Begin typing your search above and press return to search.

బోల్డ్ గా మాట్లాడితే బోలెడు నష్టం పవన్...

By:  Tupaki Desk   |   5 Dec 2022 1:30 PM GMT
బోల్డ్ గా మాట్లాడితే బోలెడు నష్టం పవన్...
X
రాజకీయాల్లో నిజాయితీ ఉండాలా అంటే కచ్చితంగా ఉండాలి. అయితే అది అవతల వారిని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. రాజకీయంగా తలపండిన దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఎప్పుడూ ఒక మాట అనేవారు. అదేంటి అంటే రాజకీయం ఒక ఆట. అవతల వారు ఎలా ఆడితే మనమూ అలాగే ఆడితేనే విజయం అని. అందువల్ల వాజ్ పేయి కాలం నాటికే రాజకీయాలు చాలా మారాయి.

ఇపుడు మరింతగా అవి దిగజారుతున్నాయి. ఈ సమయంలో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే రాజకీయ ప్రత్యర్ధులు చెలగాటం ఆడేస్తారు. అంతే కాదు ప్రజలు కూడా మంచివారిగా ముద్ర వేసి వదిలేస్తారు అని అంటున్నారు. ఇదంతా ఎందుకంటే జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయం గురించే. ఆయన నిజాయతీగా ఉంటారు. ఆయన మాటల వెనక కూడా కచ్చితత్వం ఉంటుంది. అయితే అది జనాలకు వర్తమాన రాజకీయానికి ఎంతవరకూ పడుతుంది అన్నదే చర్చ.

లేటెస్ట్ గా హైదరాబాద్ లో జరిగిన ఒక ఇంటర్నేషనల్ సదస్సులో పవన్ మాట్లాడుతూ తాను క ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని చెప్పుకున్నారు అయితే తాను అపజయం నుంచి విజయం వైపుగా పయనిస్తున్నాను అంటూ పవన్ అదే ప్రసంగంలో చెప్పారు. కానీ అర్ధం చేసుకున్న వారికి రెండూ కావాలి. రాజకీయ ప్రత్యర్ధులు మాత్రం మొదటిదే కావాలి. ఆ విధంగా పవన్ కళ్యాణ్ తానుగా చెప్పుకున్న ఫెయిల్యూర్ పొలిటీషియన్ అన్న దానిని పట్టుకుని పొలిటికల్ ర్యాగింగ్ చేస్తున్నారు.

ఒక విధంగా పవన్ ఉన్నది ఉన్నట్లుగా మనసులో మాటలను మాట్లాడడం వచ్చిన ఇబ్బంది ఇదంతా అంటున్నారు. దీని వల్ల పవన్ కళ్యాణ్ తన ప్రత్యర్ధులకు ఆయుధాలు తానే అందిస్తున్నారు అని అంటున్నారు. నిజంగా ఆలోచిస్తే పవన్ అన్న దాంట్లో తప్పు లేదు. అపజయాల నుంచే విజయాలు వస్తాయి. కానీ రాజకీయాల్లో ఎంతమంది ఓటమిని అంగీకరిస్తారు. అలా చెప్పే గట్స్ ఎంతమందికి ఉంటాయి. టీడీపీ విషయమే తీసుకుంటే తాము ఓడలేదనే ఈ రోజుకీ చెబుతారు.

పైగా జనాలే ఓడించారని, వారిని వైసీపీ మభ్యపెట్టిందని కవరింగ్ ఇచ్చుకుంటారు దాన్నే వ్యూహ రచన అంటారు. మరి పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధినేతగా ఉంటూ ఇలాంటి బోల్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల తనకు వ్యక్తిగతంగా లాభం కావచ్చు. మంచి మనిషిగా పేరు రావచ్చు కానీ పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది అన్న వారూ ఉన్నారు. నిజమే రాజకీయాల్లో ఉన్న తరువాత అన్ని విషయాలూ బయటకు చెప్పకూడదు, డిపాజిట్లు అవతల గల్లంతు అవుతున్నా కూడా గెలుస్తున్నామనే చెప్పాలి.

పైగా మనసులో ఎన్నో ఉంటాయి. అలాగే ఎన్నో జరుగుతాయి. అన్నీ కూడా బయటేసుకుంటే వాటిని పట్టుకుని విపక్షాలు చేయాల్సిన రచ్చ చేస్తాయి. వాటికి కోరి మరీ సమాధానం చెప్పుకోవాలా అన్న చర్చ కూడా ఉంది. మరో వైపు చూస్తే పవన్ కళ్యాణ్ మీద ఆశలు పెట్టుకున్న జనసేన క్యాడర్ కూడా డీ మోరలైజ్ అవుతుంది అని అంటున్నారు. ఇక జనాలలో కూడా పొలిటికల్ మైలేజ్ రావాల్సింది రాకుండా పోతుంది అని అంటారు.

అదే విధంగా పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఫ్లాష్ బ్యాక్ ముచ్చట్లు చెబుతూ ఉంటారు. తన తండ్రి సాధారణ కానిస్టేబుల్ అని. దాని మీద కూడా ట్రోలింగ్ చేస్తూ ప్రత్యర్ధులు విమర్శలు చేస్తాయి. నిజానికి ఫ్లాష్ బ్యాక్ అయినా మరోటి అయినా సందర్భానికి తగినట్లుగా ఉంటేనే చెప్పాలి. అది కూడా ఒక వ్యూహం ప్రకారమే మాట్లాడాలి. ఇంతకాదాకా ఎందుకు కింద పడ్డా పై చేయి తమదే అని వాదించేలా రాజకీయ ప్రసంగాలు ఉండాలి. అపుడే ప్రజలలో కూడా నిబ్బరం కలుగుతుంది. కానీ పవన్ మాత్రం చాలా సార్లు కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడుతారు. దాని వల్లనే ఇబ్బందులు వస్తున్నాయని అంటున్నారు.

తాను సినిమాలు చేసుకుంటేనే జీవితం అని పవన్ చెప్పడంలో ఏ మాత్రం తప్పు లేదు, ఎందుకంటే అది ఆయన వృత్థి. కానీ దాన్ని ఆయన చెప్పినా ట్రోల్స్ చేసేవారు ఉన్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ నిజాయతీగా ఉండకూడదని ఎవరూ అనరు. కానీ ఆయన చెప్పాల్సినవి మాత్రమే బయటకు చెబితే బాగుంటుంది అన్నదే అభిమానులతో సహా అందరి సూచన. బోల్డ్ గా ఉంటే బోలెడు నష్టం కలుగుతుంది పవన్ అని శ్రేయోభిలాషులంతా చెప్పే మాట. మరి జనసేనాని దీనిని వింటారా.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.