Begin typing your search above and press return to search.

పొత్తు... ఎత్తు.... ఎవరు చిత్తు..!?

By:  Tupaki Desk   |   10 Dec 2018 4:50 PM GMT
పొత్తు... ఎత్తు.... ఎవరు చిత్తు..!?
X
తెలంగాణ ముందస్తు ఎన్నికలలో రాజకీయ చిత్రం క్షణక్షణానికి మారిపోతోంది. ఎవరు ఎవరిపై ఎత్తులు వేస్తున్నారో... ఎవరు ఎవరిని చిత్తు చేస్తారో... ఏ ఎత్తుగడ ఎలా ఉంటుందో... ఏ వ్యూహం ఫలిస్తుందో... అంతా చిందరవందర గందరగోళంగా ఉంది. ఎవరికి వారే తమదే అధికారం అంటూ ధీమాగా ఉన్న లోలోపల మాత్రం ఏదో భయం వెంటాడుతున్నట్లు గానే ఉంది. ఇందుకే పొత్తులు., ఎత్తులు - ఎత్తుగడలు వేస్తున్నారు. ఎక్కడికక్కడ చర్చలు - కొత్త స్నేహాలు పాత పరిచయాలు తెర మీదకు తీసుకువస్తున్నారు. తెలంగాణ ముందస్తు ఎన్నికలలో పాత మిత్రులు దూరమయ్యారు. సుధీర్గ శత్రువులు ఏకమయ్యారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ - మజ్లిస్‌ ల మధ్య స్నే‍హం ఉంది. అయితే తెలంగాణ ఎన్నికలలో మాత్రం అది వైరంగా మారింది. మజ్లిస్ పార్టీ కాంగ్రెస్‌ ను కాదని తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు పలికింది. కాంగ్రెస్‌ ను కాదంది. ఇక చిరకాల శత్రువులైన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ముందస్తు ఎన్నికలలో ఒక్కటయ్యాయి. ఈ పార్టీలన్ని మంగళవారం వెలువడే ఫలితాలను బట్టి తమ ఎత్తులు - పైఎత్తులు - వ్యూహాలు - ప్రతివ్యూహాలు మార్చుకునే పనిలో ఉన్నాయి.

ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందో - ఎవరిని కాదంటుందో చివరి నిమిషం వరకు తేలేలాలేదు. తమ మద్దతు తెలంగాణ రాష్ట్ర సమితికే అని మజ్లిస్ నేతలు ప్రకటించారు. అయితే జాతీయ స్దాయిలో బీజేపీతో వైరం కారణంగా కాంగ్రెస్ పార్టీ మజ్లిస్‌ను తన వైపు తిప్పుకునే అవకాశం ఉందంటున్నారు. దీనికి సోమవారం ఢిల్లీలో జరిగిన మహాకూటమిలో 14 పార్టీల నాయకుల సమవేశం నాందీవాచకం పలుకుతుందంటున్నారు. తెలంగాణలో కేసీఆర్‌ ను గద్దె దించడంతో పాటు కేంద్రంలో బీజేపీని అడ్డుకోవడం కూడా కాంగ్రెస్ లక్ష్యం. ఇందుకు తమకు సహకరించాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీయే మజ్లిస్‌ నేత అసద్దుద్దీన్ ఒవైసీని కోరే అవకాశం ఉందంటున్నారు. ఈ స్నేహం చిగురించేలా కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబి ఆజాద్‌ ను తమ దూతగా పంపే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి మంగళవారం నాడు తెలంగాణలో అనేక ఆసక్తికర అంశాలు జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.