Begin typing your search above and press return to search.

ప్రశ్నలే ప్రశ్నలు; బాబు 83.. జగన్ 100

By:  Tupaki Desk   |   13 July 2016 4:17 AM GMT
ప్రశ్నలే ప్రశ్నలు; బాబు 83.. జగన్ 100
X
ఏపీలో ఇప్పుడు సర్వేల జోరు పెరిగింది. ఒకే కాలంలో ఏపీ అధికారపక్షం.. ప్రధాన ప్రతినిపక్షం రెండూ ఒకే సమయంలో జరుపుతున్న సర్వే వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏపీ ప్రజల స్థితిగతులు తెలుసుకునేందుకు వీలుగా ఏపీ అధికారపక్షం స్మార్ట్ పల్స్ పేరిట ఒక భారీ సర్వే కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఏపీ సర్కారు నిర్వహిస్తున్న తాజా సర్వేలో ప్రజల ఆర్థిక.. సామాజిక స్థితిగతులతో పాటు.. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన తప్పొప్పులు తెలుసుకునే వీలుగా సర్వే నిర్వహిస్తున్నారు. తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత సకల జనుల సర్వే అంటూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజులో సర్వే నిర్వహించిన తీరులోనే తాజాగా ఏపీ సర్కారు తాజా సర్వే నిర్వహిస్తోంది.

కాకుంటే.. తెలంగాణ సర్కారు మొత్తం సర్వేకార్యక్రమాన్ని ఒక రోజు వ్యవధిలో ముగించటంతో వివరాల సేకరణలో ఎన్నో తప్పులు చోటు చేసుకున్నట్లుగా చెబుతారు. అలాంటిది తమ సర్వేలో చోటు చేసుకోకూడదన్న ఉద్దేశంతో ఏపీ సర్కారు వ్యవహరిస్తోంది. ఇందుకోసం అధికారులకు కొంత గడువు ఇచ్చి.. సర్వే కార్యక్రమాన్ని పక్కాగా పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

ఒక్కో అధికారిక సర్వే బృందం రోజుకు 14 కుటుంబాలను మాత్రమే కలిసి.. వారి వివరాల్ని సేకరించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కుటుంబం మిస్ అయితే.. ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలు తర్వాత సేకరించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం చేపడుతున్న సర్వేలో 83 ప్రశ్నలకు సమాధానాల్ని సేకరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇదే సమయంలో ఏపీ ప్రధాన ప్రతిపక్షం గడప గడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ అంటూ భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. రెండునెలల వ్యవధిలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్లి.. ఏపీ సర్కారు చేస్తున్న తప్పుల గురించి ప్రచారం చేయటంతో పాటు.. వంద ప్రశ్నలతో కూడిన సర్వేను చేపడతారు. బాబు పాలన మీద ప్రజలు మార్కులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు.

ఇలా ఒకే సమయంలో అధికార.. ప్రధాన ప్రతిపక్షం చేపట్టిన సర్వేలతో ఏపీ రాజకీయం వేడెక్కింది. ఒకరి సర్వే మీద మరొకరు తీవ్ర విమర్శలు చేసుకోవటం ఎక్కువైంది. ఏపీ సర్కారు చేపట్టిన తాజా సర్వే వివరాలతో ఇప్పుడు అమలు చేస్తున్నసంక్షేమ పథకాలు కట్ చేసేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సర్వేలలో పాల్గొనవద్దని ప్రచారం చేయటం హీట్ ను మరింత పెంచుతోంది.

ఈ వాదనను తిప్పి కొట్టేందుకు ఏపీ అధికారపక్ష నేతలు ప్రయత్నిస్తున్నారు. తాజా సర్వేలతో పథకాల్లో కోతలు ఉండవని.. మరిన్ని సంక్షేమ పథకాల కోసమే తాము సర్వే చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో.. తమ సర్కారు చేపట్టిన కార్యక్రమానికి సంబంధించి అసలు ఉద్దేశాన్ని ప్రచారం చేయటంతో పాటు.. విపక్షం చేపట్టిన సర్వేపై తీవ్ర విమర్శలు సంధిస్తున్నారు. ఇలా.. సర్వేలతో ఏపీ రాజకీయం సలసలా కాగుతుందని చెప్పాలి. వర్షాకాలంలో వేడి పుట్టించేలా తాజా సర్వేలు ఉన్నాయని చెప్పాలి. ఆసక్తికర విషయం ఏమిటంటే.. అధికారపక్షం చేస్తునన సర్వే కంటే విపక్షం చేస్తున్న సర్వే ప్రశ్నలు ఎక్కువగా ఉండటం గమనార్హం.