నిపుణులు తప్పుబడుతున్నారు.