Begin typing your search above and press return to search.

మ‌న నేత‌లు ఎంత సంపాదించాలో చెప్పే లెక్క ఇది!

By:  Tupaki Desk   |   4 Jun 2019 8:23 AM GMT
మ‌న నేత‌లు ఎంత సంపాదించాలో చెప్పే లెక్క ఇది!
X
ఇంత‌పెద్ద దేశంలో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌టం అంటే మాట‌లు కాదు. దాదాపు రెండు నెల‌లకు పైగా సాగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల క్ర‌తువు విజ‌యవంతంగా పూర్తి అయిన విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో నేత‌లు పెట్టిన ఖ‌ర్చు మీద ఇప్ప‌టికే చాలానే లెక్క‌లు వ‌చ్చినా.. ఇప్పుడొచ్చిన లెక్క మాత్రం అంద‌రి చూపు త‌న మీద ప‌డేలా చేసింది. దీనికి కార‌ణం లేక‌పోలేదు. లెక్క వేసిన సంస్థకున్న ప‌ర‌ప‌తి అలాంటిది.

ఢిల్లీకి చెందిన సెంట‌ర్ ఫ‌ర్ మీడియా స్ట‌డీస్ అనే సంస్థ అధ్య‌య‌నం ప్ర‌కారం తాజాగా ముగిసిన ఎన్నిక‌ల ఖ‌ర్చు అత్యంత ఖ‌రీదైన‌దిగా అభివ‌ర్ణిస్తున్నారు. ఈ సంస్థ వేసిన ప్రాథ‌మిక అంచ‌నా ప్ర‌కారం.. లోక్ స‌భ ఎన్నిక‌ల ఖ‌ర్చు ఏకంగా రూ.60వేల కోట్లు ఉంటుంద‌న్న అంచ‌నా వేశారు. 2014లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా పెట్టిన ఖ‌ర్చుకు డ‌బుల్ అని లెక్క క‌ట్టారు.

ఈ ఖ‌ర్చులో 15 నుంచి 20 శాతం ఎన్నిక‌ల క‌మిష‌న్ చేసిన వ్య‌యంగా చెబుతున్నారు. స‌గ‌టున ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో రూ.100 కోట్ల మేర ఖ‌ర్చు జ‌రిగిన‌ట్లుగా అంచ‌నా వేశారు. స‌గ‌టున ఒక్కో ఓట‌రు మీద నేత‌లు పెట్టిన ఖ‌ర్చు రూ.700గా అంచ‌నా వేశారు. అయితే.. వీరి దృష్టికి రాని.. అంచ‌నా వేయ‌లేని కొన్ని ఖ‌ర్చుల్ని కూడా క‌లుపుకుంటే.. ఈ ఖ‌ర్చు మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెబుతున్నారు.

అంటే.. ఐదేళ్ల వ్య‌వ‌ధిలో నేత‌లు సంపాదించాల్సిన టార్గెట్ మొత్తం క‌నీసం రూ.60వేల కోట్ల‌కు త‌గ్గ‌కూడ‌దు. ఖ‌ర్చు చేసిన ప్ర‌తి రూపాయికి రెండు రూపాయిలు సంపాదించే ధోర‌ణి ప్ర‌తి రాజ‌కీయ నాయ‌కుడి ఉంటుంది. అలాంట‌ప్పుడు ఓట్ల కోసం ఖ‌ర్చు చేసిన మొత్తాన్ని ప్ర‌జ‌ల ముక్కుపిండి మ‌రీ వ‌సూలు చేసేయ‌టం ఖాయం. అంటే.. రానున్న ఐదేళ్ల‌లో ఈ భారీ మొత్తాన్ని ప్ర‌జాధ‌నం నుంచి వెన‌క్కి తీసుకునే దిశ‌గా నేత‌లు ప్ర‌య‌త్నిస్తార‌న్న విష‌యాన్ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం ఉండదేమో క‌దూ?