Begin typing your search above and press return to search.
జనసేనలోకి చేరే నేతలు వీరేనా?
By: Tupaki Desk | 28 Jun 2018 12:04 PM GMTఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ నవ్యాంధ్రలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే అధికార టీడీపీ - విపక్ష వైసీపీలు ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతూ ఉంటే... ప్రజాదరణ అంతంత మాత్రంగానే ఉన్న బీజేపీ కూడా తనదైన శైలి రాజకీయాలకు తెర తీసింది. ఇటీవలే ఆ పార్టీ ఏపీ శాఖకు అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు జిల్లాల పర్యటనలో యమ బిజీగా ఉన్నారు. మరోవైపు గడచిన ఎన్నికల్లో సింగిల్ సీటు కూడా దక్కించుకోలేక చతికిలబడిపోయిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కూడా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాస్తంత స్పీడు పెంచినట్లుగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గడచిన ఎన్నికలకు కాస్తంత ముందుగానే రాజకీయ పార్టీ పెట్టిన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్... ఇటీవల జనసేన అధినేతగా పూర్తి స్థాయిలో కలరింగ్ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పర్యటించిన పవన్ కల్యాణ్... పార్టీని సంస్థాగతంగా విస్తరించే పనిలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీని సంస్థాగతంగా ఎంతగా విస్తరించినా... ఆ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల బరిలో నిలిచేదెవరు? ఆ స్థాయి ఉన్న నేతలు ఇప్పుడు పార్టీలో ఎంతమంది ఉన్నారు? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అయితే ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్... విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తున్నారు. విడతలవారీగా పర్యటనలు సాగిస్తున్న పవన్... వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పెద్ద కసరత్తే చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా గతంలో ఓ వెలుగు వెలిగిన నేతలతో పాటు ఓ మోస్తరు రాజకీయ నేతలుగా ఎదిగిన వారికి సంబంధించిన పలువురు జనసేనలో చేరే అవకాశాలున్నాయంటూ ఇప్పుడు కొత్తగా వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇలా జనసేనలో చేరిపోయేవారు వీరేనంటూ ఇప్పుడు ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వార్త ఏ మేరకు నిజమన్న విషయాన్ని పక్కనపెడితే... సదరు వార్తల ప్రకారం జనసేనలోకి ఎంట్రీ ఇచ్చే నేతలు ఎవరన్న విషయాన్ని ఓ సారి పరిశీలిద్దాం. ఈ జాబితాలో ముందుగా వినిపిస్తున్న పేపరు. చింతలపూడి వెంకట్రామయ్య. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించిన వెంకట్రామయ్య ప్రస్తుత రాజకీయాల్లో పెద్దగా కనిపించడం లేదు. మొన్న అరకు పర్యటనలో ఉన్న పవన్‌ను కలిసేందుకు తనదైన శైలి యత్నాలు చేసిన వెంకట్రామయ్య... అందులో సఫలం కాలేకపోయారు. అయితే పట్టువదలని విక్రమార్కుడికి మల్లే పవన్ మలివిడత యాత్రలో భాగంగా పవన్ తో ఆయన భేటీ అయ్యారు. అంతేకాకుండా జనసేనకు తన సంపూర్ణ మద్దతును ప్రకటించిన వెంకట్రామయ్య... అవకాశం ఇస్తే పార్టీలో చేరతానని, ఇంకాస్త అవకాశమిస్తే ఏకంగా గాజువాక నుంచి పోటీ చేస్తానని కూడా పవన్ కు చెప్పారట. మరి పవన్ ఆయనకు ఏ మాట ఇచ్చారన్న విషయం మాత్రం బయటకు రాలేదు.
ఇక జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న వారి జాబితాలో రెండో పేరుగా గండి బాబ్జీ పేరు వినిపిస్తోంది. పవరాడ మాజీ ఎమ్మెల్యే అయిన బాబ్జీ... విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత - మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు ముఖ్య అనుచరుడిగా పేరుంది. కొణతాల వెంటే నడిచిన బాబ్జీ చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన ఆయన అనంతరం టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఏ పార్టీకి సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్న బాబ్జీ... వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున పోటీ చేయాలన్న విషయంపై తర్జనభర్జన పడుతున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానంటూ ప్రకటించిన పవన్ కల్యాణ్ ప్రకటన ఆయనను బాగానే ఆకర్షించింది. ఇప్పటికే పవన్ తో ఓ సారి భేటీ అయిన బాబ్జీ... జనసేనలో చేరే విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. బాబ్జీ తర్వాత జాబితాలో తదుపరి పేరుగా కోనా తాతారావు పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం టీడీపీలో ఉన్న తాతారావు త్వరలోనే ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్లుగా సమాచారం. జనసేనలోకి చేరేందుకే ఆయన టీడీపీకి రాజీనామా చేయనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వెంకట్రామయ్య ఆశిస్తున్న గాజువాక టికెట్ నే తాతారావు కూడా ఆశిస్తున్నారు. రాజకీయాలపై ఆసక్తితో స్టీల్ ప్లాంట్ ఉద్యోగానికి రాజీనామా చేసిన తాతారావుకు పవన్ ఏ మేరకు ప్రాధాన్యం ఇస్తారో చూడాలి.
ఇక ఈ జాబితాలో తదుపరి పేరుగా మండవ రవికుమార్ పేరు వినిపిస్తోంది. గోపాలపట్నంలో ప్రముఖ విద్యాసంస్థలుగా కొనసాగుతున్న బాలాజీ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ అధినేతగా విశాఖ జిల్లా వాసులకు మండవ చిరపరచితుడే. ఇటీవలి కాలంలో రాజకీయాలపై అమితాస్తి ప్రదర్శిస్తున్న మండవ... జనసేన ద్వారానే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అవకాశం లభిస్తే.. పెందుర్తి నుంచి పోటీ చేసేందుకు ఈయన ఆసక్తి కనబరుస్తున్నారు. జాబితాలో చివరి పేరుగా ఒలివర్ రాయ్ పేరు వినిపిస్తోంది. ఏపీ స్టేట్ క్రిస్టియన్ లీడర్స్ ఫోరం కన్వీనర్ గానే కాకుండా భీమిలిలో పేరొందిన కేధరిన్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ గా విశాఖ జిల్లా వాసులకు బాగానే తెలిసిన రాయ్.. జనసేనలో చేరేందుకు ఉవ్విళ్లూతున్నారట. జనసేనలోకి ఎంట్రీ లభిస్తే... తన సొంతూరైన భీమిలి నుంచే బరిలోకి దిగేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. మొత్తంగా వీరందరికీ పవన్ ఏం మాట చెప్పారో తెలియదు గానీ... జనసేనలో చేరిపోతున్నారంటూ వీరిపై వచ్చిన వార్త మాత్రం ఆసక్తి రేపుతోంది.