Begin typing your search above and press return to search.

పోల‌వ‌రం టాపిక్‌.. వెనుక రాజ‌కీయం ఏంటి?

By:  Tupaki Desk   |   20 July 2022 6:30 AM GMT
పోల‌వ‌రం టాపిక్‌.. వెనుక రాజ‌కీయం ఏంటి?
X
అనూహ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల మ‌ద్య పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది. వాస్త‌వానికి పోల‌వ‌రం ప్రాజెక్టు ఇప్పుడు కొత్త‌ది కాదు. పోల‌వ‌రం పేరుతో ఐదు మండ‌లాల‌ను ఏపీలో విలీనం చేయ‌డం కూడా ఇప్పుడు కొత్త‌దికాదు., ఇంకా చెప్పాలంటే.. పోల‌వ‌రం మండ‌లాలైన‌.. కుక్కునూరు త‌దిత‌ర ప్రాంతాల‌ను ఏపీలో విలీనం కూడా అంత ఈజీగా అయితే.. జ‌రిగి పోలేదు. 2015లో పార్ల‌మెంటులో దీనిపై రెండు రోజులు చ‌ర్చించిన త‌ర్వాత‌.. త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని.. తెలంగాణ చెప్పిన త‌ర్వాత‌.. కేంద్రం ఏపీలో విలీనం చేస్తూ.. నిర్న‌యం తీసుకుంది.

ఈ విష‌యాన్ని అప్ప‌టి నిజామాబాద్ ఎంపీగా కేసీఆర్ కుమార్తె క‌విత కూడా ప‌లు సంద‌ర్భాల్లో చెప్పుకొచ్చారు. మేం అనుమ‌తిం చబ‌ట్టే.. విలీన మండ‌లాలు ఏపీలో క‌లిశాయ‌న్నారు.

అలాంటిది ఇప్పుడు మంత్రి అజయ్ అవే మండ‌లాల‌ను కేంద్రంగా చేసు కుని.,. ఇప్పుడు కామెంట్లు చేయ‌డం.. వెంట వెంట‌నే.. ఇద్ద‌రు ఏపీ మంత్రులు ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డం వంటివి రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీసింది. ఇది వ్యూహాత్మ‌క‌మేన‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. ఎందుకంటే.. అనేక సంద‌ర్భాల్లో తెలంగాణ మంత్రులు ఏపీని విమ‌ర్శించారు. ఇటీవ‌ల కూడా.. మంత్రి హ‌రీష్‌రావు ఏపీ అప్పుల‌పై తీవ్ర వ్యాఖ్య‌లే చేశారు.

అప్పుడు లేని.. బాధ ఇప్పుడు విలీన మండలాల‌పై... అజ‌య్ వ్యాఖ్య‌లు చేసేస‌రికి ఏపీ నుంచి ఒక‌రు కాదు.. ఇద్ద‌రు మంత్రులు వెంట వెంట‌నే స్పందించారు. భ‌ద్రాచలం ఇవ్వ‌మంటే.. ఇస్తారా? హైద‌రాబాద్‌ను కావాలంటే.. వ‌దుల‌కుంటారా? రెండు తెలుగు రాష్ట్రాల‌ను మ‌ళ్లీ ఏకం చేయ‌మంటే చేస్తారా? అంటూ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీనిపైనే ఇప్పుడు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతు న్నాయి. ఎందుకంటే.. రెండు తెలుగు రాష్ట్రాల‌ను కూడా.. గోదావ‌రి వ‌ర‌ద‌.. భారీ గా ముంచేసింది. ఎంత చేసినా.. బాధితుల‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేదు. ఇటు ఏపీలోను.. అటు తెలంగాణ‌లోనూ.. ఇదే ప‌రిస్థితి ఉంది.

దీనిపై అటు తెలంగాణ‌లోను.. ఇటు ఏపీలో ప్ర‌తిప‌క్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ ప‌రిణామాలు.. స‌హ‌జంగానే ఎన్నిక‌ల‌కు ముందు తెలంగాణ ప్ర‌భుత్వాన్ని.. ఇప్ప‌టికే ఇబ్బందుల్లో ఉన్న ఏపీ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే సీఎం కేసీఆర్‌.. క్లౌడ్ బ‌ర‌స్ట్ అంటూ.. టాపిక్‌ను డైవ‌ర్ట్ చేసే ప్ర‌య‌త్నం చేశార‌నే వాద‌న వినిపించింది. అయితే.. ఇది అంత‌గా చ‌ర్చ‌కు రాలేదు.

ఈ క్ర‌మంలో.. ఇప్పుడు ఇరు ప్రాంతాల మ‌ధ్య ఉన్న సెంటిమెంటును మ‌రోసారి స్పృశించ‌డం ద్వారా.. వ‌ర‌ద తాలూకు సెగ‌ల నుంచి ప్ర‌భుత్వాలు.. త‌ప్పించుకునేందుకు వ్యూహాత్మ‌కంగా వేసిన‌.. అడుగులుగా రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఏదేమైనా.. ఇప్పుడు వీరి మాట‌ల‌పైనే టాపిక్ న‌డ‌వ‌డంతో వ‌ర‌ద‌ల‌పై మాట్లాడే గొంతులు మూగ‌బోయిన‌ట్టే అవుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.