Begin typing your search above and press return to search.

2019 ఎన్నికల ఖర్చు లక్ష కోట్లు?

By:  Tupaki Desk   |   18 April 2016 12:58 PM GMT
2019 ఎన్నికల ఖర్చు లక్ష కోట్లు?
X
దేశంలో అయిదు రాష్ర్టాల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని లేకుండా అన్ని చోట్లా పార్టీల ఎన్నికల ఖర్చు భారీగా కనిపిస్తోంది. ఇప్పటి ఎన్నికలే ఈ రేంజిలో ఉంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఖర్చు మరింత పెరగనుందన్న అంచనాలు వస్తున్నాయి. 2019 సాధారణ ఎన్నికలు భారత చరిత్రలోనే అత్యంత ఖరీదైనవి ఎన్నికలు కానున్నాయట. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ముప్పై వేలకోట్లకు పైగా వ్యయం చేసినట్లు అధ్య యనాలు వెల్లడిస్తున్నాయి. అనంతరం జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇంతవరకు మరో ముప్పై వేల కోట్లు ఖర్చయ్యాయి. 2019 లోక్‌సభ ఎన్నికలకు ఏకంగా లక్షకోట్లు ఖర్చుచేస్తారని అంచనా వేస్తున్నారు. ఇక దేశంలోని శాసనసభలు, నగరపాలక సంస్థలు, జిల్లా పరిషత్‌ల నుంచి సర్పంచ్‌ల వరకు వివిధ స్థాయిల్లో జరిగే ఎన్నికలకు రానున్న ఐదేళ్ళలో మరో రెండు లక్షల కోట్లకు పైగా ఖర్చవుతాయని ఇండియన్‌ ఎలక్షన్‌ వాచ్‌ అధ్యయన సంస్థ అంచనా వేస్తోంది.

ప్రపంచంలోని మరే ప్రజాస్వామ్య దేశంలోనూ ఇంతటి స్థాయిలో ఎన్నికల వ్యయం జరగడంలేదు. ఒక్క భారత్‌లోనే ఏటేటా ఇది పెరుగుతోంది. ఇందుకు కారణం ఈ దేశంలోని రాజకీయ పార్టీలన్నీ కోట్లకు పడగలెత్తాయి. వీటి ఆస్తులపై కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పన్నులు విధించడంలేదు. వీటికొస్తున్న విరాళాలకు సంబంధించి ఆధారాలు చూపించాల్సిన అవసరంలేదు. మరో వైపు పాలక - ప్రతిపక్షాల బేధభావాలు లేకుండా పెద్ద ఎత్తున స్థిరాస్తులు సమకూర్చుకుం టున్నాయి. ఆఖరికి ఈ దేశంలో వామపక్షాలు కూడా అత్యంత సంపద కలిగిన పార్టీలుగా మారిపోయాయి. అధికారికంగా భారత జాతీయ కాంగ్రెస్‌ కు రూ.55వేల కోట్ల ఆస్తులుంటే అనధికారికంగా ఇది మరో పదిరెట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ అధికారికంగానే రూ. 38 వేలకోట్ల ఆస్తులు చూపిస్తుంటే అనధికారిక ఆస్తుల విలువ దీనికి మరో పదిరెట్లు అదనంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు కూడా భారీ స్థాయిలో సంపదలు పొగేశాయి.

పార్టీలు తమ అభ్యర్థుల తరపున వందలు - వేలకోట్ల రూపాయలను విచ్చలవిడిగా వెదజల్లుతున్నాయి. గత దశాబ్దంలో భారతీయ రాజకీయ రంగంలోకి కార్పొరేట్లు - పరిశ్రమల అధిపతుల వలసలు భారీగా మొదలయ్యాయి. బిలియనీర్లైన పెట్టుబడుదారులు రాజకీయాలను కూడా వ్యాపారంగానే పరిగణించడం మొదలెట్టారు. ఇందులో పెట్టుబడులను లాభసాటిగా భావిస్తున్నారు. పెట్టిన ప్రతీ రూపాయికి వంద రూపాయలు లాభమొచ్చే ఏకైక మార్గం రాజకీయమని తేలడంతో వీలైనంతగా ఇందులో మదుపు చేస్తున్నారు. ఒక్కసారి చట్టసభలోకి అడుగెడితే ప్రత్యక్షంగా, పరోక్షంగా వందల, వేలకోట్ల విలువైన ప్రయోజనాలను పొందుతున్నారు. ఆ డబ్బును మళ్లీ ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపిగా పోటీ చేయాలంటే ఈదేశంలో కనీసం వందకోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని అంచనావేస్తున్నారు.శాసనసభకు 40 కోట్లు తప్పనిసరి. ప్రస్తుతం ఎన్నికల వ్యయంపై అనేక ఆంక్షలున్నాయి. ఎన్నికల సమయంలో సీనియర్‌ అధికారులు ప్రతీ రూపాయి ఖర్చును పర్యవేక్షిస్తున్నారు. ఆఖరుకు ఊరుదాటి సొమ్ము వెళ్ళేందుకు కూడా అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అయినా సరే వందల కోట్లు చేతులు మారిపోతున్నాయి. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో ఓటు అంటే నోటే అని అర్థం మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది.