Begin typing your search above and press return to search.

కాశ్మీర్ లో రాజకీయ వింత

By:  Tupaki Desk   |   6 May 2022 6:23 AM GMT
కాశ్మీర్ లో రాజకీయ వింత
X
దేశంలో ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా ఒక లోక్ సభ సీటుకు మ్యాగ్జిమమ్ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలే ఉంటాయి. ఎక్కడైనా మహా ఉంటే మరోటి ఎక్కువుంటుందేమో అంతే. కానీ జమ్మూ-కాశ్మీర్లో మాత్రం ఈ లెక్క కుదరదు. జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన నివేదిక ముసాయిదాను కేంద్రం ప్రకటించింది. జమ్మూ-కాశ్మీర్ కు దశాబ్దాలపాటు ప్రత్యేకంగా ఉన్న ఆర్టికల్ ఆర్టికల్ 370ని నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.

ఆర్టికల్ 370ని రద్దు చేసిన సమయంలోనే జమ్మూని విడిగా కాశ్మీర్ ను విడిగా కేంద్రం ప్రకటించింది. ఇందులో భాగంగానే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేయాలని డిసైడ్ చేసింది.

అందుకని ముగ్గురు నిపుణులతో ఒక కమిటినీ నియమించింది. ఆ కమిటి రెండు ప్రాంతాల్లోను విస్తృతంగా పర్యటించి రాజకీయ పార్టీల నేతలు, మేధావులు, రిటైర్డ్ ఉన్నతాధికారులు, ప్రజలతో భేటీలు జరిపి తన నివేదికను కేంద్రానికి అందించింది.

ఈ నివేదిక ప్రకారం జమ్మూ-కాశ్మీర్లో 90 అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి. జమ్మూలో 43, కాశ్మీర్లో 47 అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి. గతంలో ఉన్నట్లే ఇపుడు కూడా లోక్ సభ సీట్లు 5 ఉంటాయి. గతంలో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు అదనంగా అంటే కొత్తగా ఎస్టీ నియోజకవర్గాలు కూడా ఏర్పడ్డాయి. ఎస్సీలకు ఏడు నియోజకవర్గాలుండగా కొత్తగా ఎస్టీలకు 9 నియోజకవర్గాలు ఏర్పాటయ్యాయి.

ఇక్కడ గమనించాల్సిందేమంటే ఒక్కో లోక్ సభ నియోజకవర్గం పరిధిలో 18 అసెంబ్లీ నియోజకవర్గాలుండటం. దేశంలోని ఏ రాష్ట్రంలో చూసినా ఒక్కో లోక్ సభలో ఏడు అసెంబ్లీ నియోజవర్గాలు మాత్రమే ఉంటాయి. కానీ జమ్మూ-కాశ్మీర్లో మాత్రం ఒక్కో లోక్ సభ పరిధిలో 18 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను తగ్గించటం సాధ్యం కాలేదు. అలాగే లోక్ సభ నియోజకవర్గాల సంఖ్యను పెంచటం కూడా సాధ్యం కాలేదు. ఎందుకంటే జమ్మూ-కాశ్మీర్లో లోక్ సభ సీట్ల సంఖ్యను పెంచాలంటే దాని ప్రభావం దేశమంతా పడుతుంది. ఇపుడు జరిగిన నియోజకవర్గాల పునర్ విభజన కేవలం జమ్మూ-కాశ్మీర్లో మాత్రమే కావటంతో వేరే దారిలేకపోయింది.