Begin typing your search above and press return to search.

రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌!..అంద‌రికీ ప‌రీక్షే!

By:  Tupaki Desk   |   6 July 2018 11:54 AM GMT
రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌!..అంద‌రికీ ప‌రీక్షే!
X
జాతీయ స్థాయి రాజ‌కీయాల్లో అన్ని పార్టీలకు ఇప్పుడు త‌మ త‌మ బ‌లం తేల్చుకునే అవ‌కాశం వ‌చ్చింద‌నే చెప్పాలి. అదేంటీ... వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనే క‌దా అన్ని పార్టీల బ‌లాబ‌లాలే తేలేదీ? అంటే.. అంత‌కంటే కాస్తంత ముందుగానే... మ‌రింత‌గా చెప్పాలంటే రానున్న 15 - 20 రోజుల్లోనే అన్ని పార్టీల బ‌లాబ‌లాలు ఏమిటో తేల్చేసుకునే అవ‌కాశం వ‌చ్చింద‌ని చెప్పాలి. ఆ అవ‌కాశ‌మే... రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌. మొన్న‌టిదాకా రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్‌ గా కొన‌సాగిన సీనియ‌ర్ పొలిటీషియ‌న్ కురియ‌న్ ప‌ద‌వీ విమ‌ర‌ణ చేశారు. ఆయ‌న స్థానంలో ఇప్పుడు కొత్త డిప్యూటీ చైర్మ‌న్‌ ను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ ఎన్నిక ఇటు అధికార ఎన్డీఏ కూటమితో పాటు అటు విప‌క్ష యూపీఏ కూటమికి కూడా కీల‌కంగా ప‌రిణ‌మించేసింది. ఈ రెండు కూట‌ముల కంటే కూడా తృతీయ కూట‌మి క‌ట్టేస్తామంటూ బీరాలు ప‌లుకుతున్న ప‌లు జాతీయ స్థాయి పార్టీల‌కు - ప్ర‌ధానంగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ ఇప్ప‌టికే రంగంలోకి దిగేసిన టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుకు - నాలుగేళ్ల పాటు బీజేపీతో క‌లిసిమెల‌సి తిరిగి ఇటీవ‌లే ఆ స్నేహానికి చెల్లుచీటి ఇచ్చేసిన టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడికి కూడా ఈ ఎన్నిక మ‌రింత కీల‌క కానుంద‌న్న వాద‌న వినిపిస్తోంది.

రాజ్య‌స‌భ‌లో ప్రస్తుతం 243 మంది స‌భ్యులున్నారు. అంటే ఏ కూటమికి 122 స‌భ్యుల బ‌ల‌ముంటే... ఆ కూట‌మి అభ్య‌ర్థి విజ‌యం సాధిస్తార‌న్న మాట‌. అధికార ఎన్డీఏకు ప్ర‌స్తుతం స‌భ‌లో 90 మంది స‌భ్యుల బ‌ల‌ముంది. ఇక త‌మిళ‌నాట అధికార పార్టీగా ఉన్న అన్నాడీఎంకేకు ఉన్న 14 మంది స‌భ్యుల మ‌ద్ద‌తు కూడా ఎన్డీఏకే ఉంది కాబ‌ట్టి... అప్పుడు మొత్తంగా బీజేపీకి 104 మంది స‌భ్యుల బ‌ల‌మున్న‌ట్లు లెక్క‌. ఈ లెక్క‌న డిప్యూటీ చైర్మ‌న్ గా త‌న అభ్య‌ర్థిని గెలిపించుకునేందుకు బీజేపీకి మ‌రో 18 మంది స‌భ్యుల బ‌లం అవ‌స‌రం కానుంది. ఈ 18 మంది స‌భ్యుల మ‌ద్ద‌తు కోసం బీజేపీ ఏఏ పార్టీల మ‌ద్ద‌తు కోరుతుంద‌న్న‌ది ఇప్పుడు కీల‌కంగా మారింది. ఆరుగురు స‌భ్యులున్న టీడీపీతో పాటు ముగ్గురు స‌భ్యులున్న శివ‌సేన‌లు ఇప్ప‌టికే ఎన్డీఏ కూట‌మి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. బీజేపీతో పొత్తు మాట అన్న‌దే లేద‌న్న రీతిలో ఈ రెండు పార్టీలు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఈ రెండు పార్టీలకు చెందిన స‌భ్యులు... బీజేపీకి వ్య‌తిరేకంగా నిలిచే అభ్య‌ర్థికే ఓటేస్తారు.

