Begin typing your search above and press return to search.

ఈ వార‌మంతా తెలంగాణ హోరెత్తిపోతుంది

By:  Tupaki Desk   |   26 Nov 2018 5:54 AM GMT
ఈ వార‌మంతా తెలంగాణ హోరెత్తిపోతుంది
X
పోలింగ్ గ‌డువు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో తెలంగాణ రాజ‌కీయ ముఖ‌చిత్రం మారుతోంది. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ ప్రధాన పార్టీల ప్రచారం హోరెత్తుతున్నది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత - ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు సుడిగాలి పర్యటనలతో పార్టీ తరఫున విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు మంత్రి కేటీ రామారావు అలుపెరుగకుండా రోడ్‌ షోలను నిర్వహిస్తూ పార్టీ నాయకులను - కార్యకర్తలను ఉత్తేజపరుస్తున్నారు. యూపీఏ చైర్‌ ప‌ర్స‌న్ సోనియాగాంధీ - కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ భారీ స‌భ‌లు నిర్వ‌హించారు. బీజేపీ తరఫున పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

ఈ స‌భ‌ల‌కు కొన‌సాగింపుగా వివిధ పార్టీలు త‌మ ప్ర‌చార పర్వాన్ని ఉధృతం చేస్తున్నారు. వ‌చ్చే మంగళవారం - వచ్చేనెల 3న రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటించనున్నారు. మంగళవారం మహబూబ్‌ నగర్ - నిజామాబాద్ సభల్లో నరేంద్రమోడీ ప్రసంగిస్తారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ వెల్లడించారు. వచ్చేనెల 3న లాల్‌ బహుదుర్ స్టేడియంలో భారీ ఎత్తున బహిరంగసభ ఉంటుందని తెలిపారు. ఇక బీజేపీ త‌ర‌ఫున స్టార్ క్యాంపెయిన్లుగా యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌ - కేంద్ర‌మంత్రి స్మృతీఇరానీ - ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ త‌దిత‌రులు పాల్గొన‌నున్నారు. ఇప్ప‌టికే పార్టీకి చెందిన తెలంగాణ నేత ప‌రిపూర్ణానంద స్వామి ప‌ర్య‌టిస్తున్నారు.

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం - మ‌హాకూట‌మికి సార‌ద్యం వ‌హిస్తున్న కాంగ్రెస్ పార్టీ సైతం త‌న దూకుడును కొన‌సాగిస్తోంది. 28 - 29 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రోడ్‌ షోలలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీవర్గాలు తెలిపాయి. 28న కొడంగల్ - మధిర - సికింద్రాబాద్ - నాంపల్లి - 29న భూపాలపల్లి - పరిగి - చేవెళ్ల నియోజకవర్గాల్లో పర్యటిస్తారని, వచ్చేనెల 3న మరోసారి పర్యటించనున్నట్టు పార్టీ నాయకులు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 28 - 29 తేదీల్లో ప్రచారం చేస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.