Begin typing your search above and press return to search.

యువ‌త పై దృష్టి సారిస్తోన్న పార్టీలు!

By:  Tupaki Desk   |   24 Aug 2018 1:30 AM GMT
యువ‌త పై దృష్టి సారిస్తోన్న పార్టీలు!
X
తెలుగు రాష్ట్రాలు - జాతీయ స్థాయిలోను ఎన్నికల వేడి రాజుకుంటోంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికల సమరం ప్రారంభ‌మ‌య్యేందుకు ఎంతో సమయం లేదు. దీంతో జాతీయ, ప్రాంతీయ పార్టీలు.....విద్యార్థులు - యవతీయువకుల ఓట్ల‌పై దృష్టి పెట్టారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ప్రధాన పార్టీలైన టీఆర్ ఎస్ - టీడీపీ - బీజేపీ - వైసీపీ - కాంగ్రెస్ లు విద్యార్థి సంఘాలు - యువజన సంఘాలపై ఫోక‌స్ పెట్టాయి. ఆంధ్రప్రదేశ్‌ తో పోలిస్తే తెలంగాణలో విద్యార్ధి - యువజన సంఘాలు.....రాజ‌కీయాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. అధికార - ప్రతిపక్ష పార్టీలన్నిటికీ, విద్యార్ధి - యువజన సంఘాలున్నాయి. ఆ సంఘాల నాయకుల ద్వారా విద్యార్ధుల‌ను - యువతను తమ వైపు తిప్పుకునే యోచనలో అన్ని పార్టీలు ఉన్నాయి.

తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివ‌ర్సిటీ విద్యార్ధుల పాత్ర కీలకంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఒక విధంగా తెలంగాణ రావడం వెనుక ఉస్మానియా విద్యార్ధుల‌ పాత్ర ఉంది. గత ఎన్నికలలో తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని విద్యార్ధులు, యువత భావించి టీఆర్ ఎస్ కు మద్దతు పలికాయి. వారి ఓట్లతోనే కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. విద్యార్ధులు - యవత ఆశించిన, కలలుగన్న తెలంగాణ రాలేదు. తెలంగాణలో నిరుద్యోగం పెరిగిపోయింది. ఉద్యోగాలు ఇస్తామ‌ని కేసీఆర్ ఇచ్చిన హామీ నెర‌వేర‌లేదు. కేసీఆర్ పై ఉస్మానియా విద్యార్ధులు గుర్రుగా ఉన్నారు. ఆ వ్య‌తిరేక‌త‌ను క్యాష్ చేసుకుందామ‌నుకున్న రాహుల్ కు ...ఉస్మానియాలో ప‌ర్య‌టించే అవ‌కాశం టీఆర్ ఎస్ ఇవ్వ‌లేదు. ఇది త‌మ‌కే లాభిస్తుంద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

ఇక‌, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న చంద్రబాబు పట్ల విద్యార్ధులు - యువత ఆగ్రహావేశాలు వ్య‌క్తం చేస్తున్నారు. బాబు వస్తే జాబు అన్న నినాదం కార్యరూపం దాల్చలేదు. దీంతో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులు - యువతీయవకులు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పట్ల విద్యార్ధులు - యువకులలో నమ్మకం లేదు. పవన్ కల్యాణ్ మాటలు సినీఫక్కిలోనే ఉన్నాయని వారు భావిస్తున్నారు. ఇక ఏపీ - తెలంగాణ‌లో బీజేపీ - మోదీల‌పై కూడా వారు అంతే వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇవ్వలేదని అక్కడివారు, తెలంగాణ అభివృద్ధిలో పాలుపంచుకోవడం లేదని ఇక్కడి వారు బిజేపీని వ్యతిరేకిస్తున్నారు. మొత్తానికి రానున్న ఎన్నికలలో విద్యార్ధులు - యువ‌కుల ఓట్లే కీలకం కానున్నాయి.