Begin typing your search above and press return to search.

ఈట‌ల‌ను తొక్కేందుకే.. సంజ‌య్‌ను లేపుతున్నారా?

By:  Tupaki Desk   |   5 Jan 2022 2:30 AM GMT
ఈట‌ల‌ను తొక్కేందుకే.. సంజ‌య్‌ను లేపుతున్నారా?
X
రాజ‌కీయ చాణ‌క్యుడిగా పేరు తెచ్చుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాలు ఓ ప‌ట్టాన అర్థం కావ‌నే అభిప్రాయ‌లున్నాయి. ప్ర‌జ‌ల నాడీ తెలుసుకోవ‌డంలో స‌మ‌ర్థుడైన ఆయ‌న‌కు ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను ఎలా తొక్కేయాలో బాగా తెలుస‌ని అంటుంటారు. ముఖ్యంగా త‌న‌ను ఎదురించిన వాళ్ల‌ను అస్స‌లు వ‌దిలిపెట్ట‌ర‌ని చెబుతుంటారు. ఇప్పుడు రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు చూస్తుంటే అదే నిజ‌మ‌నిపిస్తోంది. రాష్ట్రంలో పుంజుకుంటున్న బీజేపీని అడ్డుకునేందుకు కేసీఆర్ అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు క‌నిపిస్తున్నారు. అంతే కాకుండా ఆ పార్టీలో ఈట‌ల రాజేంద‌ర్ పేరు ప్ర‌ముఖంగా వినిపించ‌కుండా ఉండాల‌ని బండి సంజ‌య్‌ను లేపుతున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఆ ఓట‌మితో..
భూ క‌బ్జా ఆరోప‌ణ‌ల‌తో మంత్రి వ‌ర్గం నుంచి త‌ప్పించ‌డంతో కేసీఆర్‌ను ఎదురించి టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈట‌ల రాజేంద‌ర్ ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీంతో ఏర్ప‌డిన హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఆయ‌న బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచారు. అక్క‌డ ఈట‌ల ఓట‌మి కోసం కేసీఆర్ ఎన్ని ఎత్తులు వేసినా ఫ‌లితం లేకుండా పోయింది. దీంతో ఈట‌ల‌పై కేసీఆర్ ఆగ్ర‌హం మ‌రింత పెరిగింద‌నే టాక్ ఉంది. అందుకే బీజేపీలో చేరిన‌ప్ప‌టికీ రాజ‌కీయంగా ఈట‌ల‌కు ప్రాధాన్య‌త ద‌క్క‌కూడ‌ద‌నే కేసీఆర్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది. అందుకే ఇటీవ‌ల స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఈట‌ల ప్రోత్సాహంతో టీఆర్ఎస్ రెబ‌ల్ అభ్య‌ర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ర‌వీంద‌ర్‌ను తిరిగి కేసీఆర్ పార్టీలోనే కొన‌సాగించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నిర్ణ‌యంతో ఈట‌ల‌ను న‌మ్ముకుంటే బీజేపీలోకి వెళ్ల‌లేర‌నే అభిప్రాయం క‌లిగించ‌డ‌మే కేసీఆర్ ల‌క్ష్యంగా తెలుస్తోంది.

ఈ వ్యూహంతో..
ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఎపిసోడ్‌తో ఈట‌లను మ‌రింత‌గా తొక్కేయాల‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఉద్యోగ‌, ఉపాధ్యాయుల బ‌దిలీల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవో 317ను స‌వ‌రించాల‌ని డిమాండ్ చేస్తూ జాగ‌ర‌ణ దీక్ష‌కు సంజ‌య్ పూనుకున్నారు. కానీ అందుకు అనుమ‌తి లేద‌ని పోలీసులు ఆయ‌న్ని బ‌ల‌వంతంగా అరెస్టు చేయ‌డం.. కోర్టులో ప్ర‌వేశ‌పెట్టి రిమాండ్‌కు తీసుకుని జైలుకు త‌ర‌లించ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయింది.

సంజ‌య్ అరెస్టుకు నిర‌స‌న‌గా ఆందోళ‌న‌లు చేసేందుకు రోడ్ల‌పైకి రావాల‌ని నిర్ణ‌యించుకున్న బీజేపీ నాయ‌కుల‌నూ పోలీసులు ఎక్క‌డికక్క‌డా అడ్డుకుంటున్నారు. దీంతో సంజయ్ విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఇంత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌డానికి ఏదో కార‌ణం ఉంద‌నే ప్ర‌చారం సాగుతోంది. దాని వెన‌క కేసీఆర్ వ్యూహం దాగి ఉంద‌ని నిపుణులు అంటున్నారు. తెలంగాణ బీజేపీలో ఎదిగేందుకు ప్ర‌య‌త్నిస్తున్న ఈట‌ల ప్ర‌స్తావ‌న రాకుండా ఉండేందుకే సంజ‌య్ కార్య‌క్ర‌మాల‌ను అడ్డుకుంటూ ఆయ‌న‌పై ఫోక‌స్ పెరిగేలా చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఈట‌ల‌కు అడ్డుక‌ట్ట వేసేందుకే సంజ‌య్‌పై కేసీఆర్ దృష్టి పెట్టార‌ని స‌మాచారం.