Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ హత్యలూ చాలా కాస్ట్ లీ గురూ..

By:  Tupaki Desk   |   3 March 2022 5:30 PM GMT
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ హత్యలూ చాలా కాస్ట్ లీ గురూ..
X
రాజకీయాలంటే ప్రజా సేవ. ఒకప్పుడు ప్రజలు సమాజం కోసం తమ సొంత ఆస్తినీ ధారపోసేవారు నాయకులు. తమకంటూ ఏమీ మిగుల్చుకోలేకపోవడంతో పాటు కనీసం సొంత పిల్లలకూ చిన్న ఉద్యోగం వంటి దారి కూడా చూపలేని స్థితిలో చాలామంది రాజకీయాలను నడిపారు.

ఇదంతా స్వాతంత్ర్యం వచ్చిన తొలి రెండు, మూడు దశాబ్దాల కథ. అప్పటికి దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న నాయకులే ఎక్కువగా రాజకీయాల్లో ఉండేవారు. అయితే, 1980 ల నాటికి వచ్చేసరికి రాజకీయాలు మారాయి. స్వాతంత్ర్య ఉద్యమ కాలం నాటి నిస్వార్థ నాయకుల జమానా ముగిసిపోయిన కాలం ఇది. వయసు పైబడో, ఇమడలేకో నాటి నిష్కళంక రాజకీయ నేతలు రాజకీయాలకు దూరమయ్యారు. ఇక 1980ల్లో వచ్చిన తరమంతా కొంత ఆదర్శం, కొంత స్వార్థం తరహా బ్యాచ్.

ఇలాంటివారే దేశవ్యాప్తంగానూ ఇప్పటికీ చాలాచోట్ల అధినాయకులుగా ఉన్నారు. వీరు కూడా తొలి రెండు దశాబ్దాలు కాస్త నిజాయతీగానే ఉన్నారు. కానీ 2000 తర్వాత వచ్చిన నాయకులు మరీ డబ్బుకు ప్రభావితం అయ్యారు. ప్రస్తుతం చూస్తున్న వారిలో ఎక్కువశాతం 21వ శతాబ్దంలో అంటే 2000 సంవత్సరం అనంతరం రాజకీయాల్లో కాలుమోపినవారే. అటు వ్యాపార పోకడ, ఇటు రాజకీయ మనుగడ వీరి స్వభావం.

రెండింటినీ సమంగా నిర్వర్తిస్తూ వస్తున్న ఈ బ్యాచ్ తో అవపరమైతే డబ్బుతో రాజకీయాలను శాసిస్తుంది. అది సహజం కూడా. మెజారిటీ వారే.. పైన చెప్పుకొన్నట్లు కొత్త శతాబ్దపు నాయకులు ఖర్చుకూ వెనుకాడని తరహా. వీరంతా ఎమ్మెల్యే అయ్యేందుకు రూ.20 కోట్ల్లు ఇంకా అంతకు ఎక్కువ, ఎంపీ అయ్యేందుకు రూ.50 కోట్లు అయినా ఖర్చు పెడతారు.

ఉదాహరణకు తెలంగాణలో ప్రస్తుతం పదవుల పరంగా అత్యంత కీలకమైన వ్యక్తులున్న జిల్లాలో 2014లో జరిగిన లోక్ సభ ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థి అచ్చంగా రూ.80 కోట్ల నగదు ఖర్చు పెట్టారు. వాస్తవానికి ఆ అభ్యర్థి అంత ఖర్చు చేయాల్సిన అవసరమూ లేదు. తమ అధినేత రాజీనామాతో వచ్చిన ఈ ఉప ఎన్నికలో ఆయన గెలుపు ఖాయమే. కానీ, పరిస్థితుల రీత్యా ఎందుకైనా మంచిదని మెజార్జీ చాటేందుకు అంత ఖర్చకు తెగించారు.

