Begin typing your search above and press return to search.

ప్లీజ్... ప్రచారం చేయండి

By:  Tupaki Desk   |   25 Oct 2018 4:20 AM GMT
ప్లీజ్... ప్రచారం చేయండి
X
" మీరు ప్రచారం చేస్తే మాకు ఓట్లు వస్తాయి. మేం అధికారంలోకి వస్తే మీకు...మీ పరిశ్రమకు మేలు జరుగుతోంది"

" సెటిలర్లే కాదు... తెలంగాణలో కూడా మీ అభిమానులున్నారు. మీ మాట వారు వింటారు. మాకు ప్రచారం చేయండి "

ఇవి తెలంగాణ ఎన్నికల బరిలో ఉన్న రాజకీయ పార్టీల నాయకుల విన్నపాలు. ఇలా విన్నవించుకుంటున్నది ఎవరినో తెలుసా. ఇంకెవరు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు - హీరోయిన్లను. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో జత కలవడంతో ఇంతకు ముందే ఆ పార్టీకి చెందిన తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన వారు మహాకూటమికి అనుకూలంగా ప్రచారం చేస్తారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు వారితో పాటు మరికొందరు నటులను కూడా ప్రచారంలో దింపాలని మహాకూటమి నాయకులు భావిస్తున్నారు. దీంతో పాటు సీనియర్ నటి విజయశాంతి కూడా కాంగ్రెస్ స్టార్ క్యాంపెయిన్ కమిటీ అధ్యక్షురాలిగా ఉండడంతో అటు తెలుగుదేశం నాయకులు - ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటీనటులను ప్రచార రంగంలోకి దింపి లాభ పడాలనుకుంటున్నారు. నందమూరి కుటుంబం ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి - కొన్ని చోట్ల మహాకూటమి అభ్యర్ధుల విజయానికి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

అధికార తెలంగాణ రాష్ట్ర సమితి కూడా సినీ పరిశ్రమకు చెందిన వారిని తమకు అనుకూలంగా ప్రచారం చేయాలని కోరుతోంది. ఇందుకు కొందరు హీరోలు - హీరోయిన్లు అంగీకరించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే నటుడు సుమన్ తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలంగా ప్రచారం చేస్తానని ప్రకటించారు. నటుడు దేవరకొండ విజయ్ కి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కల్వకుంట్ల తారక రామారావుకు మధ‌్య సాన్నిహిత్యం ఉంది. దీంతో ఆయన కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలంగా ప్రచారం చేస్తారని అంటున్నారు. హీరోయిన్ సమంత తెలంగాణ అంతటా ప్రచారం చేయకపోయినా కెటీఆర్ పోటీ చేసే చోట - మరో రెండు మూడు స్ధానాల్లోనూ ప్రచారం చేయవచ్చునంటున్నారు. హీరో అల్లు అర్జున్ మామ గారు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి టిక్కట్ ఆశించి భంగపడ్డారు. దీంతో అల్లు అర్జున్ తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రచారం చేయడం కష్టమే. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలంగాణ జన సమితి తరఫున ప్రచారం చేసే అవకాశాలున్నాయంటున్నారు. ఇక దర్శకుడు శంకర్ తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ప్రచారం చేసే అవకాశాలున్నాయి.అలాగే రచయితలు సుద్దాల అశోక్ తేజ - చంద్రబోస్ వంటి వారు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ప్రచారం చేసే అవకాశాలున్నాయంటున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ కూడా తారలను దింపే ఆలోచనలో ఉంది. బాబూ మోహన్ ఇప్పటికే పార్టీలో చేరారు. అలనాటి హీరోయిన్ కవిత కూడా ఆ పార్టీలోనే ఉన్నారు. వీరు కాక మరికొందరు స్టార్లతో ప్రచారం చేయించే అవకాశాలున్నాయంటున్నారు. తెలుగు వెండి తెర ముందస్తు ఎన్నికల కోసం రోడ్డున పడడం ఖాయంగానే కనిపిస్తోంది.