Begin typing your search above and press return to search.

కామెంట్లు ఓకే.. క‌థే ఎవ‌రికీ అర్ధం కాలేదు.. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై చ‌ర్చ‌

By:  Tupaki Desk   |   18 July 2022 9:30 AM GMT
కామెంట్లు ఓకే.. క‌థే ఎవ‌రికీ అర్ధం కాలేదు.. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై చ‌ర్చ‌
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేస్తున్న కామెంట్లు వినేందుకు బాగానే ఉన్నాయి. అయితే.. వాటి వెనుక ఉన్న అంత‌రార్థ‌మే ఎవ‌రికీఅర్ధం కావ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా జ‌రిగిన స‌భ‌లో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై రాజ‌కీయ పండితులు కూడా విస్మ‌యం వ్యక్తం చేస్తున్నారు. కొంత సేపు అధికారంలోకి వ‌స్తామంటారు. మ‌రికొంత‌సేపు రాక‌పోయినా ఫ‌ర్లేదు.. మాకు పోరాటాలే ముఖ్య‌మంటారు. ఇంకోసారి.. వైసీపీ లేని రాష్ట్రం ఏర్పాటు చేస్తాన‌ని చెబుతారు. దీంతో అస‌లు ప‌వ‌న్ ఉద్దేశం ఏంట‌నేది.. ఎవ‌రికీ అర్ధం కావ‌డం లేదు.

రానున్న ఎన్నికల అనంతరం వైసీపీ లేని ప్రభుత్వం ఏర్పాటవుతుందని జనసేనాని చెప్పటం వరకు ప్రజానీకాన్ని బాగానే ఆకట్టుకుంది. అయితే అది ఏ విధంగా సాకారం అవుతుందనే విషయంపై ఆయన ప్రజలకు స్పష్టత ఇవ్వలేదు.

ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ లేని ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే అది ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, లేదా విపక్షాల స్థానంలో ఉన్న‌ జనసేన, బీజేపీ లకే సాధ్యం. అయితే.. దీనికి సంబంధించి ఈ మూడు పార్టీలూ ఉమ్మ‌డిగా ముందుకు క‌దలాల్సి ఉంది. కానీ, జ‌న‌సేన నాయ‌కుడు ఈ విష‌యాన్ని ఎక్క‌డా ప్ర‌స్తావించ‌డం లేదు.

ఇక‌, వచ్చే ఎన్నికలలో జనసేన జండా ఎగరటం ఖాయం అని ఒకసారి, జనసేన ప్రభుత్వం తథ్యం అని ఇంకోసారి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. దీనిపై ప్రజలలో సందేహాలు తలెత్తుతున్నాయి. జనసేన ఒంటరి పోరుకే సిద్ధమవుతున్నదా? లేక మిత్రపక్షమైన బీజేపీతో కలిసి పోటీచేసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్నదా? ఒకవేళ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి కలసి పోటీ చేస్తే జనసేన ప్రభుత్వం ఎలా ఏర్పాటవుతుంది? సంకీర్ణ సర్కారే వ‌స్తుంది క‌దా.. అనేది ప్ర‌శ్న‌.

ఇక‌, గ‌త కొన్ని నెల‌ల కింద‌ట‌.. పార్టీ ఆవిర్భావ స‌భ‌లో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని పవన్ కళ్యాణ్ చేసిన శపథానికి తన మిత్రపక్షమైన బీజేపీ ఇప్ప‌టి వ‌రకు స్పందించ‌లేదు. ఎందుకంటే తెలుగుదేశం, బీజేపీల మధ్య సయోధ్య సాకారం అయ్యే పరిస్థితులు ఇప్పటికిప్పుడు అయితే లేవు.

ఎన్నికల నాటికి బీజేపీ అగ్రనాయకత్వం అందుకు ఆమోదం తెలిపితేనే అది సాధ్యమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో జనసేన ప్రభుత్వం ఏర్పాటవుతుందని ప‌వ‌న్‌ వ్యక్తం చేస్తున్న ధీమాకు ప్రాతిపదిక ఏమిటి? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఏదేమైనా.. ప‌వ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌లు బాగున్నా.. దానిని ఎలా సాకారం చేసుకుంటార‌నే విష‌యంపై మాత్రం ఆయ‌న క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డం గంద‌ర‌గోళానికి దారితీస్తోంది.