Begin typing your search above and press return to search.

ఎంత డ‌ప్పు కొట్టుకుంటే అంత ధీమా బ్ర‌ద‌ర్‌!

By:  Tupaki Desk   |   1 March 2018 8:20 AM GMT
ఎంత డ‌ప్పు కొట్టుకుంటే అంత ధీమా బ్ర‌ద‌ర్‌!
X
కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వ‌చ్చిన మార్పును గ‌మ‌నిస్తున్నారా? సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఏడాది ఉందన్న మాటే కానీ.. రాజ‌కీయపార్టీ అధినేత‌లు మొద‌లు..నేత‌ల వ‌ర‌కూ అంద‌రిలోనూ ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్ వ‌చ్చేసిన వైనం క‌నిపించ‌క మాన‌దు. ఎవ‌రికి వారు పోటాపోటీగా పాద‌యాత్ర‌లు.. బ‌స్సుయాత్ర‌లు.. మొద‌లుపెడితే.. అందుకు దూరంగా ఉన్న వారు సైతం త్వ‌ర‌లో తాము ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు వీలుగా ప్ర‌ణాళిక‌లు చేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. ఎన్నిక‌ల్లో టికెట్లు సొంతం చేసుకునేందుకు అప్పుడే హ‌డావుడి మొద‌లైంది. మిగిలిన వారితో పోలిస్తే అధికార‌ప‌క్షంలో హ‌డావుడి ఎక్కువ ఉంటుంద‌న్న విష‌యం తెలిసిందే. తెలంగాణ అధికార‌ప‌క్షం టీఆర్ ఎస్ లో ఈ జోరు మ‌రికాస్త ఎక్కువ‌గా ఉంది. టికెట్ల‌ను ఆశిస్తున్న వారు ఎవ‌రికి వారుగా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు.

ఈసారి అధికారం త‌మ‌దేన‌న్న ధీమాలో ఉన్న టీఆర్ ఎస్ అధినాయ‌క‌త్వం టికెట్ల ఎంపిక‌కు సంబంధించి స‌రికొత్త వ్యూహాన్ని సిద్ధం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. టికెట్లు కోరుకునే కొత్త వారు మాత్ర‌మే కాదు.. సిట్టింగ్ ఎంపీలు.. ఎమ్మెల్యేలు సైతం టికెట్లు త‌మ‌కే ఎందుకు ఇవ్వాల‌న్న విష‌యం మీద ఎవ‌రికి వారు తాము చేసిన ప‌నుల గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది.

సింఫుల్ గా చెప్పాలంటే అధినాయ‌క‌త్వం ద‌గ్గ‌ర ఎవ‌రు డ‌ప్పు వారు కొట్టుకోవాలి. ఎవ‌రైతే బాగా డ‌ప్పు కొట్టుకుంటారో వారికి టికెట్లు క‌న్ఫ‌ర్మ్ చేసే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. సిట్టింగ్ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఒక ఫార్మాట్ ను పంపుతార‌ని.. అందులో గ‌డిచిన నాలుగేళ్లుగా తామేం చేశామ‌న్న విష‌యాల్ని వివ‌రంగా చెప్పుకోవాల్సి ఉంటుందంటున్నారు.

టికెట్టు కోరుకునే వారి స్వీయ నివేదిక‌ల‌తోపాటు.. పార్టీ త‌ర‌ఫున ప్రైవేటు స‌ర్వేలు చేయించ‌టం.. నిఘా వ‌ర్గాల నుంచి స‌మాచారాన్ని తీసుకోవ‌టం చేస్తారు. ఎవ‌రికి వారు తామేం చేశామ‌న్న విష‌యాన్ని చెప్పుకోవ‌టంతో పాటు.. నియోజ‌క‌వ‌ర్గంలో వారికున్న బ‌లం మీద ఎంత‌గా చెప్పుకుంటున్నార‌న్న‌ది ప‌రిశీలిస్తార‌ని చెబుతున్నారు.

వాస్త‌వానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌ద్ద త‌మ పార్టీ నేత‌ల‌కు సంబంధించిన జాత‌కాలు మొత్తంగా ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ.. ఎవ‌రికి వారు తమ గురించి తాము ఎంత గొప్ప‌గా చెప్పుకుంటార‌న్న విష‌యంతో పాటు.. నియోజ‌క‌వ‌ర్గం మీద వారికున్న అవ‌గాహ‌న‌.. ప్ర‌జ‌ల‌తో వారెంత‌గా మ‌మేకం అయ్యామ‌న్న విష‌యాన్ని వారెంత వ‌ర‌కూ చెప్పుకోగ‌లిగార‌న్నది తెలుసుకునే వీలు క‌లుగుతుంద‌ని భావిస్తున్నారు. తాము చేప‌ట్టిన అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌తో ఎంత‌మందికి ల‌బ్థి చేకూరింది? ఏయే వ‌ర్గాల‌కు మేలు చేశారు? లాంటి అంశాల‌తో పాటు.. రాష్ట్ర స్థాయిలో.. జాతీయ స్థాయిలో వారు చేసిన ప‌నుల‌కు ఏమైనా గుర్తింపు ల‌భించిందా? అన్న విష‌యాలపై కూడా ఎవ‌రికి వారు చెప్పుకోవాల‌ని చెబుతున్నారు. చూస్తుంటే.. ఎవ‌రెంత‌గా డ‌ప్పు కొట్టుకుంటే అంతమేర అవ‌కాశం అన్న మాట‌.