Begin typing your search above and press return to search.

ర్యాలీకి వస్తే 1000...చప్పట్లు కొడితే 500

By:  Tupaki Desk   |   15 March 2016 5:30 PM GMT
ర్యాలీకి వస్తే 1000...చప్పట్లు కొడితే 500
X
త‌మిళనాట అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రంలో అధికారం నిలుపుకునేందుకు అన్నా డీఎంకే, కోల్పోయిన సీఎం పీఠాన్ని దక్కించుకునేందుకు డీఎంకే హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎన్నికలకు కాస్తంత ముందుగానే ప్రచారానికి తెర తీసిన అన్నా డీఎంకే అధినేత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత తనదైన శైలిలో కొత్త పథకాలను ప్రారంభిస్తూ దూసుకువెళుతున్నారు. ఇక విపక్ష డీఎంకే కూడా ఇప్పుడిప్పుడే ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రచారం కోసం డీఎంకే అధినేత - మాజీ సీఎం కరుణానిధి కోసం ఓ ప్రత్యేక వాహనం కూడా రెడీ అయిపోయింది. ఈ క్రమంలో ప్రచారంలో సత్తా చాటేందుకు ఇరు పార్టీలు వ్యూహాలు రచించాయి.

ప్ర‌చార‌ప‌ర్వంలో భాగంగా జన బలాన్ని చాటేందుకు రెండు పార్టీలు కూడా సరికొత్త పంథాను అమలు చేస్తున్నాయి. ప్రజా సేకరణ పథకం పేరిట ప్రచారంలోకి వచ్చిన కొత్త పథకంలో భాగంగా ప్రచారానికి హాజరయ్యే వారికి పెద్ద ఎత్తున తాయిలాలు అందుతున్నాయి. ప్రచార సభకు హాజరై, రెండు గంటల పాటు కూర్చుని చప్పట్లు కొట్టే వారికి తలా రూ. 500 ఇచ్చేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి. ఇక ఆయా పార్టీలు నిర్వహించే ర్యాలీల్లో పాలుపంచుకునేవారికి రూ. 1000 నోటు దక్కనుందట. ఇక ఇలా ఓ 25 మందిని తీసుకువచ్చే వారికి రోజుకు రూ. 2500 ఇచ్చేందుకు తమిళ పార్టీలు రంగం సిద్ధం చేశాయని సమాచారం. కొన్ని గంటల పాటు ఊరికే కూర్చోవడం, ర్యాలీలో కొంత దూరం నడిస్తేనే వందలాది రూపాయలు ఇస్తామని చెబుతుండడంతో అక్కడ ఇళ్లలో ఖాళీగా ఉండే మహిళలకు యమా గిరాకీ పెరిగిందట. ఇక కూలీ పనులకు వెళ్లే వారు కూడా పనులు మానేసి ప్రచారం బాట పడుతుండ‌టం విశేషం.