Begin typing your search above and press return to search.

ఒంట‌రి పోరుకు పార్టీల బెంబేలు.. ఏపీలో వింత ప‌రిస్థితి!

By:  Tupaki Desk   |   23 Dec 2020 2:30 AM GMT
ఒంట‌రి పోరుకు పార్టీల బెంబేలు.. ఏపీలో వింత ప‌రిస్థితి!
X
ఎన్నిక‌లు.. అంటే చాలు.. ఏపీలో పార్టీలు బెంబేలెత్తుతున్నాయా? ఒంట‌రిగా బ‌రిలో నిలిచేందుకు హ‌డ‌లి పోతున్నాయా? పొత్తుల కోసం వెంప‌ర్లాడుతున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో అన్ని పార్టీలూ ఒంట‌రిగానే పోటీ చేశాయి. అయితే.. ఇందులోనూ జ‌న‌సేన‌-క‌మ్యూనిస్టు లు క‌లిసి పోటీ చేశారు. వీరు మిన‌హా బీజేపీ, టీడీపీ, వైసీపీలు ఒంట‌రిగానే పోరుకు దిగాయి. ఇందులో వైసీపీ గెలిచి అధికారంలోకి వ‌చ్చింది. మిగిలిన పార్టీలు స‌త్తా చూప‌లేక పోయారు. దీనిపై ఆయా పార్టీలు అంత‌ర్మ‌థ‌నంతో తేల్చేసిన ఏకైక విష‌యం.. ఒంట‌రిగా పోటీ చేయ‌డం త‌ప్ప‌నే! దీంతో వెంట‌నే జ‌న‌సేన పోయి పోయి.. మ‌ళ్లీ బీజేపీతో పొత్తుకు దిగింది.

ఇక‌, బీజేపీ కూడా తాము ఒంట‌రిగా బ‌రిలో నిలిచే ప‌రిస్థితి లేద‌ని గుర్తించి.. జ‌న‌సేన‌ను క‌లుపుకొని ముందుకు సాగుతోంది. ఇక‌, ఇప్పుడు టీడీపీ, క‌మ్యూనిస్టులకు పొత్తు పార్టీలు కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలుస్తోంది. ఆయా పార్టీలు పైకి దూరంగా ఉన్నా.. లోపాయికారీగా పొత్తుతోనే ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. సీపీఎం విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. సీపీఐ మాత్రం టీడీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. టీడీపీ బాట‌లోనే న‌డుస్తోంది. ఇక‌,ఇప్పుడు తిరుప‌తి ఉప పోరు తెర‌మీదికి వ‌చ్చింది. ఈక్ర‌మంలో పొత్తుతో ముందుకు సాగాల‌ని టీడీపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. సీపీఐ క‌లిసి వ‌చ్చేందుకు సిద్ధంగానే ఉంది. తాజాగా ఈ విష‌యంపై హైద‌రాబాద్‌లో చంద్ర‌బాబు చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు తెలుస్తోంది.

ఇక‌, జ‌న‌సేన‌-బీజేపీ క‌లిసే ఉన్న విష‌యం తెలిసిందే. అయితే.. తిరుప‌తి టికెట్ విష‌యంలో ఇరు పార్టీల మ‌ధ్య విభేదాలు పొడ‌చూపుతున్నాయి. మేం ఈ టికెట్ కావాల‌ని కోరాం.. కానీ.. మీరు మాత్రం ముందుగానే బీజేపీ అభ్య‌ర్థి ఇక్క‌డ పోటీ చేస్తార‌ని ప్ర‌క‌టించ‌డం ఏమాత్రం స‌మంజ‌సం? అనే ప్ర‌శ్న జ‌న‌సేన నుంచి వినిపిస్తోంది. ఈ విష‌యంలో కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌కు కూడా జ‌న‌సేన నుంచి ఫిర్యాదులు అందిన‌ట్టు తెలుస్తోంది. ఈ టికెట్ విష‌యం ఎలా ఉన్న‌‌ప్ప‌టికీ.. పొత్తు మాత్రం కొన‌సాగుతుంద‌ని.. ఇరు పార్టీల నేత‌లు ప్ర‌క‌టిస్తున్నారు. ఏదేమైనా.. రాష్ట్రంలో ఒంట‌రిగా పోటీ చేసేందుకు మాత్రం వైసీపీ మిన‌హా ఏ పార్టీ కూడా సాహసం చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ ప‌రిస్థితిని త‌గ్గించుకునేందుకు పార్టీలు కృషి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం. క్షేత్ర‌స్థాయిలో పార్టీ బ‌లంగా ఉంద‌నే టీడీపీ.. పొత్తుల కోపం పాకులాడ‌డంపై పెద‌వి విరుస్తున్నారు.