Begin typing your search above and press return to search.

ఫోన్ల చుట్టూనే రాజ‌కీయాలు

By:  Tupaki Desk   |   21 July 2021 9:30 AM GMT
ఫోన్ల చుట్టూనే రాజ‌కీయాలు
X
మ‌న చేతిలో ఇమిడిపోయి మ‌న‌ల్నే త‌న చుట్టూ తిప్పుకునే సెల్‌ఫోన్ ఇప్పుడు దేశ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌ల‌కు కార‌ణంగా మారింది. స్మార్ట్‌ఫోన్ వ‌చ్చాక ప్ర‌జ‌ల జీవితాల్లో అందులో బందీ అయిపోయిన సంగ‌తి తెలిసిందే. అన్ని విష‌యాలు అందులోనే ఉంటున్నాయి. ఈ నేప‌థ్యంలోనే పెగాస‌న్ సాఫ్ట్‌వేర్‌ను ఉప‌యోగించి దేశంలోనా రాజ‌కీయ నాయ‌కులు, వ్యాపార‌వేత్త‌లు, పాత్రికేయులు ఇలా 300 మంది ప్ర‌ముఖుల ఫోన్ల‌ను హ్యాక్ చేసిన‌ట్లు వ‌చ్చిన ఓ క‌థ‌నం సంచ‌న‌లంగా మారింది. దీనిపై కేంద్ర ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌తో ప్ర‌తిప‌క్షాలు పార్ల‌మెంట్‌ను స్తంభింప‌జేస్తున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో దేశంతో పాటు ఇటు తెలుగు రాష్ట్రల్లోనూ ఈ చ‌ల్ల‌టి వ‌ర్షాకాలంలో వేడి రాజ‌కీయాల‌కు ఫోన్లు కేంద్రంగా మారాయి.

వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘురామ‌కృష్ణంరాజుపై రాజ‌ద్రోహం కేసులో సుప్రీం కోర్టులో విచార‌ణ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ కేసులో ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అధికార జ‌గ‌న్ ప్రభుత్వంపై దుష్ప్ర‌చారం చేసేందుకు ర‌ఘురామ డ‌బ్బులు తీసుకున్నార‌ని, దాని వెన‌క రెండు తెలుగు ఛానెళ్ల‌తో పాటు టీడీపీ హ‌స్తం ఉంద‌ని ఆ అఫిడ‌విట్‌లో పేర్కొన‌డం సంచ‌ల‌నంగా మారింది. అయితే ఏపీ ప్ర‌భుత్వంపై సుప్రీం కోర్టులో ఇంత ధైర్యంగా అఫిడ‌విట్‌లో ఈ విష‌యాలు పేర్కొన‌డం వెన‌క త‌గిన ఆధారాలున్నాయ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. అందుకు ర‌ఘురామ ఫోన్‌లోని స‌మాచార‌మే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

అరెస్ట్ చేసిన‌పుడు ఈ ఫోన్ కోస‌మే సీఐడీ పోలీసులు త‌న‌ను కొట్టార‌ని ర‌ఘురామ ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. త‌న మొబైల్లో కీల‌క‌మైన స‌మాచారం ఉంది కాబ‌ట్టే ఫోన్ ఇవ్వ‌డానికి ఎంపీ మొద‌ట ఒప్పుకోలేద‌ని తెలుస్తోంది. ఈ ఫోన్లో ఆర్థిక లావాదేవీల‌తో పాటు చంద్ర‌బాబు నాయుడు, లోకేష్‌తో జ‌రిపిన వాట్స‌ప్‌, ఎస్ఎంఎస్ మెసేజులు ఉన్నాయ‌ని టాక్‌. మ‌రోవైపు మీడియా యాజ‌మాన్యాల‌తో న‌డిపిన బేర‌సారాలు కూడా ఇందులోనే ఉన్నాయ‌ని స‌మాచారం. దీంతో ఇప్పుడు ఈ ఫోన్ ఆధారంగానే ఏపీ అఫిడ‌విట్ దాఖ‌లు చేసింద‌నే స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది.

ఇటు తెలంగాణ‌లోనూ పెగాస‌స్ వ్య‌వ‌హారం వేడి పెంచుతోంది. గ‌తంలో కేసీఆర్ త‌న ఫోన్‌ను హ్యాక్ చేశారని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి తాజాగా ఆరోపించారు. మ‌రోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్‌లోనే ఉండి టీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున త‌న‌కు టికెట్ వ‌స్తుంద‌ని, ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉండాల‌ని కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఆడియో లీక్ సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టాల‌న్న కేసీఆర్ వ్యూహం విఫ‌ల‌మైంద‌నే అభిప్రాయాలు వినిపించాయి. కౌశిక్‌పై కాంగ్రెస్ బ‌హిష్క‌ర‌ణ వేటు వేయ‌డంతో ఆ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్‌.. త్వ‌ర‌లోనే కారెక్కే అవ‌కాశాలున్నాయి. ఇలా మొత్తంగా అటు కేంద్రంలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ ప్ర‌కంప‌న‌ల‌కు ఫోన్లే కార‌ణ‌మ‌య్యాయి.