Begin typing your search above and press return to search.

న‌ల్ల‌ధ‌నాన్ని ఓట్ల‌పై ఇన్వెస్ట్ చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   11 Nov 2016 3:39 PM GMT
న‌ల్ల‌ధ‌నాన్ని ఓట్ల‌పై ఇన్వెస్ట్ చేస్తున్నారా?
X
ఎన్నిక‌ల్లో డ‌బ్బు పంపిణీ అనేది స‌ర్వసాధార‌ణ‌మైన వ్య‌హారం అయిపోయింది! పోలింగ్ కు ముందు రోజు ఎవ‌రైతే నోట్లు వెద‌జ‌ల్లుతారో వాళ్ల‌కే ఓట్లు ప‌డ‌తాయి. అందుకే, ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటే దాదాపు ఏడాది ముందుగానే ధ‌న స‌మీక‌ర‌ణ మొద‌లుపెట్టేస్తాయి రాజ‌కీయ పార్టీలు. ఎన్నిక‌ల‌కు కొద్దిరోజుల ముందు పంపిణీ షురూ అవుతుంది. వ‌చ్చే ఏడాది దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌లున్నాయి. కాబ‌ట్టి, ఆయా రాష్ట్రాల్లోని ప్ర‌ధాన పార్టీలు నిధులు రెడీ చేసుకుంటున్నాయి. స‌రిగ్గా ఇదే త‌రుణంలో ప్ర‌ధాన‌మంత్రి పెద్ద క‌రెన్సీ నోట్లను ర‌ద్దు చేశారు. ఈ పిడుగుపాటుకి రాజ‌కీయ పార్టీలు అల్లాడిపోతున్న‌ట్టు స‌మాచారం! బ‌స్తాల్లో దిబ్బేసిన సొమ్మును ఏం చెయ్యాలో అర్థం కాని ప‌రిస్థితి! డిసెంబ‌ర్ నెలాఖ‌రులోపు మార్చ‌క‌పోతే క‌రెన్సీ నోట్ల‌న్నీ క‌రెంటు లేని తీగ‌లైపోతాయి! కాబ‌ట్టి, ఏదో ఒక‌టి చేసి వీటిని వ‌దిలించుకునే ప‌నిలోప‌డ్డాయి.

అందుకే, ఒక మాస్ట‌ర్ ప్లాన్ ప్ర‌కారం నోట్ల పంపిణీ షురూ చేశాయి! ఎలాగూ ఓ న‌ల‌భై రోజుల్లో ఈ నోట్లు చిత్తు కాగితాలుగా మార‌డం ఖాయం. అలాగ‌ని, ఇంత భారీ మొత్తాన్ని బ్యాంకుల‌కు తీసుకెళ్లి మార్చుకునేంత ధైర్యం ఎవ్వ‌రూ చెయ్య‌రు. కాబ‌ట్టి, ఎన్నిక‌ల‌కు ఏడాది స‌మ‌యం ఉన్నా కూడా ముందుగానే ఓట‌ర్ల‌కు నోట్లు పంచేస్తే బాగుంటుంద‌ని కొన్ని రాజ‌కీయ పార్టీల‌ను అనుకుంటున్నాయ‌ట‌! గ్రామీణుల‌కు నోట్లు ఇప్పుడే ఇచ్చేస్తే, వారు బ్యాంకుల‌కు వెళ్లి ఈజీగా మార్చుకుని వాడుకోగ‌లుగుతారు. నోట్ల విలువ‌ను చంపుకునే క‌న్నా... ఇలా పంచేస్తే బెట‌ర్ అని కొన్ని పార్టీలు అనుకోవ‌డం, పంపిణీ చేయ‌డం కూడా మొద‌లుపెట్ట‌శాయ‌ట‌. ఎన్నిక‌లు రాక‌ముందే త‌మ‌కు పార్టీలు డ‌బ్బులు ఇస్తున్న తీరుపై గ్రామీణ ప్రాంతాల ఓటర్లు ఆశ్చ‌ర్యప‌డుతున్నార‌ట‌!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ తోపాటు గోవా - పంజాబ్‌ - ఉత్త‌రాఖండ్‌ - మ‌ణిపూర్ రాష్ట్రాల్లో వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్థంలోనే అసెంబ్లీ ఎన్నిక‌లున్నాయి. యూపీ - పంజాబ్ ల‌లో ఎన్నిక‌ల పోరు ర‌స‌కందాయంగా ఉంటుంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఆయా రాష్ట్రాల్లోనే గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌ల‌కు సొమ్ము పంపిణీ జ‌రుగుతోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి, ముందే నోట్లు ఇచ్చేస్తే... ఓట‌ర్లు త‌రువాత ఓట్లు వేస్తార‌న్న గ్యారంటీ ఉందా..? ఉన్నా లేక‌పోయినా న‌ల్ల‌ధ‌నం దిబ్బేసుకున్న పార్టీల‌కు ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఇంత‌కుమించిన త‌రుణోపాయం లేద‌నే చెప్పాలి. ఇప్పుడు నోట్లు ఇచ్చేసి... ఆ త‌రువాత‌, ఓట్ల కోసం కాళ్లూవేళ్లూ ప‌ట్టుకుని ఓట‌ర్ల‌ను బ‌తిమాలుకుంటారేమో..?

ఉన్న పెద్ద నోట్ల‌ను బ‌య‌ట‌కి తెచ్చుకోలేకా... అలాగ‌ని దాచుకోలేక ఏం చేయాలో తోచ‌నివారు నోట్లకు నిప్పు పెట్టేస్తున్నారు! చెత్త‌కుండీల్లో కూడా ప‌డేస్తున్న వార్త‌లు చూస్తున్నాం. ఇదే త‌రుణంలో... గంగాన‌దిలోకి భారీ సంఖ్య‌లో పెద్ద నోట్లు కొట్టుకు రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని బ‌రేలీ జిల్లాలో ఉన్న మీర్జాపూర్ వ‌ద్ద రూ. 500 - రూ. 1000 నోట్లు న‌దిలో కొట్టుకొచ్చాయి! దీంతో స్థానికులు ఎగ‌బ‌డి న‌దిలోకి దిగి నోట్ల‌ను ఏరుకున్నారు. విష‌యం తెలిసిన పోలీసులు న‌దిలోకి ఎవ్వ‌రినీ అనుమ‌తించ‌డం లేదు. ఇంకీ, ఆ నోట్ల‌ను నీటి ప‌డ‌వలుగా మార్చింది ఎవ‌రో ఇంకా తేలాల్సి ఉంది. మొత్తానికి, పెద్ద నోట్ల బ‌తుకు ఇలా అయిపోయింద‌న్న‌మాట‌! వెయ్యి నోట్ల‌ను రూపాయి కంటే హీనంగా చూస్తున్నారు. ఇష్టం వ‌చ్చిన‌ట్టు పంచేస్తున్నారు. అగ్నికి ఆహ‌తి చేస్తున్నారు. నీళ్ల‌లో వ‌దిలేస్తున్నారు. ఇదంతా బ్లాక్ మ‌నీ కాక‌పోతే ఇంకేటి చెప్పండీ..!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/