ఇంతకూ ఈ అభ్యర్థి పక్కా వ్యాపారి. అంతకుముందు వ్యాపారంలో సంపాదించినదంతా ఇందులో పెట్టారు. అయితే, ఈయనకే మరోసారి టిక్కెట్ రావడం గెలవడంతో లెక్క సరిపోయింది. ఈయన ఒక్కరనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ధనం ఏ స్థాయిలో రాజకీయాలను అందులోనూ ఎన్నికలను ప్రభావితం చేస్తోందో చెప్పందుకు ఎన్నో ఉదాహరణలు. అసెంబ్లీ ఎన్నికల్లో జనరల్ సీట్లలో అయితే, అన్ని పార్టీల అభ్యర్థులు పెట్టే ఖర్చు రూ. 70 కోట్లయినా ఉంటుందనడంలో సందేహం లేదు.

ఎంపీ సీట్లలో అయితే ఇది రూ.200 కోట్లయినా ఆశ్చర్యం లేదు. ఇప్పడిక హత్యా రాజకీయాల వంతు నవతరం నాయకులు రాజకీయాల కోసం ఎంతకైనా తెగిస్తారనేందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి.

అసలు గతం నుంచీ ఈ ధోరణి ఉన్నా ఇప్పుడు మరీ ఎక్కువైంది. కాగా, ఎత్తుకు పైఎత్తు అన్నట్లుండే రాజకీయాల్లో ప్రత్యర్థిని దెబ్బతీయడం చాలా ముఖ్యం. అది ఆర్థికంగా, మానసికంగా ఎలాగైనా సరే. దీనికిమించి అంటే.. భౌతికంగా తుదముట్టించడం గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది.

వాస్తవానికి చైతన్యం ఇంతగా లేని కాలంలో.. రాజకీయ హత్యలు జరిగినా పెద్దగా వెలుగులోకి వచ్చేవి కావు. ఇప్పుడు మాత్రం అందుకు అవకాశం లేదు. హత్యా ప్రయత్నాలు జరిగినా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నాయి.

మరోవైపు తెలంగాణలో బుధవారం ఓ మంత్రి హత్యకు రూ.15 కోట్ల సుపారీ ఒప్పందం జరిగిందని.. ఆ కుట్రకు పాల్పడిన నిందితులను అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించడం కలకలం రేపింది. ఆ నిందితుల్లో కొందరికి బీజేపీ నేతలతో సంబంధాలు ఉన్నట్లు కూడా చూపడం మరింత రాజకీయ వేడిని రగిలించనుంది. ఇక్కడ ప్రస్తావనార్హమేమంటే ఆ ప్రజాప్రతినిధి హత్యకు కుదుర్చుకున్న కాంట్రాక్టు విలువ రూ.15 కోట్లు కావడం.

ఈ స్థాయిలో డీల్ అంటే చాలా పెద్ద వ్యవహారమే అనేలా పోలీసుల వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. ఇక మూడేళ్ల కిందట ఏపీలోని కడప జిల్లాలో జరిగిన ఓ రాజకీయ ప్రముఖుడి హత్య ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఈ హత్యకు ప్రధాన కారణం భూ సెటిల్మెంట్లు.

రాజకీయంగా అత్యంత శక్తిమంతమైన కుటుంబానికి చెందిన ఆయనను హతమార్చేందుకు రూ.40 కోట్ల డీల్ జరిగిందని వార్తలు వచ్చాయి. అన్నిటికీ మించి ఆయన హత్యా నేరాన్ని వేరొకరు భుజాన వేసుకుంటే రూ.10 కోట్ల వరకు డబ్బు ఇస్తామని ప్రలోభపెట్టినట్లు కథనాలు రావడం మరింత ఆశ్చర్యం రేపింది.

ఈ రెండు ఉదాహరణలు చూస్తే చాలు.. తెలంగాణలో రాజకీయ హత్యలు ఎంతటి ఖరీదైన వ్యవహారంగా మారాయో తెలిసిపోతోంది. అంతేగాక రెండు రాష్ట్రాల్లో రాజకీయాలతో ప్రమేయం ఉంటూ కొన్నేళ్లుగా జరిగిన హత్యలు కూడా రూ.కోట్ల విలువైన వ్యవహారాలకు సంబంధించినవే కావడం గమనార్హం.