Begin typing your search above and press return to search.

పొలిటీషియన్స్ కు పుత్రోత్పాతం

By:  Tupaki Desk   |   8 March 2016 5:30 PM GMT
పొలిటీషియన్స్ కు పుత్రోత్పాతం
X
ఏ తల్లిదండ్రులైనా కూడా తమ పిల్లలు బాగా రాణించాలని... తమకంటే బాగా ఉన్నత స్థాయికి చేరాలని కోరుకుంటారు. ఇక మంచి స్థితిలో ఉన్న నేతలు వంటివారైతే తమ పిల్లల రాజకీయ భవిష్యత్తుకు వారే పునాదులు వేస్తారు. అలాంటి పునాదులపై ఎదిగిన నేతలు ఎందరో ఉన్నారు... ప్రస్తుత రాజకీయాల్లోనూ తల్లిదండ్రుల స్థాయికి తగ్గట్లుగా రాణిస్తూ, కొందరైతే తండ్రిని మించిన తనయులంటూ ప్రశంసలు కూడా అందుకుంటున్నారు. కానీ.... కొందరు నేతల పిల్లలు మాత్రం తమ ప్రవర్తనతో తల్లిదండ్రులకు చెడ్డపేరు తెస్తున్నారు. అంతేకాదు.... రాజకీయంగానూ వారిని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా మంత్రి రావెల కిశోర్ కుమారుడు సుశీల్ పై నిర్భయ కేసు నమోదైన నేపథ్యంలో రాజకీయ నేతల పిల్లల వ్యవహారాలపై ''తుపాకీ'' కథనం..

ఏపీ సోషల్ వెల్ఫేర్ మినిష్టర్ రావెల కిషోర్‌ బాబు కుమారుడు ఒక వివాహితతో అసభ్యకరంగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో నిర్భయ కేసు నమోదైంది. ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నాలుగు రోజులుగా చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం రావెల మంత్రి పదవికి ఎసరు తెచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే...
ఇంతకుముందు కూడా పలువురు నేతల తనయులు రకరకాల వివాదాల్లో చిక్కుకున్న దాఖలాలు ఉన్నాయి.

- మాజీ మంత్రి ఆనం తనయుడు రీసెంటుగా శివరాత్రి సందర్భంగా కాళహస్తి ఆలయంలో ఈవో భ్రమరాంబను బెదిరించారు..

- విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కుమారుడు యాక్సిడెంట్ చేయడంతో ఒకవ్యక్తి మృతి చెందడంపై వివాదమేర్పడింది. ఈ కేసును బొండా ఉమ తన పరపతి మాయ చేశారని వైసీపీ ఆరోపిస్తోంది.

- విజయవాడ ఈస్ట్ మరో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కుమారుడు పరాయిదేశంలో ఓ వివాదంలో ఇరుక్కున్నారు.

- వైసీపీకి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే కుమార్తె హైదరాబాద్ రోడ్లపై తప్పతాగి పోలీసులకు దొరికిపోయి వారితోనూ వివాదం పెట్టుకున్న సంగతి తెలిసిందే.

- మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు కూడా ఓసారి శంషాబాద్ విమానాశ్రయం వద్ద తప్పతాగి గొడవకు దిగడం.. పోలీసు కేసు కావడం తెలిసిందే.

- సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా ఓ కానిస్టేబుల్ ను కొట్టిన ఘటన గతంలో వివాదం రేపింది.

- మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణప్రసాద్ గతంలో తమ ఇంట్లో పనిచేసే ఒక దళిత బాలికపై అత్యాచార యత్నం చేసాడనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి

...వీరే కాకుండా ఇంకా చాలామంది వివిధ వివాదాలకు కారణమవుతున్నారు. కొందరి గొడవలు, దారుణాలు బయటకు రాకుండా ముందే అడ్డుకుంటున్నారు. కొన్ని మాత్రం బయటకొస్తున్నాయి. కొన్ని కేసుల్లో ఏదో రకంగా రాజీయో సర్దుబాటో చేసుకుంటున్నా ఒక్కోసారి మాత్రం అలా కుదరక రచ్చరచ్చగా మారుతోంది. తాజాగా రావెల తనయుడి ఉదంతం అందుకు ఉదాహరణ.

ఇలా పుత్రరత్నాల కారణంగా నేతలు పరువు పోగొట్టుకోవడమే కాకుండా ఆ ప్రభావంతో ప్రజల్లోనూ చులకనవుతున్నారు.. ఒక్కోసారి పదవులూ పోగొట్టుకుంటున్నారు.

-- గరుడ