Begin typing your search above and press return to search.

నోట్ల ర‌ద్దు త‌ర్వాత‌..పార్టీల డిపాజిట్లు చూస్తే షాకే

By:  Tupaki Desk   |   12 Feb 2017 6:09 PM GMT
నోట్ల ర‌ద్దు త‌ర్వాత‌..పార్టీల డిపాజిట్లు చూస్తే షాకే
X
రూ.500, రూ.100 విలువ‌గ‌ల నోట్ల ర‌ద్దును ప‌్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌క‌టించిన త‌ర్వాత రాజ‌కీయ పార్టీలు పండ‌గ చేసుకున్నాయి. నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం వెలువ‌డిన 50 రోజుల‌లో రాజ‌కీయ పార్టీలు రూ.167 కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన‌ట్లు ఫైనాన్షియ‌ల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ), ఇన్‌క‌మ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ సంయుక్త డేటా వెల్ల‌డించింది. దేశవ్యాప్తంగా ఉన్న టాప్ 15 పార్టీల డిపాజిట్లు ఇవి. ఇందులో రూ.104 కోట్ల‌తో మాయావ‌తికి చెందిన బ‌హుజ‌న్ స‌మాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) అంద‌రిక‌న్నా ముందుడ‌టం గ‌మ‌నార్హం. మిగ‌తా 14 పార్టీలు క‌లిసి రూ.63 కోట్లు డిపాజిట్ చేసిన‌ట్లు ఈ తాజా డేటా వెల్ల‌డించింది. నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో బీజేపీ రూ.4.75 కోట్లు, కాంగ్రెస్ 3.2 కోట్లు డిపాజిట్ అయ్యాయి. ఇక మిగ‌తా పార్టీలు డిపాజిట్ చేసిన మొత్తం రూ.80 ల‌క్ష‌ల నుంచి రూ.3 కోట్ల వ‌ర‌కు ఉన్న‌ట్లు స‌మాచారం. ప్ర‌ధానంగా బీజేపీ, కాంగ్రెస్‌, అన్నా డీఎంకే, స‌మాజ్‌వాదీ పార్టీ, తృణ‌మూల్ కాంగ్రెస్‌, ఆమ్ ఆద్మీ పార్టీల డిపాజిట్ల ఆధారంగా ఈ శాఖ‌లు ఈ లెక్క‌లు తేల్చాయి. డీఎంకే, శివ‌సేన‌, ఆర్జేడీ లాంటి పార్టీల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు.

"దేశంలో మొత్తం 250 రాజ‌కీయ పార్టీలు రిజిస్ట‌ర్ చేసుకున్నా.. అందులో చాలా వ‌ర‌కు పేప‌ర్‌కు ప‌రిమిత‌మైన‌వే ఎక్కువ‌. వాటి గురించి ప్ర‌త్యేకంగా విశ్లేషిస్తాం. మా ప్ర‌స్తుత విశ్లేష‌ణ‌లో ఆరు జాతీయ‌, 9 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఇవ‌న్నీ ప్ర‌స్తుతం ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న‌వే" అని ఈ రెండు ఏజెన్సీల‌కు చెందిన ఓ సీనియ‌ర్ అధికారి తెలిపారు. కాగా, ఇంత పెద్ద ఎత్తున ఉన్న‌ డిపాజిట్లు పార్టీల వ‌ద్ద ఉన్న న‌గ‌దుకు సంబంధించిన స‌మాచారాన్ని ఇవ్వ‌బోవ‌ని మాజీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ టీఎస్ కృష్ణ‌మూర్తి అన్నారు.