ఇక ఎన్డీఏతో పాటు యూపీఏ కూట‌మికి ప్ర‌త్యామ్నాయంగా కూట‌మిని ఏర్పాటు చేస్తామంటూ రంగంలోకి దిగిన కేసీఆర్ పార్టీకి స‌భ‌లో ఆరుగురు స‌భ్యుల బ‌ల‌ముంది. మొన్న‌టిదాకా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ సాగిన కేసీఆర్‌... మొన్న‌టికి మొన్న మోదీతో భేటీ అయ్యారు. అంతేకాకుండా కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అడిగిందే త‌డ‌వుగా మోదీ అపాయింట్ మెంట్ ఇచ్చేశారు. ఈ క్ర‌మంలో టీఆర్ ఎస్ ప‌య‌న‌మెటు అన్న ప్ర‌శ్న ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక స‌భ‌లో కాంగ్రెస్ పార్టీకి 51 మంది స‌భ్యుల బ‌ల‌ముండ‌గా... 14 మంది స‌భ్యులున్న‌ అన్నాడీఎంకే త‌ర్వాత 13 మంది స‌భ్యుల చొప్పున బ‌ల‌మున్న పార్టీలుగా తృణ‌మూల్ కాంగ్రెస్‌ - స‌మాజ్ వాదీ పార్టీలున్నాయి. ఇక వీటి త‌ర్వాత 9 మంది స‌భ్యులున్న బిజూ జ‌న‌తాద‌ళ్ పార్టీ మ‌రో పెద్ద పార్టీగా స‌భ‌లో కొన‌సాగుతోంది.

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నికల్లోగా బీజేపీకి ఓ గుణ‌పాఠం చెప్పేందుకు వ‌చ్చిన ఈ స‌ద‌వ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకునేందుకు ఇప్ప‌టికే తృణ‌మూల్ కాంగ్రెస్‌ - బిజూ జ‌న‌తాద‌ళ్ రెండూ రంగంలోకి దిగేశాయి. త‌మ భావ‌జాలానికి కాస్తంత అటూఇటూగా ఉన్న రాజ‌కీయ పార్టీల‌తో ఈ రెండు పార్టీలు మంత‌నాలు సాగిస్తున్నాయి. తృణ‌మూల్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీతో ఉన్న మైత్రి కార‌ణంగా టీడీపీ స‌భ్యుల ఓట్ల‌ను ఆ పార్టీ నిల‌బెట్టే అభ్య‌ర్థికి వేయించేందుకు చంద్ర‌బాబు ఇప్ప‌టికే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లుగా స‌మాచారం. ఇక త‌న అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపితే... ఎలాగూ గెల‌వ‌లేమ‌న్న భావ‌న‌తో బీజేడీ అభ్య‌ర్థికే మ‌ద్ద‌తు ఇచ్చి... మిగిలిన పార్టీల‌ను కూడా ఆ ద‌రికి చేర్చి వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన ప‌క్షంగా రంగంలోకి దిగాల‌న్న‌ది కాంగ్రెస్ పార్టీ ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది. అయితే ఇటు యూపీఏతో పాటు అటు ఎన్డీఏకు కూడా స‌మ‌దూరం పాటిస్తున్న బీజేపీ వైఖ‌రి ఇప్పుడు కీల‌కంగా మారింద‌న్న కోణంలోనూ విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

ఈ స‌మీక‌ర‌ణాల‌న్నింటినీ బేరీజు వేసుకున్న బీజేపీ కూడా త‌న పార్టీకి చెందిన అభ్య‌ర్థిని కాకుండా దేశంలోని మెజారిటీ పార్టీలకు అనుకూలుడుగా ఉండే అభ్య‌ర్థి కోసం వేట మొద‌లెట్టింది. ఇందులో భాగంగా మాజీ ప్ర‌ధాని ఐకే గుజ్రాల్ కుమారుడు, అకాలీద‌ళ్ నేత న‌రేశ్ గుజ్రాల్ పేరును ఆ పార్టీ తెర మీద‌కు తీసుకొచ్చింది. గుజ్రాల్ ఫ్యామిలీకి ఉన్న సానుకూల‌త‌ను పావుగా చూపి బీజేడీతో పాటు టీఆర్ ఎస్‌ - వైసీపీ స‌భ్యుల మ‌ద్ద‌తుతో గ‌ట్టెక్క‌వ‌చ్చ‌ని ఓ అంచ‌నాకు వ‌చ్చిన‌ట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా... సార్వ‌త్రిక ఎన్నిక‌ల కంటే కాస్తంత ముందుగా వ‌చ్చిన రాజ్య‌స‌భ డిప్యూటీ స్పీక‌ర్ ఎన్నిక విష‌యంలో స‌త్తా చాటాల‌ని ఇటు ఎన్డీఏతో పాటు అటు యూపీఏ కూడా త‌మ‌దైన రీతిలో య‌త్నాలు చేస్తున్నాయి. వీటితో పాటు తృణ‌మూల్‌, బీజేడీ కూడా త‌మ‌దైన రీతిలో స‌మీక‌ర‌ణాల‌కు సిద్ధ‌ప‌డ్డాయి. చూద్దాం ఏం జ‌రుగుతుందో?