Begin typing your search above and press return to search.

ప‌ని చేయ‌క్క‌ర్లేదు.. ప‌థ‌కాలున్నాయిగా..!

By:  Tupaki Desk   |   18 Oct 2018 4:58 AM GMT
ప‌ని చేయ‌క్క‌ర్లేదు.. ప‌థ‌కాలున్నాయిగా..!
X
రెక్కాడితే కానీ డొక్కాడ‌ని జీవితాల‌న్న మాట‌ల్ని మ‌డిచి ఎక్క‌డో పెట్టాల్సిన టైం వ‌చ్చేసింది. ఓట్లను దండుకోవ‌టానికి ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న రాజ‌కీయ పార్టీల తీరుతో సంక్షేమ ప‌థ‌కాల పేరుతో భ‌విష్య‌త్ త‌రాల జీవితాల్ని ఆడుకోవ‌టానికి నేత‌లు వేస్తున్న ప్లాన్లు చూస్తే ఒళ్లు మండ‌క మాన‌దు.

స‌గ‌టు జీవి కిందా మీదా ప‌డి నాలుగు రాళ్ల కోసం రోజు మొత్తం గొడ్డులా ప‌ని చేస్తుంటే.. అత‌గాడు ప‌ని చేసిన దానికి ప్రొఫెష‌న‌ల్ ట్యాక్స్.. ఇన్ కం ట్యాక్స్ వ‌గైరా.. వ‌గైరా క‌ట్ చేసి చేతిలో డ‌బ్బులు పెడ‌తారు. ఆ డ‌బ్బుల్ని తీసుకొని ఏదైనా కొంటే.. దానికి మ‌ళ్లీ జీఎస్టీ అని ప‌న్ను వేస్తారు. ఇలా మొద‌ల‌య్యే ప‌న్ను బాదుడు.. చివ‌ర‌కు రోగ‌మొచ్చి ఆసుప‌త్రికి వెళ్లి.. వైద్యం చేయించుకుంటే.. అక్క‌డా జీఎస్టీ పోటు క‌నిపిస్తుంది. ఇలా ప‌న్ను క‌ట్టిన త‌ర్వాత చేతికి వ‌చ్చే ఆదాయానికి సైతం అదే ప‌నిగా ప‌న్ను క‌ట్ట‌టం చూస్తే.. ప‌న్నులు క‌ట్టేందుకే బ‌తుకుతున్నామా? అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

ఇదంతా ఎందుకు? ప‌ని చేస్తున్నందుకేగా? గొడ్డులా ప‌ని చేస్తేనే బ‌తుకుబండి లాగ‌టం క‌ష్టంగా ఉంద‌నే వారికి.. అస‌లు ప‌ని అనేది లేకుండానే బ‌తికేయొచ్చు అంటే కామెడీగా చూస్తారు. కానీ.. తాజాగా కేసీఆర్ ప్ర‌క‌టించిన తాయిలాల్ని చూస్తే.. ప‌ని చేయాల్సిన అవ‌స‌రం లేకుండానే సింఫుల్ గా బ‌తికేసే వీలుంద‌ని చెబుతున్నారు.

ఎన్నిక‌ల హామీల పేరుతో కేసీఆర్ ప్ర‌క‌టించిన తాయిలాల నేప‌థ్యంలో ఒక సామాన్యుడి ప‌ని అన్న‌ది ఎంత చ‌క్క‌గా బ‌తికేయొచ్చో చెప్పే లెక్క ఒక‌టి వైర‌ల్ అవుతోంది. ఆ లెక్క‌ను చూస్తే.. నిజ‌మే క‌దా? అనిపించ‌క మాన‌దు.

ఒక ఇంట్లో అవ్వ‌.. వ‌య‌సు మీద ప‌డిన అమ్మానాన్న.. ఉద్యోగం లేని కొడుకు ఉన్నాడ‌నుకుందాం? వారి జీవితం ఎలా సాగుతుంద‌న్న భ‌యం అక్క‌ర్లేదు. ఎందుకంటే.. ఇంట్లో అవ్వ‌కు వృద్ధాప్య పింఛ‌న్ కింద రూ.2016 వ‌స్తుంది. ఇక‌.. ఇంట్లో త‌ల్లి బీడీ కార్మికులురాలు అయితే నెల‌కు రూ.2016.. తండ్రికి వృదాప్య పింఛ‌న్ కింద నెల‌కు రూ.2016.. ఇక ఉద్యోగం లేని కొడుక్కి రూ.3016 వ‌స్తుంది. అంటే.. వీరి మొత్తానికి నెల‌కు ప్ర‌భుత్వం ఇచ్చే మొత్తం ఏకంగా రూ.9064. ఇవి కాక‌.. స‌న్న బియ్యంతో పాటు.. డ‌బుల్ బెడ్రూం ఇల్లు ఉండ‌నే ఉంది. మూడు త‌రాలు ఉన్న ఇంటిని క‌నీసం రెండు ఆప్లికేష‌న్లు పెట్టుకున్నా రెండు ఇళ్లు. అందులో ఒక ఇల్లు అద్దెకు ఇచ్చేస్తే.. దాని అద్దె అద‌నం అవుతుంది.

అంతేనా.. ఈ చిన్న కుటుంబానికి రెండు ఎక‌రాల పొలం ఉంద‌ని అనుకుందాం. పంట పండించే అల‌వాటు లేద‌నుకుందాం. అయినా..కొంప‌లు మున‌గ‌వు. ఎందుకంటే.. ఏటా ఎక‌రానికి రూ.10వేలు చొప్పున రూ.20వేలు వ‌స్తాయి. ఇవి కాక‌.. ఎక‌రానికి హీనంగా వేసుకున్నా రూ.15వేల చొప్పున కౌలు వ‌స్తుంది. అంటే.. పొలం మీద ఎలాంటి క‌ష్టం లేకుండా వ‌చ్చే మొత్తం 55వేలు. అంటే.. నెల‌కు ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర 5వేలు (చిల్ల‌ర కాస్త పెంచి రౌండ్ ఫిగ‌ర్ చేశాం) అంటే.. పైన చెప్పిన రూ.10వేల‌కు మ‌రో ఐదు వేలు.

దీనికి తోడు.. ఉద్యోగం లేని కుర్రాడు పెళ్లి చేసుకుంటే.. స‌ద‌రు భార్య ద్వారా వ‌చ్చే క‌ల్యాణ‌ల‌క్ష్మి మొత్తం అద‌నం. ఒక‌వేళ‌.. పిల్ల‌ల్ని కంటే కేసీఆర్ కిట్.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎలాంటి ప‌ని చేయ‌కుండా ప్ర‌భుత్వం ఇచ్చే ప‌థ‌కాల్ని వినియోగిస్తే.. హ్యాపీగా బ‌తికేయొచ్చు. ఏంటారు? ఎవ‌డ్రా.. ప‌ని చేస్తే కానీ బ‌త‌లేరంది?