Begin typing your search above and press return to search.

షర్మిల సీరియస్ పొలిటీషియన్ కాదు.. మాకు నష్టం లేదు

By:  Tupaki Desk   |   25 March 2021 8:08 AM GMT
షర్మిల సీరియస్ పొలిటీషియన్ కాదు.. మాకు నష్టం లేదు
X
వైఎస్ షర్మిల.. ఈ ఏపీ ఆడకూతురు.. తెలంగాణ కోడలుగా వచ్చి ఇక్కడ రాజకీయం మొదలుపెట్టారు. తెలంగాణలో పార్టీ పెట్టి రాజన్న రాజ్యం తెస్తానంటున్న ఈమెను తెలంగాణ రాజకీయ పక్షాలు లైట్ తీసుకుంటున్నాయా? ఇప్పటిదాకా టీఆర్ఎస్ - కాంగ్రెస్ - బీజేపీలు ఎందుకు ఈమెపై అంత సీరియస్ గా దృష్టి సారించడం లేదా? ఈమె ప్రభావం ఏమాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఉండదని భావిస్తున్నారా? అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు..

ఇప్పటికే టీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్.. తెలంగాణ వచ్చాక కూడా ఇంకా ‘ఆంధ్రా నేతల పాలన’ ఏంటి అంటూ పరోక్షంగా షర్మిలను దెప్పి పొడిచారు. ఇప్పుడు ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క సైతం హాట్ కామెంట్స్ చేశారు.

తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీతో తమకు ఏమాత్రం నష్టం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. షర్మిల పార్టీతో టీఆర్ఎస్ కే ఎక్కువ నష‌్టం జరుగుతుందని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. తమ పార్టీ షర్మిలను సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు. ఇక నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి విజయం ఖాయమైనట్లేనని భట్టి విక్రమార్క జోస్యం చెప్పారు. ఇక్కడ ప్రజలు జానారెడ్డిని ఆదరిస్తున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా కాంగ్రెస్ దే గెలుపు అని భట్టి విక్రమార్క చెప్పారు.

షర్మిల రాజకీయాల్లో అధికార టీఆర్ఎస్ నే టార్గెట్ చేశారు. ఆమె రెడ్డి సామాజికవర్గాన్ని తనవైపు తిప్పుకునేలా రాజకీయం చేస్తున్నారు. ఇక తెలంగాణ అమరవీరుల కుటుంబాలనే చేరదీస్తున్నారు. ఈ క్రమంలోనే భట్టి ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. షర్మిల వల్ల టీఆర్ఎస్ కే నష్టం అన్నారు. అయితే టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీల్చే బీజేపీకి షర్మిల వల్ల నష్టం అని.. ఆమె పోటీచేయడం వల్ల రెడ్డిలకు కేంద్రమైన కాంగ్రెస్ పార్టీ ఓట్లు కూడా చీలుతాయని.. అంతిమంగా బీజేపీకి, కాంగ్రెస్ లకే షర్మిల వల్ల నష్టమని రాజకీయవర్గాలు అంటున్నాయి.

అయితే షర్మిల ప్రభావం ఏమాత్రం తెలంగాణలో ఉండదని.. అందుకే ఇప్పటిదాకా ఒక్క మాజీ ఎమ్మెల్యే, పెద్ద నేతలు ఎవరూ ఆమె వెంట రాలేదని.. కాబట్టి సీరియస్ పొలిటిషియన్ కాని షర్మిలతో తెలంగాణ రాజకీయ పార్టీలకు నష్టం కాదన్న వాదన రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.